ట్రంపుతా! | Women are not feminists Humanist | Sakshi
Sakshi News home page

ట్రంపుతా!

Published Fri, Jan 19 2018 11:39 PM | Last Updated on Fri, Jan 19 2018 11:39 PM

Women are not feminists  Humanist - Sakshi

ఆడవాళ్లు ఫెమినిస్టులు కాదు.  హ్యూమనిస్టులు. తను బాగుంటే సమాజం బాగుంటుందని తెలిసినవాళ్లు. సమాజం బాగుండాలంటే  అధికారం తమ దగ్గర ఉండాలని తెలుసుకున్నవాళ్లు.  ట్రంప్‌ ప్రమాణస్వీకారం చేసిన రోజు మొదలైన ‘మహిళా మార్చ్‌’.. నేడు ఇంకో అడుగు వేయబోతోంది. 

ఎటువైపు చూసినా మహిళలే. నిప్పులా మహిళ.. ఉప్పెనలా మహిళ! నింగిలా మహిళ.. ఫిరంగిలా మహిళ! వాయువులా మహిళ.. విశ్వానికే ఆయువులా మహిళ. 

ఏడు ఖండాల్లో సూర్యుడివాళ ఎరుపెక్కడు. పింక్‌తో ప్రచండుడౌతాడు! ఏడు సముద్రాల్లో నీరివాళ నీలివర్ణంలో ఉండదు. పింక్‌ పోటెత్తుతుంది! ఏడు గగనాల్లో నిశి ఇవాళ మసకమసగ్గా ఉండదు. పింక్‌ పిండారబోసినట్లుంటుంది! ఏడు లోకాల్లో గాలులివాళ, జ్వాలలివాళ, గొంతులివాళ.. అన్నీ పింక్‌లోనే ప్రతిఫలిస్తాయి. ప్రతిధ్వనిస్తాయి. ప్రతిఘటిస్తాయి. దడదడమంటూ పదఘటనలతో విశ్వగోళాల చుట్టూ పరిభ్రమిస్తాయి.  పింక్‌  నేడు పిడికిలి బిగిస్తుంది.  సమరశంఖం పూరిస్తుంది.  నరాలు ఉబికేలా నినదిస్తుంది.  ఎక్కడి నుంచి వస్తోంది ఇంత పింక్‌? గాలిలా, నేలలా, నింగిలా, నిప్పులా, నీటిలా.. పంచభూతాలనే పరుగులెత్తించేలా, నురగలు కక్కించేలా.. ఎక్కడి నుంచి ఫెటిల్లమనబోతోంది? విస్ఫోటించబోతోంది? ఇంటింటి నుంచి!  అవును. ఇంటింటి పొగగొట్టాల నుంచి,  మసిబారిన జీవిత ఘట్టాలనుంచి తోసుకుని, తోసుకుని ఆశలమేఘంలా కమ్ముకుని వీధిల్లోకి వస్తోంది. గుప్పెట నిండా నినాదాలను పట్టుకుని రాజ్యాల రహదారులపై కవాతు చేయడానికి వస్తోంది.   ‘పవర్‌ టు ద పోల్స్‌’. ‘లుక్‌ బ్యాక్, మార్చ్‌ ఫార్వర్డ్‌’.
అందనిది అందుకుందాం.. అందలానికి అడుగులేద్దాం.  ఇదే లక్ష్యం. ఇదే గమ్యం. ది గ్రేట్‌ విమెన్‌ మార్చ్‌.  మహిళల భారీ ప్రదర్శన! ముందుకు అడుగు వేయడానికి. పాలకుల్ని కడిగివేయడానికి.. మహా ప్రదర్శన.  ఈవెంట్‌ పేరు.. ‘2018 విమెన్స్‌ మార్చ్‌’.  ఈవెంట్‌ తీరు.. విప్లవోద్యమ హోరు. 
   
నిరుడు ఇదే రోజున... ఇదే జనవరి 20న మొదలైన హోరు ఇది.   ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఆకాశంలోంచి పూలేం కురవలేదు! ఆకాశంలో సగమైన మహిళ నేత్రాలలోంచి అగ్ని కణాలు కురిశాయి. శతఘ్నులై అవి వైట్‌హౌస్‌ వైపు గర్జించాయి.  దిగిపో ట్రంప్‌. నువ్వు మాకిష్టం లేదు.  దిగిపో ట్రంప్‌. నీకు ఆడవాళ్లంటే గౌరవం లేదు.  దిగిపో ట్రంప్‌. పాలించే అర్హత నీకు లేదు.  ఎక్కడికి పోతాడు? ఎందుకు పోతాడు? యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా.. కోరికోరి ఎన్నుకున్నవాడే కదా ఆ ప్రెసిడెంట్‌.  ట్రంప్‌ దిగిపోవడం కాదు. మనమే ఎదిగిపోవాలి. వ్యూహం మారింది. మహిళలు ఏకం అయ్యారు. ఐదు లక్షల మంది మహిళలు ఒక థీమ్‌గా పింక్‌ కలర్‌ పుస్సీహ్యాట్స్‌ తలపై ధరించి వాషింగ్టన్‌ వీధుల్లోకి వచ్చారు.  వారి స్వరంలో అప్పుడిక ట్రంప్‌ లేడు! ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికన్‌ సమాజం ఉంది. ఆ సమాజానికి లాగిపెట్టి ఒక్కటిస్తే చాలు.. ట్రంప్‌ దవడలు అదిరిపోతాయి.  మహిళల హక్కులు, వలసల హక్కులు, ఆరోగ్య హక్కులు, మాతృత్వపు హక్కులు, ప్రకృతి హక్కులు, స్వేచ్ఛా సమానత్వపు హక్కులు, కార్మిక హక్కులు.. ట్రంప్‌ ఇవన్నీ కత్తిరించబోతున్నాడని, ‘అమెరికా ఫస్ట్‌’ అనే కత్తి నూరుతున్నాడని ఎన్నికల ప్రచారంలోనే తేలిపోయింది.  ఆ హక్కుల్ని అమెరికా ప్రెసిడెంట్‌ నుంచి కాపాడుకోవాలి. అందుకు అధికారం సంపాదించుకోవాలి. ఆ అధికారాన్ని ఉద్యమంతో సాధించుకోవాలి. అదే.. ‘పవర్‌ టు పోల్స్‌’. ట్రంప్‌ని ఇంపీచ్‌ చెయ్యడం స్టేజ్‌ వన్‌ ఉద్యమం.  ట్రంప్‌లాంటి వ్యవస్థపై పోరాడటం స్టేజ్‌ టు ఉద్యమం. 2017లో స్టేజ్‌ వన్‌లో ఉన్న మహిళలు 2018లో స్టేజ్‌ టు లోకి వచ్చేశారు.  2019లో స్టేజ్‌ త్రీ మార్చ్‌. 2020లో అధికారం చేజిక్కించుకునే మార్చ్‌. మార్చ్‌ ఒక్క అమెరికాలోనే కాదు. దాదాపుగా అన్ని దేశాలలో. అన్ని రంగాలలో. అన్ని పంథాలలో. 

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే.. జనవరి 20 అంతర్జాతీయ మహిళల ఐక్యతా దినోత్సవం అన్నంతగా మహిళలు ఏకం అయ్యారు. అవుతున్నారు. ఎటువైపు చూసినా మహిళలే. నిప్పులా మహిళ, ఉప్పెనలా మహిళ. నింగిలా మహిళ, ఫిరంగిలా మహిళ. వాయువులా మహిళ, విశ్వానికే ఆయువులా మహిళ. 2017లో జరిగింది.. ‘లార్జెస్ట్‌ సింగిల్‌డే ప్రొటెస్ట్‌ ఇన్‌ యూ.ఎస్‌.హిస్టరీ’
ఇవాళ జరగబో తున్నది.. లార్జెస్ట్‌ సింగిల్‌ డే ప్రొటెస్ట్‌ ఇన్‌ ది వరల్డ్‌! ఈ నిరసనలకు ‘మీ టూ’, ‘టైమ్స్‌అప్‌’ ఉద్యమాలూ అజ్యం అయ్యాయి. ఒక్కోదేశంలో ఒక్కో సమస్య ఉంది. అన్నిదేశాల్లోనూ ఉన్న సమస్య మానవహక్కుల సమస్య. వాటిపై మహిళలు ఫైట్‌ చేయబోతున్నారు. తమ కోసం మాత్రమే చేస్తున్న ఫైట్‌ కాదది. మొత్తం మానవజాతి సంక్షేమం కోసం చేయబోతున్నది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్వీటర్‌ రెడీగా ఉన్నాయి. మేమున్నాం.. మీరు కానివ్వండని! మహిళలారా.. బిగిసిన మీ ఒక్క పిడికిలినీ వృథా కానివ్వం. మహిళలారా ఎలుగెత్తిన మీ ఒక్క గొంతునీ వృథా కానివ్వం. అడుగడుగునా.. మీ ఆశనీ, మీ శ్వాసనూ, మీ సమరాన్నీ, మీ నిరాయుధ ధర్మాగ్రహాన్నీ, మార్చింగ్‌లో మీ పాదాల కింద రేగిన ప్రతి ధూళికణాన్నీ క్యాప్చర్‌ చేసి చట్టసభల్లోకి పంపిస్తాం అని కెమెరాలతో రెడీగా ఉన్నాయి. మహిళా జయీభవ! విజయీభవ. లాలించిన తల్లీ.. పాలించు. పరిపాలించు. భువిలో దివిని సృష్టించు. 

నేడు (2018 విమెన్స్‌ మార్చ్‌)
►యు.ఎస్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాలతో పాటు.. గ్రీసు, స్పెయిన్, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీలో నేడు ‘విమెన్స్‌ మార్చ్‌’ జరుగుతోంది.
►ప్రపంచవ్యాప్తంగా 250 మహిళా ర్యాలీలు జరుగుతున్నాయి. 
►యు.ఎస్‌.లో ‘పవర్‌ టు ద పోల్స్‌’ అనే థీమ్‌తో, మిగతా దేశాల్లో ‘లుక్‌ బ్యాక్, మార్చ్‌ ఫార్వార్డ్‌’ అనే థీమ్‌తో ఈ ‘విమెన్స్‌ మార్చ్‌’ జరుగుతోంది. 
►2017 మార్చ్‌కి కొనసాగింపుగా 2018 మార్చ్‌ జరుగుతోంది. 

నాడు (2017 విమెన్స్‌ మార్చ్‌)
►ట్రంప్‌కు వ్యతిరేకంగా మొదలై, అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా మలుపు తిరిగింది. 
►శాంతియుతంగా, ఒక్క అరెస్టయినా లేకుండా ప్రదర్శన జరిగింది!
►హిల్లరీ క్లింటన్, హవాయీ మహిళ తెరెసా షూక్‌ చొరవతో ‘మార్చ్‌’ జీవం పోసుకుంది. ఫేస్‌బుక్‌ దానికి పురుడుపోసింది.
►మొదట ఈ ఉద్యమానికి అనుకున్న పేరు ‘మిలియన్‌ విమెన్‌ మార్చ్‌’. తర్వాత ‘విమెన్స్‌ మార్చ్‌’ అయింది.

ఉద్యమంలో మనవాళ్లు
‘విమెన్స్‌ మార్చ్‌’, టైమ్స్‌అప్‌’, ‘మీ టూ’.. ఈ మూడూ.. మూడు అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు. వీటిల్లోని ఏ ఉద్యమంలోనూ మనవాళ్లు లేరు. అలాగని తమకేం పట్టనట్లూ లేరు! బయటి నుంచి మద్దతు ఇచ్చారు. రాధికా ఆప్టే, కొంకణ సేన్, కంగనా రనౌత్, ప్రియాంకా చోప్రా, రీచా చద్ధా ఎప్పటికప్పుడు ఈ మహిళా ఉద్యమాలను బలపరుస్తూనే ఉన్నారు. ఇవాళ జరుగుతున్న ‘విమెన్స్‌ మార్చ్‌’.. అన్ని సమాజాలలో మంచి మార్పు తేవాలని వీరు ఆకాంక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement