స్త్రీలోక సంచారం | Woman's Wandering | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Sun, Sep 16 2018 11:37 PM | Last Updated on Mon, Sep 17 2018 12:29 AM

Woman's Wandering - Sakshi

ముంబై సమీపంలోని, రాయ్‌గఢ్‌ జిల్లా మొహొపడాలో ఆ చుట్టుపక్కల నుంచి వచ్చి, పౌరోహిత్యం నేర్చుకుంటున్న 150 మంది మహిళలు.. కోర్సు పూర్తి చేసుకుని ఈ ఏడాది అధిక సంఖ్యలో గణేశ్‌ ఉత్సవాలలో పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో ఒక కొత్త సంప్రదాయం ఆరంభమైనట్లయింది. పౌరోహిత్యం నేర్చుకోడానికి, నిర్వహించడానికి ఏనాటి నుంచో మహిళలపై ఆంక్షలు ఉండగా.. ఆలిబాగ్‌లో ఉంటున్న రామేశ్వర్‌ కార్వే అనే నూరేళ్ల వయసున్న సంస్కృత విశ్రాంత ఉపాధ్యాయుడు ఆ ఆంక్షలను ధిక్కరించి గత పద్దెనిమిదేళ్లుగా మహిళలకు, అది కూడా బ్రాహ్మణేతర మహిళలకు పౌరోహిత్యంలో పాఠాలు నేర్పిస్తూ, వారిని ‘శని శాంతి పూజ’ సహా.. సర్వ కార్యక్రమాలకు, క్రియలకు తగిన పురోహితులుగా తీర్చిదిద్దుతున్న క్రమంలో ఈ ఏడాది నూటా యాభై మంది పూజా ప్రవీణులుగా అర్హత సాధించి ముంబై, థాణె, నవీ ముంబైలలో పూజలకు ఆహ్వానాలు అందుకుంటున్నారు.
సెప్టెంబర్‌ 6 నుంచి 14 వరకు జరిగిన న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో.. ప్రముఖ బార్బడోరియన్‌ గాయని, నటి, బిజినెస్‌ఉమన్‌ అయిన రిహాన్నా ఫెంటీ.. మునుపెన్నడూ లేని విధంగా ర్యాంప్‌ సంప్రదాయానికి విరుద్ధంగా అనేక జాతులు, ముఖ్యంగా అనేక శరీరాకృతులతో ఉన్న మహిళల చేత  తన కంపెనీ ప్రతిష్టాత్మక ఉత్పత్తి అయిన ‘శావేజ్‌ ఎక్స్‌’ బ్రాండ్‌ లోదుస్తులకు మోడలింగ్‌ ఇప్పించడం అందరి ప్రశంసలకు నోచుకుంది. ‘‘అన్ని సంస్కృతులు, జాతులు, దేహాకృతులు గల మహిళలు ఉన్నప్పుడే ఏ వేడుకకైనా నిండుతనం వస్తుంది’’ అని రిహాన్నా చేసిన వ్యాఖ్యకు కూడా అనూహ్యంగా అభినందనలు లభించాయి.
♦  ఐ ఫోన్‌లను మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువగా కొంటారన్న వాస్తవాన్ని విస్మరించి, వారి చేతికి ఇముడుతుందో లేదోనని కూడా ఆలోచించకుండా.. గత ఏడాది విడుదల చేసిన ఐ ఫోన్‌ 8 ప్లస్‌ కంటే కూడా ఒక అంగుళం వెడల్పును పెంచి మరీ, 6. 5 అంగుళాల స్క్రీన్‌ సైజులో సరికొత్త ‘ఎక్స్‌ ఎస్‌ మ్యాక్స్‌’ ఐ ఫోన్‌ను ఆపిల్‌ కంపెనీ విడుదల చేయబోతుండటంపైన, నాలుగు అంగుళాల స్క్రీన్‌తో ప్రస్తుతం చవక ధరల్లో అందుబాటులో ఉన్న ‘ఎస్‌ ఇ’ ఐ ఫోన్‌ ఉత్పత్తిని ఆపేయబోతున్నామన్న ప్రకటన పైన.. ప్రముఖ స్త్రీవాద కార్యకర్త కరోలీన్‌ క్రియాడో పెరెజ్‌ విరుచుకు పడుతున్నారు. ఆపిల్‌ కంపెనీ ప్రధానంగా పురుషులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఐ ఫోన్‌లను పెద్దవిగా డిజైన్‌ చేస్తోందని కూడా కరోలీన్‌ ఒక ఆరోపణ చేయగా, దానిపై ‘ఈక్వాలిటీ’ పార్టీ లీడర్‌ సోఫీ వాకర్స్‌.. ట్విట్టర్‌లో ఆమెకు మద్దతు తెలుపుతూ.. ‘ఆపిల్‌లో పని చేస్తున్న బాయ్స్‌ అందరూ పెద్దగా ఉండడం గొప్ప అనుకుంటున్నట్లుంది. పని తీరు కూడా ముఖ్యమేనని వారు తెలుసుకోవాలి’ అని చిన్న చురక అంటించారు.
♦  విడిపోవాలనుకున్న భార్యకుగానీ, భర్తకు గానీ విడాకులు త్వరగా మంజూరయ్యే విధంగా చట్టంలో సవరణలు చేసే ప్రతిపాదనలను బ్రిటన్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు విడాకులు కోరుకున్నా, అందుకు రెండోవారి సమ్మతి గానీ, విడాకులకు కారణాలను చూపవలసిన అవసరం గానీ, కౌన్సెలింగ్‌ గానీ, అపార్థాలు తొలగిపోయేందుకు కొంత సమయం ఇవ్వడం గానీ లేకుండానే విడాకుల పత్రాలు తక్షణం చేతికందేలా చట్టాన్ని సవరించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించడం కోసం జస్టిస్‌ సెక్రెటరీ డేవిడ్‌ గాకే న్యాయ నిపుణులతో కూర్చొని దీర్ఘాలోచనలు చేస్తున్నారు.
♦  అమెరికన్‌ సైకలాజికల్‌ హారర్‌ మూవీ ‘మదర్‌’ (2017)లో తల్లిగా నటించి అసమాన ప్రతిభ కనబరిచిన 28 ఏళ్ల హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ లారెన్స్‌.. నేటికీ తను సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటున్నానని ‘ఇన్‌స్టైల్‌’ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెబుతూ, ‘దూరంగా ఉంటున్నాను తప్పితే.. ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఏం జరుగుతోందీ దొంగచాటుగా గమనిస్తూనే ఉంటా
నని’ ఒక రహస్యాన్ని బహిర్గతం చేశారు. ‘ఐ వాచ్, ఐ డోన్డ్‌ స్పీక్‌’ అని చెప్పడం ద్వారా.. ‘గమనిస్తూ ఉండాలి.. బట్, గుంపులోకి వెళ్లిపోకూడదు’ అని పరోక్షంగా అమ్మాయిలకు చక్కటి సందేశం ఇచ్చిన జెన్నిఫర్‌ 2014 లోనే.. ఒక ఇంటర్వ్యూలో.. ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో తను ఎప్పటికీ తలదూర్చేది లేదని చెప్పేశారు.
♦  హాలీవుడ్‌లో ‘మీ టూ’ ఉద్యమం మొదలై ఏడాది పూర్తయి, నేటికీ అదే ఉద్ధృతిలో కొనసాగుతున్నప్పటికీ.. కనీసం ఆ స్ఫూర్తితోనైనా మన దగ్గర  ఒక్కరు కూడా నేటికీ నోరు మెదకప పోవడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. ‘‘బాధితులకన్నా ముందు, బాధితులకు మద్దతు ఇచ్చేవారు బయటికి వచ్చినప్పుడు
మాత్రమే ఇలాంటి ఉద్యమాలను మనం ప్రారంభించి, కొనసాగించగలం’’ అని బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే అన్నారు. ‘ఇండియా టుడే మైండ్‌ రాక్స్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొన్న రాధిక.. ఇటీవల ఓ స్టార్‌ హోటల్‌ లిఫ్ట్‌లో సహ నటుడి ప్రవర్తనతో తనెలా దిగ్భ్రాంతికి లోనయ్యారో గుర్తు చేసుకుంటూ.. ఏ రంగంలోనైనా అధికారంలో ఉన్నవాళ్లు, అధికారంలో ఉన్నవాళ్లకు దగ్గరగా ఉన్న వాళ్లు ఎలాంటి సంకోచమూ లేకుండా స్త్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడతారని, అలాంటప్పుడు బాధితులకు ఏ చిన్న ఆసరా దొరికినా వారు బయటికి వచ్చేందుకు భరోసాగా ఉంటుందని అన్నారు.
♦  ‘అమ్మ కూచి’ అనే మాటకు భిన్నంగా.. ఐశ్వర్యరాయ్‌ బచన్‌ నిరంతరం తన కూతురు ఆరాధ్య చెయ్యి పట్టుకుని కనిపిస్తూ, ఐశ్వర్యే ‘కూతురు కూచి’లా తయారయిందని ఎప్పట్నుంచో ఆమెను నిర్దయగా ట్రోల్‌ చేస్తున్న సోషల్‌ మీడియా.. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్లి, ‘ఈ మితిమీరిన ప్రేమ.. ఓవర్‌ ప్రొటెక్షన్‌లా ఉంది తప్పితే.. ఆరాధ్యను ధీమా గల అమ్మాయిగా భవిష్యత్తులోకి నడిపించేలా లేదు’ అని ఐశ్వర్యపై కామెంట్‌ల మీద కామెంట్లు పోస్ట్‌ చేస్తోంది. మరికొందరైతే.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆరాధ్యను వెంటబెట్టుకు వెళ్లడం, ఎప్పుడూ ఆమె చెయ్యి పట్టుకునే ఉండటం చూస్తుంటే.. ఆమె చేజేతులా తన కూతురు జీవితాన్ని పాడుచేస్తోందని అనిపిస్తోందని ‘ట్రోల్‌’ చేస్తున్నారు.
గత ఏడాది ప్రారంభం అయిన ‘మాతృవందన సప్తాహ్‌’ పథకం క్రింద ఇప్పటి వరకు 37 లక్షల మంది కొత్త తల్లులకు నగదు సహాయం చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తల్లుల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద తొలికాన్పు తల్లులకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా, ‘జనని సురక్ష యోజన’ పథకం కింద మరో వెయ్యి రూపాయల లబ్దిని చేకూర్చినట్లు ఆ ప్రకటన తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement