వై కొడుకు? | why parents want to sun | Sakshi
Sakshi News home page

వై కొడుకు?

Published Tue, Jan 31 2017 10:57 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

వై కొడుకు? - Sakshi

వై కొడుకు?

కొడుకెందుకూ..?
ఇంకా ఈ కాలంలో కూడా కొడుకే ఎందుకు?
వై? కొడుకు!
ఈ స్టోరీ వెనుక ఇంకో స్టోరీ ఉంది!
బిడ్డ ఆడో మగో తేల్చేది ‘వై’ క్రోమోజోమ్‌.
ఆ ‘వై’ క్రోమోజోమ్‌ ఉండేది మగవాడిలోనే.
ఒకవేళ భార్య.. భర్త ప్రెజర్‌ని భరించలేక
కొడుకునే కనాలని అనుకున్నా...
నోములు నోచినా.. పూజలు చేసినా...
కొడుకును ఇవ్వగలిగింది మాత్రం భర్తే.
అంటే.. తల్లి చేతుల్లో ఏమీ లేదు.
కొడుకా, కూతురా అనేది..
తండ్రిలోని ‘వై’ క్రోమోజోమ్‌ డిసైడ్‌ చేస్తుంది.
మరి వైఫ్‌ని అంటాడేంటి?
వేధిస్తాడేంటి? వంచన చేస్తాడేంటి?


‘అనసూయా.. ఎల్లుండి మా మనవడి బారసాల.. అందరూ రావాలి’ అంటూ బొట్టుపెట్టి పత్రిక చేతిలో పెట్టింది ఆ కాలనీ ఉండే సునంద.
‘తప్పకుండా సునందా! నువ్వు అదృష్టవంతురాలివి.. కోడలి తొలిచూలులోనే మనవడిని ఎత్తుకున్నావ్‌! మా కోడలూ కన్నది.. ఇద్దరాడపిల్లల్ని’ అంటూ సణిగింది అనసూయ.‘మూడో కాన్పులో మనవడు పుడతాడేమోలే.. ఎందుకు బాధ పడ్తావ్‌’ అని సముదాయించి ‘తప్పకుండా రండి అందరూ ’ అంటూ మరీమరీ చెప్పి వెళ్లిపోయింది సునంద.వెనుదిరిగిన అనసూయకు అక్కడే నిలబడి ఉన్న కోడలు కనిపించింది. ఆమె వైపు చూసి మూతి ముప్పై వంకర్లు తిప్పుకొని లోపలికి వెళ్లిపోయింది. చివుక్కుమంది కోడలు అరుంధతి మనసు. అంతకుముందే బెడ్‌రూమ్‌లో ‘మా ఫ్రెండ్‌ ఆనంద్‌కి కొడుకు పుట్టాడట. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు’ అంటూ పరోక్షంగా భర్త వెలిబుచ్చిన నిరాశ గుర్తొచ్చింది. అరుంధతి కళ్లల్లో నీళ్లు పెల్లుబికాయి.

మగపిల్లాడి కోసం.. మూడో కాన్పు!
ఇద్దరు ఆడపిల్లలు.. పిల్లలు కారా? వాళ్లను కనడం తన తప్పా? మగపిల్లాడు కావాలి అంటూ పట్టుబడుతున్న తన అత్తా ఒకింటి ఆడబిడ్డేగా? మరి నా బిడ్డలంటే ఎందుకంత చిన్నచూపు? పైగా ఆడపిల్లలు పుట్టడంలో తన లోపమున్నట్టే ప్రవర్తిస్తున్నారు అత్తా, భర్త. తను ఎక్కడో చదివింది. ఆడపిల్లయినా, మగపిల్లాడయినా.. కారణం మగాడే అని! నస భరించలేక ఓసారి భర్తతో ఆ మాట అంది కూడా. చెంప పగలగొట్టాడు. ఇప్పుడు మూడో కాన్పుకోసం పట్టుపడుతున్నారు. పెద్దదానికి నిండా మూడేళ్లు. చిన్నపిల్లకి యేడాదిన్నర. రెండూ సిజేరియన్లే. రక్తహీనతతో బాధపడుతోంది. మూడో కాన్పు కోసం ఒత్తిడి ఎక్కువైతే డాక్టర్‌ దగ్గరకు వెళ్లింది సలహా కోసం. చీవాట్లు పెట్టింది డాక్టరమ్మ.. కొడుకైతే ఏం? కూతురు అయితే ఏం? అంటూ. మూడో కాన్పు నీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అంటూ హెచ్చరించింది. తన స్నేహితురాలూ తిట్టింది. ‘ఏం ఆస్తులు పడి ఉన్నాయని వారసుడు కావాలట మీ వాళ్లకు? కోడలిని ఇంత హింస పెడుతున్న వాళ్లను కొడుకు పుట్టి ఉద్ధరించడు. పున్నామ నరకం నుంచి తప్పించడం సంగతి అటుంచు ఇక్కడే నరకం చూపిస్తాడు అని చెప్పు మీ ఆయనకు’ అంటూ కస్సుమంది. బయటి వాళ్లు చాలా సలహాలిస్తారు. కానీ తనకు తెలుసు అత్తింటి వాళ్ల మాటలను, వాళ్ల చేతలను ఎదుర్కోవడం; వాళ్లను కాదని ఒంటరిగా బతకడం ఎంత కష్టమో?

సర్దుకుపోవడమా? చచ్చీ చెడీ కనివ్వడమా?
అయిదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు. ఒక తమ్ముడు. తను మూడోది. నాన్న గవర్నమెంట్‌ ఆఫీస్‌లో గుమాస్తా. తాతల ఆస్తి ఏం లేదు. ఆడపిల్లలు చూడ్డానికి బాగున్నారని కోరి వచ్చిన సంబంధాలే ఇప్పటి వరకు. నిజం చెప్పొద్దూ.. కట్నకానుకల దగ్గర తన అత్తామామా కూడా గీచిగీచి బేరామాడింది లేదు. పెళ్లయ్యాక మాత్రం మిగతా వాళ్లతో పోల్చి సూటిపోటి మాటలంటోంది అత్తయ్య అప్పుడప్పుడు. ఇప్పుడైతే మనవడు పుట్టలేదని అన్నిటికీ అదే కారణాన్ని చూపెడుతూ ఆడిపోసుకుంటోంది. ఇలాంటి సమయంలో పుట్టింటికి వెళితే నెత్తిన పెట్టుకొని చూసేవాళ్లెవరూ లేరు. పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది కాబట్టి.. తను, తన పిల్లలు వాళ్లకు భారమే తప్ప .. అయ్యో! బిడ్డ దుఃఖంలో ఉందని గుండెలో దాచుకునే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ మెదడులో మెదిలే సరికి దిగాలు పడిపోయింది అరుంధతి. ఒక్కసారిగా నీరసం ఆవహించింది. తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ చీదరింపులకు సర్దుకుపోవడమో లేదా తను చచ్చయినా సరే మగపిల్లాడిని కనివ్వడమో .. రెండే మార్గాలు అనుకొని వంటింట్లోకి వెళ్లింది.

తల్లీ కొడుకుల రహస్య మంతనాలు!
ఆ రోజు కోడలిని, మనవరాళ్లను పుట్టింట్లో దింపి వచ్చాడు కొడుకు.. ఏదో ఫంక్షన్‌ ఉందంటే! మనసులో ఉన్న మాట కొడుకు ముందు పెట్టడానికి అంతకుమించిన సమయం ఉండదనుకుంది అనసూయ. అందుకే నెమ్మదిగా మొదలుపెట్టింది. ‘శంకర్‌ మామయ్య తెలుసుగా?’ అంటూ!‘ఆ తెలుసు! ఏ.. ఆయనకైమైందిప్పుడు?’ అన్నాడు కొడుకు టీవీలో ఛానల్‌ మార్చుతూ.‘ఆయనకేం కాలేదు. ఆయన రెండో కూతురుకే అయింది. పెళ్లయిన మూడు నెలలకే పెళ్లి పెటాకులైంది. మొగుడు నపుంసకుడట. కూతురికి మళ్లీ పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. రెండో పెళ్లికీ సిద్ధమేనట’ గొంతు తగ్గించి చెప్పింది.‘ఉహూ.. నీ ఎరుకలో ఏదైనా సంబంధముందేంటి?’ అని ప్రశ్నించిన కొడుకు గొంతులో ఉన్నది వ్యంగ్యమో.. లేక మామూలు కుతూహలమో అర్థంకాలేదు ఆ తల్లికి.‘ఏదైనా కాదు మనింటి సంబంధమే అనుకుంటున్నా’ అన్నది తనూ టీవీలో మొహం పెడుతూ!  షాక్‌ తగిలింది అనసూయమ్మ కొడుక్కి..‘ఏంటమ్మా నువ్వనేది?’ అదే షాక్‌లో అడిగాడు.‘ఏమంటా..నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అంటా?’ అంది అంతే నింపాదిగా తల్లి.

‘పిచ్చిగా మాట్లాడకమ్మా.. నాకు రెండో పెళ్లేంటి?’ అన్నాడు వెంటనే రెండో షాక్‌ తగిలినట్టుగా. ‘మతి ఉండే మాట్లాడుతున్నా.. నాకు మనవడు కావాలి. అందుకే నీకు రెండో పెళ్లి. ఈ విషయం అరుంధతికి తెలియాల్సిన పనిలేదు. గుట్టు చప్పుడు కాకుండా గుళ్లో తాళి కడ్తావ్‌. వారానికి మూడు సార్లు ఆఫీస్‌ పని ఉందంటూ బయటకు వెళ్లి శంకర్‌ మామయ్య ఇంట్లోనే కాపురం పెడ్తావ్‌.  ఆ పిల్ల గర్భవతి అయ్యి, పిల్లాడు పుట్టగానే ఇంటికి తీసుకొద్దాం’ అని తాను చేసిన ప్లాన్‌ అంతా వివరించింది అనసూయ. అవాక్కయ్యాడు కొడుకు.
‘అరుంధతికి తెలిస్తే ఏమన్నా ఉందా? అయినా రెండో పెళ్లి నేరం తెలుసా?’ అన్నాడు.

‘ఏమీ కాదు. కొడుకును కనడం తనకు చేతకాలేదు. అయినా అది గొడవ చేస్తే దానికి సపోర్ట్‌ ఇవ్వడానికి ఎవడున్నాడురా? అనవసరభయాలు వదిలి.. అంతా నాకు వదిలెయ్‌..’ అంటూ చాలా బలవంతం చేసింది తల్లి.అసలే కొడుకు మీద ఆశతో ఉన్నాడు.. పైగా తల్లే దగ్గరుండి అన్నీ చూసుకుంటాననే అభయం ఇచ్చేసరికి సరే అన్నాడు పుత్రరత్నం.అరుంధతి భర్త రెండో పెళ్లికి ఏర్పాట్లనీ చకచకా సాగిపోతున్నాయి. రెండు రోజులు పుట్టింట్లో ఉండి వచ్చిన అరుంధతికి అత్తింట్లో, అత్తగారిలో ఏదో మార్పు కనిపించింది. భర్తలో కూడా.  ఇద్దరూ  ఏదో గుసగుస మాట్లాడుకుంటున్నారు. తను రాగానే ఆపేస్తున్నారు. మొత్తానికేదో జరగబోతోందని మాత్రం అర్థమవుతోంది అరుంధతికి. ‘రెండోపెళ్లి’కి కోర్టు అక్షింతలు ఓ రోజు.. సాయంకాలం పిల్లలు విసిగిస్తున్నారని వీధిలోనే ఉన్న పార్క్‌కి తీసుకెళ్లింది.  తమ ఇంటి వెనకాల ఉండే పద్మా కనిపించింది పార్క్‌లో. ఆ మాటా ఈ మాటా మాట్లాడి... ‘అరుంధతిగారూ.. మీకెలా చెప్పాలో తెలియడం లేదు ఓ విషయం’ అంది మెల్లగా పద్మ.

అరుంధతి భృకుటి ముడిపడింది. ‘ఏంటది?’ అంది అనుమానంగా. ‘మీ వారికి రెండో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అంది. ‘మీకెలా..’ అంటూ తను అడిగేలోపే పద్మే చెప్పింది ‘మొన్న జొన్నపిండి కోసం మీ ఇంటికి వెళ్లినప్పుడు  మీ వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు వింటే నాకు అనుమానం కలిగింది’ అని చెప్పింది. హతాశురాలైంది అరుంధతి. ఇంటికి వెళ్లి అత్తింటి తాలూకు దూరపు బంధువులతో ఆరా తీసింది. పద్మ చెప్పింది నిజమే అని తేలింది. అరుంధతి మొహం పాలి పోయింది. అవమానం, ఉక్రోషం, కోపంతో రగిలిపోయింది. సర్దుకుపోవడం, తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా కొడుకును కనివ్వడం అనే నిశ్చయాన్ని పక్కనపెట్టి కర్తవ్యం గురించి ఆలోచించింది. లాయర్‌ను కలిసింది. భర్త పెళ్లి ఆపింది.

భార్య ఓకే అన్నా.. చట్టం పీక పట్టుకుంటుంది
‘భార్య బతికి ఉండగా ఆమెకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే నేరం. దీనినే బైగమీ అంటారు. సెక్షన్‌ 494 ప్రకారం బైగమీకి పాల్పడితే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అసలు రెండో పెళ్లి చెల్లదు,  రెండో మహిళకు భార్య స్థానం రాదు’ అని గతంలో చెప్పుకున్నాం కదా. అయితే అవి మాత్రమే కాదు, మొదటి భార్యకు మగపిల్లాడు పుట్టలేదని, మగ సంతానం కోసం  రెండో పెళ్లికి బలవంతంగా ఆమె దగ్గర అనుమతి తీసుకున్నా కూడా బైగమీ కింద నేరమే అవుతుంది. పైగా ఆ అంగీకారం, అనుమతి చెల్లవు కూడా.  కొడుకును కనివ్వలేని లోపాన్ని చాలామంది భార్యల మీదకు నెడతారు. నిజానికి అందులో మగవారిదే బాధ్యత. స్త్రీలలో కేవలం ఎక్స్, ఎక్స్‌ క్రోమోజోమ్స్‌ ఉంటే మగవారిలో ఎక్స్, వై క్రోమోజోములుంటాయి. ఎక్స్, ఎక్స్‌ కలిస్తే ఆడపిల్ల, ఎక్స్, వై కలిస్తే మగపిల్లాడు పుడతారు. పై కేస్‌లో తప్పంతా అరుంధతి మీదకు నెట్టి రెండో పెళ్లి చేయాలనుకుంది ఆమె అత్తగారు. ఆ నిర్ణయానికి వంత పాడాడు కొడుకు. నిజం తెలుసుకున్న అరుంధతి లాయర్‌ని కలిసి పెళ్లి జరగకుండా ఇంజెక్షన్‌ ఆర్డర్‌ తెప్పించింది. భర్త మీద క్రిమినల్‌ కేసు వేసి జైలు పాలు చేసే కంటే కౌన్సిలింగ్‌ ఇప్పించి అతనికి ఒక చాన్స్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది. కోర్టులో అత్తకూ అక్షింతలు పడ్డాయి.

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement