తెల్లబోయిన సమాజం | Why do avg girl in the shade? | Sakshi
Sakshi News home page

తెల్లబోయిన సమాజం

Published Sun, Jul 5 2015 10:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

తెల్లబోయిన సమాజం

తెల్లబోయిన సమాజం

చామన ఛాయ అమ్మాయిని ఎందుకు చేసుకోరు? ఈ ప్రశ్నకు సమాధానం అడిగితే చాలామంది తెల్లమొహం వేస్తారు. వివాహ ప్రకటనలు ఏవి చూసినా అందులో ఎక్కువ శాతం అమ్మాయి ‘ఫెయిర్‌గా’... అంటే తెల్లగా ఉండాలని ఉంటుంది.
ఎంత ‘అన్‌ఫెయిర్’ కోరిక అది. తెల్ల దొరలను తరిమికొట్టిన గొప్ప చరిత్ర మనది. ఏం లాభం ఇంకా తెల్ల దయ్యం వదల్లేదు.
పోనీ కాకిపిల్ల కాకికి ముద్దు అని సరిపెట్టుకుందామంటే... పేరెంట్స్ కూడా అమ్మాయిలను మానసిక వ్యథకు గురిచేస్తున్నారు.


మనస్సు రంగు చూసేవారు కరువైన ఈ నల్లటి సమాజానికి నిజంగా సిగ్గులేదు. సినిమాల్లో, టీవీ సీరియళ్లలో, ఎయిర్‌హోస్టెస్‌లలో, రిసెప్షనిస్ట్‌లలో... ఎక్కడా నల్లబంగారాలు కనబడరు. వాల్యూస్ తగలడ్డాయి. మానవత్వం వైట్‌వాష్ అయిపోయింది. సమాజం తెల్లబోయింది. సమాజం గొడవ దేవుడెరుగు, పాపం మన అమ్మాయిల మనస్సులు ఎంతగా ఛిద్రమైపోతున్నాయో! మారదాం... మార్చుదాం... రంగు కాదు... మనస్సు!

 
సుశీలకు ఇద్దరు పిల్లలు. బాబు తెల్లగా పుట్టాడు. పాప నలుపు. సుశీల దిగులు పిల్లలతో పాటే పెరుగుతోంది. నలుగురిలో కూర్చున్నప్పుడు ఆమె తరచూ అనే మాట- ‘మా బాబు రంగు పాపకు వచ్చి, పాప రంగు బాబుకు వస్తే బాగుండేది’ అని. కానీ... ఆ కూతురు చదువుల తల్లిలా మారితేనో, పెద్ద ఉద్యోగాలు పొందితేనో, సెరినాలా ఏదైనా సాధిస్తేనో, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్‌లలా రోదసీ రహస్యాలను శోధిస్తూ పోతేనో... కోరి కోరి వరుడు ఆమె ప్రేమనే వరమడగవచ్చేమో అన్న భావన ఆ అమాయక తల్లిలో లేదు. సమాజంలో ఆ భావన ఎప్పటికొస్తుంది?!
   
రాణి పెళ్లీడుకు వచ్చింది. ఈ మధ్య బ్యూటీ టిప్స్ చదవడం ఎక్కువ చేసింది. ఉద్యోగానికి సెలవు పెట్టేసింది. ఒకరోజు పుదీనా ప్యాక్ ముఖానికి రాసుకుంటుంది. మరో రోజు టొమాటో, కీరా గుజ్జును చెంపలకు అప్లై చేస్తుంది. ఇంకో రోజు నారింజ పండ్ల రసాన్ని నుదురంతా రుద్దుకుంటుంది. బ్యూటీపార్లర్‌లకు ఆమె రాకపోకలు అన్నీ ఇన్నీ కావు. చివరకు రాణి ఎంత దూరం వెళ్లిందంటే లేజర్ ట్రీట్‌మెంట్‌ను కూడా తీసుకోవాలనుకుంది. ఇదంతా ఎందుకు? ప్రతి పెళ్లికొడుకూ అమ్మాయి తెల్లగా ఉండాలంటున్నాడు. అదేమంటే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఉండాలట. కనుక తను న్యూనతకు లోనవుతూ ఈ హింసను తెచ్చి పెట్టుకుంది. నల్లగా ఉందన్న కారణంతో నిశ్చితార్థం రోజున పెరగబోయే కట్నానికి భయపడుతూనే ఉండాలా?!
   
సుకన్య రంగు చామనచాయ కన్నా కాస్త తక్కువే. చదువుకు తగిన ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఫలితం ఏమవుతుందో అని సుకన్యే కాదు, ఆమె తల్లిదండ్రులూ కొన్ని రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ఒక నల్లటి పిల్లపైన సమాజం పెట్టే ఒత్తిడి తగ్గేదెప్పుడు?! మేట్రిమోని కాలమ్ తెరవాలంటే చాలామంది ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులూ జంకుతున్నారు. ఏ అబ్బాయి యాడ్ చూసినా ‘ఫెయిర్’గా ఉండే అమ్మాయి కావాలనే కోరికే. ‘రంగు పట్టింపు లేదు’ అనే మాట చూద్దామన్నా కనపడటం లేదు. అమ్మాయి తెల్లగా ఉంటే కట్నం అక్కర్లేదు అంటూ ఆ రంగుకు నజరానా ప్రకటిస్తున్నారు. పిల్లలు, పిల్లల పిల్లలూ తెల్లగా మారిపోయి వంశం మొత్తమూ తరాల పాటు తెల్లగా మారిపోవాలనే ఆలోచనలో నలుపు స్థానం ఎక్కడ?!
 
దక్షిణాది స్పెషల్
 దక్షిణాది సౌందర్యానికి నలుపే అసలైన చిహ్నం. కాటుక కళ్లు, నీలాల కురులు, చామనఛాయ... ఇవి ప్రబంధాలలో నాయికలకు సౌందర్య కారకాలయ్యాయి. స్త్రీ గుణగణాలకు ఉన్న విలువ... రంగుకు ఉండేది కాదు. అతిలోక సుందరి అంటే చక్కటి రూపు, పొందికైన ఆకారం గురించే చెప్పారు తప్ప ఆమె వర్ణం తెలుపు అయి ఉండాలని ఎక్కడా చెప్పలేదు. రాను రాను తెలుపు పై చేయి తీసుకుంది. నలుపును కింద పడేసింది. పుట్టుక నుంచే రంగు మీద మారు పేర్లు పెట్టడం! మొత్తంగా బాల్యం నుంచే ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేసే ప్రక్రియ! అసలు ఈ ధోరణి ఇది ఎలా మొదలయ్యింది?


 ‘తెల్ల’దొరల చలవే (నా)!
 
బ్రిటిష్‌వారు మన దేశాన్ని అనేక విధాలుగా దివాలా తీయించారు. చివరకు మన ఆలోచనా తీరును కూడా. నాలుగు వందల ఏళ్ల పాటు మన మీద పెత్తనం చేసిన తెల్లవాళ్లు క్రమంగా తెలుపును ఒక మేలిమి అర్హతగా మన మెదళ్లలోకి ఎక్కించగలిగారు. ‘వైట్ ఈజ్ దెయిర్స్’ అన్నారు మన వాళ్లు. కనుక తెల్లరంగు బ్రిటిష్ వాళ్లది అయ్యింది. నల్లరంగు భారతీయులది అయ్యింది. అంటే నలుపు పరోక్షంగా బానిస రంగు అనే భావన స్థిరపడింది. ఈ ప్రభావం ఎంతగా బలపడిందంటే చామన ఛాయ ఉండే కేరళ ప్రాంతం నుంచి తయారైన గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ తాను రూపం ఇచ్చిన దేవతామూర్తులందరి ఒంటి రంగు తెలుపు చేశాడు. కాలక్రమంలో తెలుపు... దేవతల వర్ణంగా, నలుపు దానవుల వర్ణంగా అవతరించింది. నలుపు మీద అయిష్టత మొదలైంది.
 
సినిమాల్లోనూ తెలుపుదే పైచేయి
 హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. ఏ ఉడ్‌లోనైనా హీరోయిన్లు తెల్లనివాళ్లే. నర్గిస్, వహిదా రెహమాన్, ఆశా పరేఖ్, ముంతాజ్, మధుబాల, హేమమాలిని... అంతెందుకు ఇవాళ్టి కరీనా కపూర్, కత్రీనా కైఫ్, కంగనా రనౌత్ వరకూ కూడా తెల్లగా ఉన్నవాళ్లే స్టార్లుగా చలామణి అయ్యారు. వీరి మధ్య కాజల్ వంటి వారు కేవలం మినహాయింపుగా నిలబడ్డారు. తెలుగు సినిమాల్లో నల్లటి లేదా చామచాయ లేనివారు లేరని కాదు. వాణిశ్రీ, శారద, సరిత, భానుప్రియ, రోజా వంటి వారు ఉన్నా, వారిని తెల్లగా చూపించడానికి విపరీతంగా మేకప్ చేసేవారు. నందితా దాస్, ఉషా జాధవ్ వంటి వాళ్లు ఇందుకు మినహాయింపు. వాళ్లు నల్లగానే తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
 
మార్కెట్ వలచిందీ తెలుపునే!
 తెల్లగా ఉండటాన్ని ఒక నాగరిక విలువగా ప్రతిపాదించడమే కాక దానిని మెల్లగా బుర్రలకు ఎక్కించింది ప్రధానంగా మార్కెట్. నీళ్లు, నదులు విస్తారంగా ఉండే దక్షిణాది ప్రాంతంలో ప్రవాహంలో నాలుగు మునకలు వేయడం లేదా బావి వద్ద నిలుచుని నాలుగు చేదలు గుమ్మరించుకోవడమే స్నానం అయినప్పుడు సబ్బును అలవాటు చేయడానికి మేని రంగును ఒక ఆయుధంగా వాడింది మార్కెట్. అంతేకాదు, తెల్లరంగు ఉంటే సమాజంలో అనేక కష్టాలను దాటొచ్చు అనేంత భరోసాను కల్పించింది.

పొద్దున లేవగానే టీవీలో ఓ ప్రకటన కనిపిస్తుంది. ‘ఇవ్వాళ బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్తున్నా’ అంటుంది ఓ అమ్మాయి. ‘ఈ క్రీమ్ పూసుకోవా?’ అని నిలదీస్తుంది వెనకనుంచి ఓ గొంతు. ఐదు నిమిషాలలో తెల్లగా అయ్యే క్రీమ్ పూసుకొని పోవాలట. ఏం... బాయ్‌ఫ్రెండ్‌కు తెల్లగా కనిపించే తీరాలా? మేని రంగు కంటే ఉజ్వలమైన మనసు రంగును చూడవచ్చు గదా? ఇదీ మహిళలు తెలుసుకోవాల్సిన మాటే కానీ, ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే మగవాళ్లే.


వివక్ష దూరం కాదా?
పెళ్లి అనగానే అబ్బాయి అయినా, వారి తల్లిదండ్రులైనా మొదటగా తెల్లటి అమ్మాయి కోసమే చూస్తారు. నల్లగా ఉన్న ఎంతోమంది మోడల్స్, హీరోయిన్స్ మన కళ్ల ముందే ఉన్నా ఈ వివక్ష పోవడం లేదంటే అది మన దురదృష్టం.  
- వీరజారావ్, సైకాలజిస్ట్
 
తెలుపే అడుగుతుంటారు

పద్నాలుగేళ్ల నుంచీ మ్యారేజ్ బ్యూరో నిర్వహిస్తున్నాను. అప్పటికీ ఇప్పటికీ శరీర రంగు పై ఉన్న అభిప్రాయాలు మారలేదు. తెలుపంటేనే అందం అన్న భావన పోలేదు. నలుపును అంగీకరించే వాళ్లు చాలా తక్కువ. ఏ అబ్బాయి తరఫువారు వచ్చినా ముందు తెల్లటి అమ్మాయి కావాలనే అడుగుతున్నారు. అమ్మాయి తెల్లగా ఉంటే ఆమెకు చదువు, ఉద్యోగం, ఆస్తిలాంటివి పెద్దగా లేకున్నా పట్టించుకోరు.   
- కె.సి.రెడ్డి, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు
 
నల్లగా ఉన్నానని..
ఎమ్‌టెక్ చేశాను. టీసీఎస్‌లో ఉద్యోగం. ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటాను. అయినా ఓ ఇరవై సంబంధాల వరకు రిజెక్ట్ అయ్యాయి. రీజన్.. నల్లగా ఉన్నానని. అందాన్ని నలుపు, తెలుపులతో తూకం వేస్తున్న వాళ్ల వల్లే నలుపంటే చిరాకు పుడుతోంది. అఫ్‌కోర్స్  అలా తూకమేస్తున్న వాళ్ల మీద సింపతీ కూడా ఉందనుకోండి.
- శ్రావణి, అమీర్‌పేట, హైదరాబాద్

పిల్లలు తెల్లగా పుడతారని..
నాకు ఒక్కడే కొడుకు. వాడిది మంచి రంగు. అంతే తెలుపుతో నా కొడుక్కి తగ్గ కోడలు రావాలని చాలా సంబంధాలే చూశాం. లాస్ట్‌కి మహారాష్ట్ర అమ్మాయిని చేసుకున్నాం... కట్నం లేకుండా. తెల్లటి రంగు మీద ఎందుకంత పట్టుదలతో ఉన్నామంటే  అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తెల్లగా ఉంటే పుట్టే పిల్లలూ తెల్లగా పుడ్తారని!
- శశికళ, గృహిణి,రామంతాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement