ఇరువురు  | Wise shepherds The future of mankind | Sakshi
Sakshi News home page

ఇరువురు 

Published Mon, Dec 24 2018 2:00 AM | Last Updated on Mon, Dec 24 2018 10:31 AM

Wise shepherds The future of mankind - Sakshi

జ్ఞానులు, కాపరులు.. ఆ ఇరువురు కలిస్తేనే మానవాళికి భవిష్యత్తు. అందుకు వర్తమానం దోహదపడాలి. ఐక్యమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలతో మనమంతా మెలగాలి.

బాల్యంలో వుండగా క్రిస్మస్‌ సీజన్లో మిషనరీ బడుల్లో పిల్లలకు టీచర్లు చిన్న చిన్న ఆటలు, పాటల పోటీలు పెట్టి పెన్సిళ్లు, స్కేళ్ల వంటి బహుమతులు ఇస్తూ, వాటితో పాటు చక్కటి ఖరీదైన విదేశాల్లో తయారైన గ్రీటింగ్‌ కార్డ్స్‌ కూడా ఇచ్చేవారు. అవి అప్పటికే అంతకు ముందు విదేశీయులు వాడినవి (సెకండ్‌ హ్యాండ్‌) కనుక, వాటి మీద బాల్‌ పెన్‌ తో చేసిన వాళ్ల సంతకాలు కూడా ఉండేవి. అయితే, విషయం అది కాదు. వాటి మీద వుండే బొమ్మలు! గుడ్డల్లో చుట్టిన చిన్న బాబు జీసస్‌ వద్ద, ఖరీదయిన దుస్తులతో ముగ్గురు పెద్ద పెద్ద గెడ్డం వున్నవాళ్ల చేతుల్లో ఏవో చిన్న చిన్న పెట్టెలతో నిలబడి వుంటే, గొంగళ్లు కప్పుకుని పేదగా కనిపించే మరో ముగ్గురు చిన్నచిన్న గొర్రె పిల్లలు పట్టుకుని అయన వద్ద మోకరించి వుండేవారు. టీచర్లు సండే స్కూల్లో బైబిల్‌ కథలు చెబుతూ ‘తూర్పు దేశపు జ్ఞానులు బాల యేసుకు బంగారము, భోళము, సాంబ్రాణి తెచ్చి కానుకలుగా ఇచ్చారు.

పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న కాపరులు తమ వద్ద వున్న చిన్న చిన్న గొర్రె పిల్లల్ని తెచ్చి జీసస్‌కు కానుకగా ఇచ్చారు’ అని  చెప్పేవారు.కొన్ని గ్రీటింగ్‌ కార్డ్స్‌ మీద ఆకాశంలో కనిపిస్తున్న ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని చూస్తూ ఒంటెల మీద జ్ఞానులు ముగ్గురు వస్తూ ఉన్న బొమ్మలు ఉండేవి. చలి రాత్రిలో ఒక దేవదూత వీరికి కనిపించి బెత్లేహేములో ఒక పశువుల శాలలో ఆయన పుట్టాడు అని వారికీ చెప్పడంతో వీరు ఇరువురు ఆయన్ని చూడటానికి బయలుదేరతారు. టీచర్లు ఇది క«థలుగా చెప్పడమే కాకుండా, దీన్ని ‘డ్రామా’ గా చేయించేవారు. పిల్ల జ్ఞానుల కోసం తగరం కాయితాలు అట్టలకు అంటించి తయారు చేసిన కిరీటాలు, గొర్రెల కాపరులకు దూది గెడ్డాలు పెట్టి రంగు రంగు గుడ్డల్ని అంగీలుగా మార్చి అప్పట్లో దీన్ని మాతో చేయించేవారు. జ్ఞానులకు ఖగోళ శాస్త్రం తెలుసు అనీ, దేవదూత చెప్పిన వార్త విని వాళ్లు తమ గ్రంథాల్లో వెతికి, అప్పటికే తాము కనిపెడుతున్న లోక విమోచకుడు అయిన ‘మెస్సయ్య’ భూమి మీద పుట్టాడని నిర్ధారణకు వచ్చి, ఆయన రాజు కనుక ఆయన వద్దకు వారు కానుకలు తీసుకుని వస్తారు.

అయితే, గొర్రెల కాపరుల వద్దకు కూడా ఆ దేవదూత వచ్చింది, అదే వార్త వాళ్లకు చెప్పింది. వాళ్లు ఆ పొలాల్లో తమ వద్ద ఉన్నదే పట్టుకుని ఆయన వద్దకు బయలుదేరి వచ్చారు. మరి, అమెరికాలోనో, లేదా యూరోపియన్‌ దేశాల్లోనో తయారైన ఆ ఖరీదైన రంగురంగుల గ్రీటింగ్‌ కార్డుల మీద బొమ్మల్లో వున్నది ఏ దేశస్తులు? బొమ్మలు చూసి విషయం తెలుసుకునే దశ దాటి చాలా దూరం వచ్చాక, అప్పుడు తెలియని కొత్త విషయాలు కొన్ని ఆనాటి గ్రీటింగ్‌ కార్డుల మీద ఉన్నట్టుగా ఇప్పుడు మనసుకు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది.. వాళ్ళు అమెరికన్లు, యూరోపియన్లు కాదు. మరి ఎవరు? ఆసియన్లు. మన మాదిరిగా గోధుమ వర్ణ మేని ఛాయ వున్నవారు. రెండవది.. అంతకంటే ముఖ్యమైనది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న తాత్వికతకు ప్రాతిపదిక అయిన  ఐక్యమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం.

 దేశాధినేతలకు సైతం మార్గదర్శనం చేసే జ్ఞానులు, పొలాల్లో గొర్రెలను మేపుకునే పశువుల కాపరులు ఇద్దరికీ ఒకే వార్త ఒకే దూత ద్వారా తెలిసింది. వారిరువురు ఒకే స్థలానికి ఒకే పని మీద వచ్చారు, ఇరువురికీ ఒకేసారి లోనికి ప్రవేశం దొరికింది. ఒకే స్థలంలో వారు తాము వచ్చిన కార్యం పూర్తి చేసుకున్నారు. ఇరువురూ అక్కణ్నుంచి కలిసి బయటకు వెళ్లారు. కానీ ఆ ‘కలయిక’ ఇప్పటికీ ఇంకా పూర్తి రూపం సంతరించుకోలేదు. అందుకే దీని తదుపరి రూపం 1789 ఫ్రెంచ్‌ విప్లవంగా, పైన చెప్పుకున్న మూడు అంశాల ప్రాతిపదికగా మరోసారి మన ముందుకు వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి 2018 ఏళ్లు అయింది. అప్పటి నుంచి ఆ రూపాంతర ప్రక్రియ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దశలో కొనసాగుతూ వుంది. ఆ గ్రీటింగ్‌ కార్డ్‌ తయారైంది, అమెరికాలో అయినా యూరప్‌లో అయినా, దాని మీది వున్న ‘ఆసియా బొమ్మ’ను మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ మార్చలేరు. ఎందుకంటే అందులో గతం వుంది. జీసస్‌ జన్మించాడు. భవిష్యత్తు వుంది.  ఆ ‘ఇరువురు’ ఒక్కటి కావాలి. అందుకు వర్తమానం దోహదపడాలి.

– జాన్‌సన్‌ చోరగుడి, సామాజిక విశ్లేషకులు    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement