శింబు ఎందుకు బరస్ట్ అయ్యాడు!
ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కిందకు పడతారా? సెలబ్రిటీ బ్రేక్డౌన్ గురించి సైకాలజిస్టులు అదే అంటారు. వీళ్లు డిప్రెషన్ నుంచి బయటపడడం అన్నది చాలా కష్టం. బయటపడినవారు మాత్రం మనందరికి ఇన్‌స్పిరేషన్‌గా మారతారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా మనం రీసెంటుగా ఒక యువ హీరో బలి అవడం చూశాం. శింబు పోరాడుతున్నాడు... గెలవాలని ఆశిస్తున్నాం.
శింబు! యాక్టర్, డెరైక్టర్, ప్లేబాక్ సింగర్. లిరిసిస్ట్. ఇవన్నీ ఎవరికి గుర్తు? స్మార్ట్ గై, రొమాంటిక్. కిస్సింగ్ కిల్లర్, అల్లరిచిల్లర్, ప్లేబాయ్. - ఇదీ ఐడెంటిటీ! అంతకన్న ముఖ్యమైన ఐడెంటిటీ... నయనతార కింది పెదవిని మునిపంటితో లాగి సాగదీయడం.అయితే శింబుకి ఇప్పుడు ఎలాంటి ఐడెంటిటీ లేదు. చివరికి ‘నా’ అనుకున్న హన్సిక కూడా లేదు. మనిషి కూడా మునుపటిలా లేడు.
రెండున్నర ఏళ్ల నుంచీ శింబూ తమిళనాడులోనే ఉన్నాడు కానీ, తమిళ్ ఇండ్రస్టీలో లేడు.
శింబుకి ఏమైంది?
నల్ల చొక్కాతో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తక్కువగా మాట్లాడుతున్నాడు. శింబు.. ఇప్పుడు ‘మ్యాన్ ఆఫ్ ఎమోటికాన్స్’. అతడిలో చిన్న స్ట్రింగ్ కదిలినా ఎమోషన్స్ గొంతులోకి వచ్చేస్తున్నాయి. శృతి, లయ తప్పిన ఉద్వేగాలవి.రెండేళ్లయింది. శింబుకి సింగిల్ రిలీజ్ కూడా లేదు. కెరీర్ దెబ్బ తింది. పర్సనల్‌గా కూడా దెబ్బతిన్నాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. హన్సికతో ఉన్నప్పుడు అతడు చాలా అనుకున్నాడు. ఇల్లు, పిల్లలు, భార్య అని కలలు కన్నాడు. కెరీర్‌లో తలకిందులైనప్పుడైతే హన్సిక తనను నిలబెడుతుందని అనుకున్నాడు. ఆమె నిలవలేదు. ఆమె ప్రేమ నిలవలేదు. ‘‘శ్వాస ఒక్కటే ఇప్పుడు నాతో నిలిచి ఉంది’’ అన్నాడు శింబు.. బాధగా అసలైతే శింబు ఎప్పుడూ
ఎలాగుండేవాడంటే... చీర్‌ఫుల్‌గా, ఎంథూజియాస్టింగ్‌గా!
సిల్వర్‌స్పూన్ తో పుట్టి సిల్వర్ స్క్రీన్ పై ఎదిగిన వాడు శింబు. తండ్రి టి. రాజేందర్, తల్లి ఉష.. ఇద్దరూ సినీ ప్రముఖులే. చదివింది డాన్ బాస్కోలో, సెయింట్ జాన్స్‌లో. చైల్డ్ ఆర్టిస్టుగా అతడివి పదకొండు సినిమాలు. స్టార్ ఆర్టిస్టుగా పదహారు సినిమాలు. ‘విన్నైత్తాండి వరువాయ’ (2010)లో శింబు నటకు ఫ్లాట్ అయిపోయిన కె.బాలచందర్ భేష్ అంటూ అతడికో బహిరంగ లేఖ రాశారు. ‘వానం’ (2011)లో అతడి యాక్షన్ అద్భుతంగా ఉందంటూ ‘ది హిందూ’ మాలతీ రంగరాజన్ ప్రశంసలు కురిపించారు. ‘వల్లవన్’ (2006)లో నయనతార పెదవిని లాగి మూటకట్టుకున్న అప్రతిష్టను శింబు ఈ రెండు సినిమాలతో తుడిచేసుకోగలిగాడు.‘వానం’ తర్వాత 2012 దీపావళికి ‘పోడా పోడీ’ రిలీజైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి శింబూ చిత్రం ఇంకోటి రాలేదు! రాబోయే చిత్రాలు మాత్రం ఎనిమిది వరకు ఉన్నాయి. (2015లో ఐదు, 2016లో రెండు, 2017లో ఒకటి). అయితే శింబు ఈ ఎనిమిదింటిలో ఇప్పుడు ఒకే ఒక చిత్రంగా గురించి మాట్లాడుతున్నాడు! అది తప్ప తనకు వేరే హోప్ లేదని అంటున్నాడు. గౌతమ్ మీనన్ ‘అచ్చమ్ ఎన్‌బతు మడమైఎడ’ చిత్రం అది. 2017 లో రిలీజ్ కావలసిన సినిమా అదే. ఎందుకు అఫర్స్ తగ్గిపోయినట్లు? రకరకాల సందేహాలు, వాటికి సమాధానాలుగా రకరకాల రూమర్లు. శింబు సెట్స్‌లోకి టయానికి రాడట! నిజమేనా? లేట్ అవుతుందని ముందే చెప్తాను. చెప్పినట్లే వెళతాను. ఇందులో చీటింగ్ ఏముంది?’’ అంటాడు.
అయితే అలాంటి మైనెస్‌లు అతడిలో చాలా ఉన్నాయంటారు! ఊరికూరికే ఎవరితో పడితే వారితో ప్రేమలో పడిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ పట్టుబడిపోతాడు. అలా పడడం, పట్టుపడిపోవడం అతడి షెడ్యూళ్లను తరచు దెబ్బతీస్తుంటుంది. అయితే శింబూ పాయింట్ వేరే! ‘‘నేనెప్పుడూ ఒకే టేక్‌లో షాట్ కంప్లీట్ చేస్తాను. ఆ ప్లస్ పాయింట్ గురించి మాట్లాడరేమిటి?’’ అంటాడు. శింబు... ధనుష్‌తో, నయనతారతో (కలిసి, వేర్వేరుగా) పార్టీలకు తిరగడం కూడా ఇష్యూ అయింది. తన లోకంలో తను పడి, సినిమాను సెకండరీ చేసుకున్నాడన్న విమర్శలూ వచ్చాయి. కానీ ధనుష్ నాకు ముఖ్యం అంటాడు శింబు. ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్తారు. వీడియో గేమ్స్ ఆడుకుంటారు. ఈ పిల్ల చేష్టలను ఎంతో గంభీరమైన సినీ పరిశ్రమ సహిస్తుందా?
హన్సిక కూడా ఇందుకే అతడిని వదిలేసిందా? లేక శింబూనే దూరం అయ్యాడా? రిలేషన్‌షిప్‌పై శింబుకి క్లారిటీ ఉంది. హన్సిక విషయంలో అతడే ఒప్పేసుకున్న నిజం ఏమిటంటే - పెళ్లి విషయంలో ఇద్దరికీ ఏదో అభిప్రాయ భేదాలు వచ్చాయట. అందుకే వద్దనుకుని, విడిపోయారట. మొత్తంగా చూస్తే శింబు స్థిరత్వం కోల్పోయిన మనిషని చెప్పాలా? ఆ అస్థిరతే ఇప్పుడు శింబుని ఆడియో ఫంక్షన్‌లో ‘బరస్ట్’ అయ్యేలా చేసిందా?ఇప్పుడేమిటి? శింబు మారతాడా? చెప్పలేం.
శింబు మళ్లీ ప్రేమలో పడతాడా?
‘ఏమో చెప్పలేను. కనీసం కొన్నాళ్లయినా ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటున్నాడు. శింబు.
ప్రేమకు దూరం అవడం, సినిమాలకు అతడిని చేరువ చేస్తుందా? చూడాలి.
గా‘కిస్సు’లు తమిళ నటి నయనతారకు. కన్నడ నటి హర్షికకు. మరాఠీ నటి హన్సికకు.
గా‘సిప్పు’లు నయనతారతో పెళ్లి.హన్సికతో డేటింగ్. రీల్‌సైడ్ రోమియో.
గా‘గ్యాపు’లు నటుడిగా 2007, 2009, 2012దర్శకుడిగా 2007-2012 సింగర్‌గా 2005 గీతరచయితగా 2007-2010
సెలబ్రిటీ డిప్రెషన్
సెలబ్రటీలలో డిప్రెషన్‌కు సాధారణంగా కనిపించే కారణం వారు ఒక్కసారిగా పైనుంచి కిందపడడం. దాంతో ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది. అయితే కొందరిలో దీన్ని క్రైసిస్ అనలేం. జస్ట్ ఓపెన్ అయ్యారని అనుకోవాలి. అప్పుడప్పుడూ అలా ఓపెన్ అవడం మంచిదే. గుండె భారం తగ్గుతుంది. మళ్లీ మామూలు మనిషి కాగలుగుతారు.
- డాక్టర్ షెఫాలీ బాత్రా,
సైకియాట్రిస్ట్, ముంబై
ఏదైనా చేయగలడు
లవ్, వయొలెన్స్, యాక్షన్... ఎలాంటి పాత్రనైనా శింబు చక్కగా పోషించగలడు. సౌత్ ఇండియా రణబీర్ కపూర్ అతడు.
- గౌతమ్ మీనన్, తమిళ దర్శకుడు (ప్రస్తుతం శింబుతో ‘అచ్చమ్ ఎన్బదు మడమైయాడ’ చిత్రాన్ని తీస్తున్నారు)
వెరీ డిఫరెంట్!
శింబు జీనియస్. తను డెరైక్ట్ చేస్తున్నా కూడా సెట్స్‌లోకి ఒక నటుడిలా వస్తాడు. అతడు డిఫరెంట్. మేధావి.
- రీమాసేన్,
బాలివుడ్ నటి
ఒకటే రాశి!
మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరిదీ ఒకటే రాశి. కుంభం. కానీ మా యాటిట్యూడ్‌లో కొన్ని వ్యత్యాసాలున్నాయి. ఏ పనైనా నేను త్వరత్వరగా చేసేస్తాను. తను నెమ్మదిగా చేసుకుపోతాడు. సహనం ఎక్కువ. మమ్మల్ని విడదీయాలని చాలామంది ట్రై చేశారు. మేము వాళ్లకా చాన్స్ ఇవ్వలేదు.
- ధనుష్,
తమిళ నటుడు
మనమొక ఫ్యామిలీ
శింబు అలా మాట్లాడగానే నేను మెసేజ్ పెట్టాను. ‘నేనున్నాను. నీకు ఏం కావాలన్నా చెప్పు. మనమొక ఫ్యామిలీ. రిలీజ్ కాని ‘వాలు’ సినిమా సంగతి కూడా నేను చూస్తాను. డిప్రెషన్ అవసరం లేదు. సంఘం తరఫున నిలబడతాను’ అని మెసేజ్ పెట్టాను. దానికి శింబు స్పందించి ‘మీరున్నారని నేను ధైర్యంగా ఉన్నాను. నాకేమన్నా కావాలంటే మిమ్మల్ని అడుగుతాను’ అన్నాడు.
- ఆర్. శరత్‌కుమార్,
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు
తమిళ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ లాంటిదని, ఈ ‘ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే’ నాడు శింబుకి మేమందరం తోడుంటామని
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ అన్నారు.