మూడు నేషనల్ అవార్డులు సాధించిన సూపర్‌స్టార్.. కాదు. తెలుగులో ఏక్ నిరంజన్’ సినిమాతో పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్.. కాదు. హృతిక్ రోషన్‌తో ప్రేమ వ్యవహారంలో వార్తల్లో కనిపిస్తూ ఉండే స్టార్.. కాదు. కంగనా రనౌత్ అంటే ఇది కాకుండా ఇంకేంటి అంటారా? ఇవన్నీ కాదు అనట్లేదు కానీ, కంగనా అంటే ఇది మాత్రమే కాదు.
బ్రెడ్డు ముక్కకూ కష్టపడాలి!
కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని బాంబ్లాలో పుట్టి పెరిగింది (మార్చి 23, 1986). రాజకుటుంబం. అమ్మా, నాన్నా అంతా చదువుకున్నవాళ్లే. ఆర్థిక సమస్యలు అంటూ ఉండవు. పెద్ద ఇల్లు. ఇల్లంతా మనుషులే. అలాంటి ఇంట్లో పెరిగిన కంగనా, చాలా మంది అమ్మాయిల్లానే డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ తనకు ఇష్టమైంది ఇంకేదో ఉంది. ఢిల్లీకి వెళ్లిపోతానంది. ‘నా దగ్గర్నుంచి ఒక్క రూపాయి సాయం ఉండదు’ అన్నాడు వాళ్ల నాన్న. అయినా వెళ్లిపోయింది. ఢిల్లీలో మోడలింగ్ తన జాబ్ కాదు. ఇంకేదో ఉంది. ముంబైలో దిగింది. యాక్టింగ్ తన లైఫ్. అదే విషయాన్ని బలంగా నమ్మింది. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగింది. బ్రెడ్డు ముక్క తినాలన్నా కష్టపడాలి. ఇంటికి వెళ్లిపోతే ఈ బాధలేం ఉండవు. కానీ తను నమ్మింది చేయాల్సిందంతే. ‘గ్యాంగ్‌స్టర్’ (2006) అనే సినిమాలో అవకాశం వచ్చింది. కంగనా నిలబడింది.
‘బోల్డ్’గా నిలబడింది!
కంగనా రనౌత్ ఎలాంటి విషయాన్నైనా నిర్భయంగా చెప్పగలదు. ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యంతోనే బోలెడన్ని బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. ఇండస్ట్రీలో గుడ్ ఫ్రెండ్స్ అనేవారు ఉండరు. అదంతా వేరే టైప్ బ్యాచ్ అంటుంది. తన ప్రేమ గురించి, బ్రేకప్ గురించి ప్రపంచానికి నిర్మొహమాటంగానే చెప్పేస్తుంది. ఆదిత్యా పంచోలితో ప్రేమ వ్యవహారం, అద్యాయన్ సుమన్‌తో లవ్, ఇప్పుడు హృతిక్ రోషన్‌తో పెద్ద గొడవ.. అన్ని వ్యవహారాల్లోనూ కంగనా ఎప్పుడూ కూలిపోలేదు. ఎప్పుడూ నిలబడే తన అభిప్రాయాలను, తన పాయింట్‌ను చెప్పుకొస్తోంది. సవాళ్లకే సవాల్...
కంగనా రనౌత్.
నిజంగానే ‘క్వీన్’!
కంగనా రనౌత్ పెద్ద సినిమాల్లో (అంటే మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల్లో) కనిపిస్తే ఆ సినిమాలు పెద్దగా ఆడవన్నారు. చిన్న సినిమాల్లో ఆమె పాత్రకే అంత స్థాయి ఉండదన్నారు. కంగనా ఈ కామెంట్స్ అన్నింటికీ నిలబడింది. నిలబడింది కాబట్టే ‘తను వెడ్స్ మను’ సిరీస్‌లో అంత పెద్ద క్యారెక్టర్స్‡చేసింది. ‘క్వీన్’ సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. కమర్షియల్ సినిమాకు సమాంతరంగా ఎదిగిన స్టార్
కంగనా రనౌత్.
‘నువ్వు మాట్లాడొద్దు’ అన్నారు!
కంగనా రనౌత్ చాలా తెలివైంది. కానీ ఆమె మాట్లాడటం మొదలుపెడితే చాలు.. ‘నువ్వు మాట్లాడొద్దు!’ అని మొహం మీదే అనేసారంతా. ఎందుకంటే.. ‘నీకు ఇంగ్లిష్ రాదు’ అనేవారు. ఇక్కడితో ఆగిపోలేదు. ‘నీ పని నువ్వు చేసుకొని పో’ అని నేరుగానే చెప్పేశారు. కంగనా భయపడలేదు. భయపడితే తను కంగనా కాదు. నిలబడింది. ఇప్పుడు కంగనా మాట్లాడుతూ ఉంటే ఆపమనే వారు లేరు.
Comments
Please login to add a commentAdd a comment