dictatorial rule
-
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
'తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది'
సాక్షి, కామారెడ్డి : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో గురువారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరుగనున్నాయని వెల్లడించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలతో పాగా వేయనుందని రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జాతీయ బొగ్గు గనుల శాఖ స్వతంత్ర డైరక్టర్ మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ పెయింట్
నియంత పాలన లో చెయ్యెత్తడమైనా అది చిన్న తిరుగుబాటు కాదు. పంగ చాపి కూర్చున్న మగవాడిని ‘సిట్ రైట్’ అని వేలెత్తి చూపడమైనా అది చిన్న హెచ్చరిక కాదు. కొమ్ములు తిరిగిన దేశమైనా, కండలు తిరిగిన మగవాడైనా మర్యాద నేర్చుకుని తీరవలసిందే. అయితే మర్యాదల్ని నేర్పించే తీరికలో లేరిప్పుడు మహిళలు. ‘టైమ్ ఈజ్ అప్’! నేర్పించే టైమ్ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పడమే ఇప్పుడు వాళ్ల చేతుల్లో.. చూపుల్లో.. మాటల్లో.. కనిపిస్తున్నది. మగవాళ్లు స్త్రీ దగ్గర మర్యాదగా ఎందుకు ఉండ రు?! ‘చేతుల దగ్గర బలమైన రెండు కండరములతో, ఛాతీ భాగమున ఫలకముల వంటి మరి రెండు కండరములతో నిన్ను నేను సృష్టించి ఉన్నాను కనుక నువ్వు పురుషుడివి. ఆలాగున నువ్వు పురుషుడివి అయి ఉన్నావు కనుక స్త్రీని వేధించుటకును, ఆమెను పొద్దుపోక పరిహసించుటకును నాచే నువ్వు సమ్మతిని పొంది ఉన్నా వు’ అని జేబులో చిన్న స్లిప్ పెట్టి భూమి మీదకు ‘వైల్డ్ కార్డ్’ ఎంట్రీ ఇప్పిస్తాడా దేవుడు! బాగా చదువుకుని, సంస్కారం నేర్చుకుని, మర్యాదస్తుల పీఠం మీద కూర్చొని ఉన్న పురుషుడు కూడా.. ఎవరూ లేకుండా చూసి జేబులో స్లిప్ కోసం వెతుక్కుంటాడెందుకని! ‘స్త్రీ పై పురుషుడికి ఉండే సహజమైన సృష్టి ఆకర్షణే తప్ప, ఆమెపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదు’ అని సాక్ష్యంగా చూపించుకోడానికా ఆ స్లిప్పు?!దేవుడిచ్చిన కండలు ఉన్నాయి కదా అని స్త్రీ మీద పురుషుడు చెయ్యి వేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడేమో, స్త్రీ ఊరుకోదు. తనను పుట్టించిన బ్రహ్మనే చెయ్యి వెయ్యనివ్వలేదు ఆవిడ. బ్రహ్మకు తన మానస పుత్రికపై ‘ఫీలింగ్స్’ కలిగినప్పుడు మునీశ్వరులు పరుగున వచ్చి ఆయనపై కమండలంలోని నీళ్లు చల్లడంతో బ్రహ్మ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే పెను ముప్పు తప్పిపోయింది. ముప్పు తప్పిపోయింది ఆయన మానస పుత్రికకు కదా! కానీ ‘నైమిశారణ్యం’లో అలా లేదు. బ్రహ్మకే ముప్పు తప్పింది అని ఉంది. అంటే.. చెయ్యి వెయ్యడం పరువు తక్కువ పని కానీ, చెయ్యి పడడం పరువు తక్కువ కాదని అంతరార్థం. స్త్రీ మీద చెయ్యిపడగానే ‘అయ్యో.. ఆమె శీల ప్రతిష్టకు భంగం కలిగింది..’ అని మనం ఫ్రీక్వెంట్‌గా ఆక్రోశిస్తుంటాం. స్త్రీ మీద చెయ్యి వేసి శీల ప్రతిష్టకు భంగం కలిగించుకున్న వ్యక్తిని కదా చూసి ‘అయ్యో’ అనో, ‘ఏమయ్యో’ అనో అనాలి. కానీ ఆ నైమిశారణ్యపు నీతిసూత్రాలకు ఇప్పటి మగవాళ్లు ఎందుకు అప్డేట్ అవుతారు? పోనీ, స్త్రీ కన్నీళ్లు పెట్టుకుని.. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో..’ అంటేనన్నా వింటున్నారా? లేదు. చివరికేమైంది? ‘మీటూ’ని తెచ్చుకున్నారు నెత్తి మీదకు. మళ్లీ ఏడుపు. ‘ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు మేడమ్‌జీ?’ అని! అక్కడి తో ఆగుతారా? ‘వాట్ హ్యాపెండ్ టు యువర్ మీటూ మూవ్మెంట్’ అని మళ్లొక వెక్కిరింపు. తప్పు చేసిన మగవాళ్లకు మాట్లాడే ధైర్యం ఎలా వస్తుంది?! ఎలా వస్తుందో చూడండి. హాలీవుడ్ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్ మీద అమెరికన్ నటి ఆష్లీ జూడ్ వేసిన లైంగిక వేధింపుల కేసును ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో యు.ఎస్. మగాళ్లకు ధైర్యం వచ్చింది. బాలీవుడ్లో నానాపటేకర్ మీద నటి తనుశ్రీ దత్తా వేసిన కేసులో ఆమెకు ‘ఎ–లిస్టర్స్’ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో మనదేశంలోని మగాళ్లకు ధైర్యం వచ్చింది. యు.ఎస్.లో ఆష్లీ జూడ్, ఇండియాలో తనుశ్రీ దత్తా తొలి (మీటూ) తిరుగుబాటు సిపాయిలు. ‘టైమ్ ఈజ్ అప్’ ఇంకో మీటూ టైప్ ఉద్యమం. హాలీవుడ్ నటీమణులంతా కలసి నిర్మించుకున్నది. ‘టైమ్ ఈజ్ అప్’ సీఈవో లీసా బార్డర్స్. ఆమె సుపుత్రుడు చేసిన నిర్వాకానికి ఇటీవలే ఆమె సీఈవో గా రాజీనామా చేశారు. కొడుకుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపలే ఆమె ఆ పని చేశారు. ఇదిగో ఇలాంటి ‘ఓటములే’ మగవాళ్ల ధైర్యానికి భగ్గున ఉత్సాహాన్ని పోస్తుంటాయి. అయితే కొడుకు తప్పు చేశాడని, భర్త తప్పు చేశాడని ఒక స్త్రీ నైతిక బాధ్యతను స్వీకరించారంటే అర్థం.. తను చేస్తున్న పోరాటంలో ఆమె ఓడిపోయారని కాదు. పోరాటాన్ని గెలిపించుకున్నారని. అది అర్థమౌతుందా మన మగధీరులకు? అర్థమై ఉంటే మీటూ ఉద్యమం గత నెలలో తిరిగిన ఒక ‘మలుపు’ను కచ్చితంగా గమనించి ఉండేవాళ్లు. ఫ్లారిడాలోని ‘కిస్సింగ్ స్టాచ్యూ’లో.. ఒక నేవీ సైనికుడి మొరటు చుంబనం ధాటికి వెనక్కి ఒరిగిన నర్సు కాలిపై ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి ‘మీటూ’ అని ఎర్రటి పెయింట్‌తో రాసి నిరసన తెలిపారెవరో! ఆ రాసిన వాళ్ల కోసం ప్రస్తుతం యు.ఎస్.పోలీసులు వెతుకుతున్నారు. వెదకడం ఎందుకంటే శిక్షించడం కోసం! శిక్షించడం ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటుకు చిహ్నంగా యు.ఎస్. ప్రతిష్ఠించుకున్న స్టాచ్యూ అది. ‘అన్‌కండిషనల్ సరెండర్’ అని ఆ స్టాచ్యూకి అమెరికా పేరు కూడా పెట్టుకుంది. జపాన్ లొంగిపోయిందన్న వార్త తెలిసి, ఒళ్లు తెలియని ఆ సంతోషంలో న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ఒక నేవీ సోల్జర్.. రోడ్డు మీద వెళ్తున్న ఒక నర్సు మీద పడి, ఆమె విడిపించుకోడానికి కూడా వీల్లేకుండా తన కండబలంతో ఆమెను ఆక్రమించుకుని, ముద్దు పెట్టుకున్నప్పుడు ఎవరో తీసిన ఫొటోకి విగ్రహ రూపమే ‘అన్‌కండిషనల్ సరెండర్’ స్టాచ్యూ. ఆ ఫొటో నకళ్లు విగ్రహాలు విగ్రహాలుగా అమెరికా అంతటా ఇప్పటికీ ఉన్నాయి. ఉండటమేంటి.. ఉంచుకున్నారు గొప్ప హిస్టారిక్ ప్రతిష్టలా!‘మీటూ’ తిరుగుబాటును యు.ఎస్. కనుక రెస్పెక్ట్ చేసి ఉంటే ఇప్పటికే ఆరో ఏడో ఉన్న ఈ స్టాచ్యూలన్నిటినీ కూలగొట్టి ఉండాలి. అలాంటిదేమీ జరగలేదు! స్త్రీ దేహంపై దురాక్రమణలా స్పష్టంగా కనిపిస్తున్న ఆ కిస్సింగ్ స్టాచ్యూలు దేశప్రతిష్టకు చిహ్నాలను అనుకోవడంలో ఉన్నది ఆ దేశ భావ దౌర్భాగ్యమే కానీ, మరొకటి కాదు. ఆ సంగతి చెప్పడానికే అజ్ఞాత మహిళలెవరో నర్స్ కాళ్లకు ‘మీటూ’ను పెయింట్ చేసి వెళ్లారు. ఏడాదిన్నరగా జరుగుతున్న మీటూ ఉద్యమంలో.. పురుషుడి దురహంకారంపై, దురాక్రమణపై తొలి శక్తిమంతమైన ప్రతిఘటన ఆ రెడ్ పెయింట్. ‘రాసేసి పారిపోతే సరిపోతుందా, అదేం సాధికారత’ అంటున్నారు! మరి.. కండబలంతో మీద పడిపోయి, ‘అన్‌కండిషనల్ సరెండర్’ అంటే సరిపోతుందా? అదేం సావరినిటీ!! అమెరికన్ రివల్యూషన్, ఫ్రెంచి రివల్యూషన్, రష్యన్ రివల్యూషన్.. చరిత్రలో ఏ దేశానిదా రివల్యూషన్. దేశాలు, సామ్రాజ్యాలు పుట్టి బుద్ధెరిగాక ఇన్ని శకాలకు ఇప్పుడు ప్రపంచమంతటా ఏకకాలంలో నడుస్తున్న రివల్యూషన్లు మీటూ, టైమ్ ఈజ్ అప్. అంటే చూడండి.. ఆడవాళ్లు ఎన్ని యుగాలుగా ఓపికపట్టి ఉన్నారో! ఎన్ని యుగాలుగా మగవాడిని తప్పించుకుంటూ వస్తూ.. వస్తూ.. ఒక్కసారిగా ఎదురు తిరిగి నిలబడ్డారో! మగవాడికి మర్యాద నేర్పే టైమ్ అయిపోయింది. ‘మర్యాదగా ఉండు’ అని చెప్పే టైమ్ ఇది. ‘రెడ్ పెయింట్’ టైమ్. మాధవ్ శింగరాజు -
సామాజిక తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కేంద్రంగా అభివృద్ధే తమ లక్ష్యమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాంను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. పార్టీ ఏర్పాటు కారణాలు, లక్ష్యాలపై వివరించారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. ప్రస్తుతం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, నిరంకుశ పాలనకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఎటువైపు ఉంటారో తేల్చుకోండని తెలంగాణ సమాజం అడుగుతోంది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలోపేతం చేయడానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే. యువతకు, రైతులకు, పేద వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి టీజేఎస్ కార్యకర్త కదలాలి. ప్రజలు, వారి బతుకు దెరువు కేంద్రంగా పని చేయాలి. మరో తెలంగాణను నిర్మించుకుందాం. కొత్త రాజకీయాలను సృష్టించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం చేసే వారిని నిలదీయాలన్నారు. ‘పెత్తనం చేయొద్దు.. దిగిపొమ్మని చెబుతాం.. దింపేందుకు వస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందని, ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఆగడాలు, అక్రమాస్తులు, కాంట్రాక్టర్ల దోపిడీపై తెలంగాణ జన సమితి విచారణ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఏడెనిమిది వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఆపితే అడ్వొకేట్లకు, జర్నలిస్టులకు, నిరుపేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ఒక్కరితో వచ్చింది కాదు.. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని కోదండరాం చెప్పారు. అలాంటివారి త్యాగాలతో తెలంగాణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరి వల్లో కాదని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో పోరాడిన వారిపై రౌడీషీట్లు పెట్టారని, పెట్టించిన వారు మంత్రుల స్థానంలో కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో 15 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. వేదికపై అన్ని వర్గాలు ఆవిర్భావ సభకు పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదికపై వివిధ వర్గాలకు చెందిన వెయ్యి మంది కూర్చునే అవకాశం కల్పించారు. వీరిలో పార్టీ నాయకులతో పాటు మల్లన్నసాగర్, నేరెళ్ల బాధితులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు, అమర వీరుల కుటుంబీకులు, నిర్వాసితులు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతోందని, ఇందుకేనా కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నది అని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, బిల్డింగులు కట్టడం కాదని ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించడమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు వ్యక్తుల చుట్టూనే పాలన నడుస్తోందని ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి విమర్శించారు. ‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తా అంటడు.. మరోరోజు ఇస్తాంబుల్ చేస్తా అంటడు. స్కైవేలు.. హైవేలు అని చెప్పాడు కదా... అవన్నీ ఏమయ్యాయి’ అని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. -
సీఎంది నియంతృత్వ పాలన
చాడ సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కోరికలు నెరవేరడం లేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. అసలు టీఆర్ఎస్ పాలన సచివాలయం నుంచి జరగడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంను కలిసే పరిస్థితి లేదని, అందుకే ప్రజలు ప్రగతిభవన్ వద్దకే వెళ్లి నిరసన తెలుపుతున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ధర్నాలను కూడా నిషేధించారని చాడ ఆరోపించారు.