రెడ్‌ పెయింట్‌ | Woman is the man who turned the woman into a reputation | Sakshi
Sakshi News home page

రెడ్‌ పెయింట్‌

Published Mon, Mar 11 2019 12:11 AM | Last Updated on Mon, Mar 11 2019 12:11 AM

Woman is the man who turned the woman into a reputation - Sakshi

నియంత పాలన లో చెయ్యెత్తడమైనా అది చిన్న తిరుగుబాటు కాదు. పంగ చాపి కూర్చున్న మగవాడిని ‘సిట్‌ రైట్‌’ అని వేలెత్తి చూపడమైనా అది చిన్న హెచ్చరిక కాదు. కొమ్ములు తిరిగిన దేశమైనా, కండలు తిరిగిన మగవాడైనా మర్యాద నేర్చుకుని తీరవలసిందే. అయితే మర్యాదల్ని నేర్పించే తీరికలో లేరిప్పుడు మహిళలు. ‘టైమ్‌ ఈజ్‌ అప్‌’! నేర్పించే టైమ్‌ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పడమే ఇప్పుడు వాళ్ల చేతుల్లో.. చూపుల్లో.. మాటల్లో.. కనిపిస్తున్నది.

మగవాళ్లు స్త్రీ దగ్గర మర్యాదగా ఎందుకు ఉండ రు?! ‘చేతుల దగ్గర బలమైన రెండు కండరములతో, ఛాతీ భాగమున ఫలకముల వంటి మరి రెండు కండరములతో నిన్ను నేను సృష్టించి ఉన్నాను కనుక నువ్వు పురుషుడివి. ఆలాగున నువ్వు పురుషుడివి అయి ఉన్నావు కనుక స్త్రీని వేధించుటకును, ఆమెను పొద్దుపోక పరిహసించుటకును నాచే నువ్వు సమ్మతిని పొంది ఉన్నా వు’ అని జేబులో చిన్న స్లిప్‌ పెట్టి భూమి మీదకు ‘వైల్డ్‌ కార్డ్‌’ ఎంట్రీ ఇప్పిస్తాడా దేవుడు! బాగా చదువుకుని, సంస్కారం నేర్చుకుని, మర్యాదస్తుల పీఠం మీద కూర్చొని ఉన్న పురుషుడు కూడా.. ఎవరూ లేకుండా చూసి జేబులో స్లిప్‌ కోసం వెతుక్కుంటాడెందుకని! ‘స్త్రీ పై పురుషుడికి ఉండే సహజమైన సృష్టి ఆకర్షణే తప్ప, ఆమెపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదు’ అని సాక్ష్యంగా చూపించుకోడానికా ఆ స్లిప్పు?!దేవుడిచ్చిన కండలు ఉన్నాయి కదా అని స్త్రీ మీద పురుషుడు చెయ్యి వేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడేమో, స్త్రీ ఊరుకోదు. తనను పుట్టించిన బ్రహ్మనే చెయ్యి వెయ్యనివ్వలేదు ఆవిడ. బ్రహ్మకు తన మానస పుత్రికపై ‘ఫీలింగ్స్‌’ కలిగినప్పుడు మునీశ్వరులు పరుగున వచ్చి ఆయనపై కమండలంలోని నీళ్లు చల్లడంతో బ్రహ్మ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే పెను ముప్పు తప్పిపోయింది. ముప్పు తప్పిపోయింది ఆయన మానస పుత్రికకు కదా! కానీ ‘నైమిశారణ్యం’లో అలా లేదు. బ్రహ్మకే ముప్పు తప్పింది అని ఉంది. అంటే.. చెయ్యి వెయ్యడం పరువు తక్కువ పని కానీ, చెయ్యి పడడం పరువు తక్కువ కాదని అంతరార్థం.

స్త్రీ మీద చెయ్యిపడగానే ‘అయ్యో.. ఆమె శీల ప్రతిష్టకు భంగం కలిగింది..’ అని మనం ఫ్రీక్వెంట్‌గా ఆక్రోశిస్తుంటాం. స్త్రీ మీద చెయ్యి వేసి శీల ప్రతిష్టకు భంగం కలిగించుకున్న వ్యక్తిని కదా చూసి ‘అయ్యో’ అనో, ‘ఏమయ్యో’ అనో అనాలి. కానీ ఆ నైమిశారణ్యపు నీతిసూత్రాలకు ఇప్పటి మగవాళ్లు ఎందుకు అప్‌డేట్‌ అవుతారు? పోనీ, స్త్రీ కన్నీళ్లు పెట్టుకుని.. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత  లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో..’ అంటేనన్నా వింటున్నారా? లేదు. చివరికేమైంది? ‘మీటూ’ని తెచ్చుకున్నారు నెత్తి మీదకు. మళ్లీ ఏడుపు. ‘ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు మేడమ్‌జీ?’ అని! అక్కడి తో ఆగుతారా? ‘వాట్‌ హ్యాపెండ్‌ టు యువర్‌ మీటూ మూవ్‌మెంట్‌’ అని మళ్లొక వెక్కిరింపు.

తప్పు చేసిన మగవాళ్లకు మాట్లాడే ధైర్యం ఎలా వస్తుంది?! ఎలా వస్తుందో చూడండి. హాలీవుడ్‌ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్‌ మీద అమెరికన్‌ నటి ఆష్లీ జూడ్‌ వేసిన లైంగిక వేధింపుల కేసును ఫెడరల్‌ కోర్టు కొట్టివేయడంతో యు.ఎస్‌. మగాళ్లకు ధైర్యం వచ్చింది. బాలీవుడ్‌లో నానాపటేకర్‌ మీద నటి తనుశ్రీ దత్తా వేసిన కేసులో ఆమెకు ‘ఎ–లిస్టర్స్‌’ నుంచి సపోర్ట్‌ లభించకపోవడంతో మనదేశంలోని మగాళ్లకు ధైర్యం వచ్చింది. యు.ఎస్‌.లో ఆష్లీ జూడ్, ఇండియాలో తనుశ్రీ దత్తా తొలి (మీటూ) తిరుగుబాటు సిపాయిలు. ‘టైమ్‌ ఈజ్‌ అప్‌’ ఇంకో మీటూ టైప్‌ ఉద్యమం. హాలీవుడ్‌ నటీమణులంతా కలసి నిర్మించుకున్నది. ‘టైమ్‌ ఈజ్‌ అప్‌’ సీఈవో లీసా బార్డర్స్‌. ఆమె సుపుత్రుడు చేసిన నిర్వాకానికి ఇటీవలే ఆమె సీఈవో గా రాజీనామా చేశారు. కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే ఆమె ఆ పని చేశారు. ఇదిగో ఇలాంటి ‘ఓటములే’ మగవాళ్ల ధైర్యానికి భగ్గున ఉత్సాహాన్ని పోస్తుంటాయి. అయితే కొడుకు తప్పు చేశాడని, భర్త తప్పు చేశాడని ఒక స్త్రీ నైతిక బాధ్యతను స్వీకరించారంటే అర్థం.. తను చేస్తున్న పోరాటంలో ఆమె ఓడిపోయారని కాదు. పోరాటాన్ని గెలిపించుకున్నారని. అది అర్థమౌతుందా మన మగధీరులకు? అర్థమై ఉంటే మీటూ ఉద్యమం గత నెలలో తిరిగిన ఒక ‘మలుపు’ను కచ్చితంగా గమనించి ఉండేవాళ్లు. 

ఫ్లారిడాలోని ‘కిస్సింగ్‌ స్టాచ్యూ’లో.. ఒక నేవీ సైనికుడి మొరటు చుంబనం ధాటికి వెనక్కి ఒరిగిన నర్సు కాలిపై ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి ‘మీటూ’ అని ఎర్రటి పెయింట్‌తో రాసి నిరసన తెలిపారెవరో! ఆ రాసిన వాళ్ల కోసం ప్రస్తుతం యు.ఎస్‌.పోలీసులు వెతుకుతున్నారు. వెదకడం ఎందుకంటే శిక్షించడం కోసం! శిక్షించడం ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ లొంగుబాటుకు చిహ్నంగా యు.ఎస్‌. ప్రతిష్ఠించుకున్న స్టాచ్యూ అది. ‘అన్‌కండిషనల్‌ సరెండర్‌’ అని ఆ స్టాచ్యూకి అమెరికా పేరు కూడా పెట్టుకుంది. జపాన్‌ లొంగిపోయిందన్న వార్త  తెలిసి, ఒళ్లు తెలియని ఆ సంతోషంలో న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో ఒక నేవీ సోల్జర్‌.. రోడ్డు మీద వెళ్తున్న ఒక నర్సు మీద పడి, ఆమె విడిపించుకోడానికి కూడా వీల్లేకుండా తన కండబలంతో ఆమెను ఆక్రమించుకుని, ముద్దు పెట్టుకున్నప్పుడు ఎవరో తీసిన ఫొటోకి విగ్రహ రూపమే ‘అన్‌కండిషనల్‌ సరెండర్‌’ స్టాచ్యూ. ఆ ఫొటో నకళ్లు విగ్రహాలు విగ్రహాలుగా అమెరికా అంతటా ఇప్పటికీ ఉన్నాయి. ఉండటమేంటి.. ఉంచుకున్నారు గొప్ప హిస్టారిక్‌ ప్రతిష్టలా!‘మీటూ’ తిరుగుబాటును యు.ఎస్‌. కనుక రెస్పెక్ట్‌ చేసి ఉంటే ఇప్పటికే ఆరో ఏడో ఉన్న ఈ స్టాచ్యూలన్నిటినీ కూలగొట్టి ఉండాలి. అలాంటిదేమీ జరగలేదు! స్త్రీ దేహంపై దురాక్రమణలా స్పష్టంగా కనిపిస్తున్న ఆ కిస్సింగ్‌ స్టాచ్యూలు దేశప్రతిష్టకు చిహ్నాలను అనుకోవడంలో ఉన్నది ఆ దేశ భావ దౌర్భాగ్యమే కానీ, మరొకటి కాదు. ఆ సంగతి చెప్పడానికే అజ్ఞాత మహిళలెవరో నర్స్‌ కాళ్లకు ‘మీటూ’ను పెయింట్‌ చేసి వెళ్లారు. ఏడాదిన్నరగా జరుగుతున్న మీటూ ఉద్యమంలో.. పురుషుడి దురహంకారంపై, దురాక్రమణపై తొలి శక్తిమంతమైన ప్రతిఘటన ఆ రెడ్‌ పెయింట్‌. ‘రాసేసి పారిపోతే సరిపోతుందా, అదేం సాధికారత’ అంటున్నారు! మరి.. కండబలంతో మీద పడిపోయి, ‘అన్‌కండిషనల్‌ సరెండర్‌’ అంటే సరిపోతుందా? అదేం సావరినిటీ!! 

అమెరికన్‌ రివల్యూషన్, ఫ్రెంచి రివల్యూషన్, రష్యన్‌ రివల్యూషన్‌.. చరిత్రలో ఏ దేశానిదా రివల్యూషన్‌. దేశాలు, సామ్రాజ్యాలు పుట్టి బుద్ధెరిగాక ఇన్ని శకాలకు ఇప్పుడు ప్రపంచమంతటా ఏకకాలంలో నడుస్తున్న రివల్యూషన్‌లు మీటూ, టైమ్‌ ఈజ్‌ అప్‌. అంటే చూడండి.. ఆడవాళ్లు ఎన్ని యుగాలుగా ఓపికపట్టి ఉన్నారో! ఎన్ని యుగాలుగా మగవాడిని తప్పించుకుంటూ వస్తూ.. వస్తూ.. ఒక్కసారిగా ఎదురు తిరిగి నిలబడ్డారో! మగవాడికి మర్యాద నేర్పే టైమ్‌ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పే టైమ్‌ ఇది. ‘రెడ్‌ పెయింట్‌’ టైమ్‌.  
మాధవ్‌ శింగరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement