
కలివిడిగా... కమిట్‌మెంట్‌తో....
ఉమెన్ కెరీర్
ఈ రోజుల్లో మహిళలు వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణించడం సర్వ సాధారణమైన విషయం. వీరిలో కుటుంబ అవసరాల దృష్ట్యా ఉద్యోగాలు చేసే వారు కొందరైతే, వారసత్వంగా కంపెనీ బాధ్యతలు నిర్వహించేవారు మరికొందరు. అయితే సాధారణ స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంటోంది. దీనికి కారణాలు అనేకం. ఆ కారణాలు ఏమిటో, వాటికి పరిష్కారం ఏమిటో చూద్దాం.
పురుషాధిక్యం అనే భావనను వీడాలి
రోజులు మారాయి. పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. ప్రతిదానికీ ‘‘పురుషాధిక్య సమాజం’’ అనే కారణాన్ని సాకుగా చూపకూడదు. మనకున్న వనరులే వాళ్లకీ ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నవారిలోనూ కింది స్థాయి నుంచి ఎదిగిన వారూ ఉన్నారు. వారి పట్టుదల, అంకిత భావమే వాళ్లకా స్థానాన్ని కల్పించాయి. వారి తపనకు లింగవివక్ష ఏ మాత్రం అడ్డురాలేదు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే విజయం మన సొంతమవుతుంది.
ఇల్లు, పిల్లలే సర్వస్వం కాదు.
ఇల్లు, పిల్లలే మహిళల జీవితం అనే మైండ్ సెట్ మారాలి. అలాగని పూర్తిగా పట్టించుకోకుండా ఉన్నా తప్పే అవుతుంది. కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పిల్లల పెంపకంలో ఇద్దరి బాధ్యతా ఒకటేనని గుర్తించాలి. హోమ్‌మేకర్స్ కంటే, ఉద్యోగం చేస్తున్న మహిళల పిల్లలు ఒకరిమీద ఆధారపడకుండా, ధైర్యంగా పెరుగుతారని అనేక సర్వేలు వెల్లడిచేశాయి. కాబట్టి ఇల్లు, పిల్లలే సర్వస్వం లాంటి ఆలోచనలు మాని వృత్తి జీవితంలో దూసుకెళ్లండి.
కమిట్‌మెంట్ ముఖ్యం
ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని పడితే భార్యాభర్తల్లో ఎవరు సెలవు పెడతారు? వెంటనే భార్యేనని ఠకీమని సమాధానం చెబుతారు మన వాళ్లు. ఈ ఆలోచన పూర్తిగా తప్పు. స్త్రీ, పురుష భేదం లేకుండా చేసే పని పట్ల కమిట్‌మెంట్‌తో ఉండాలి. ఉద్యోగంలో నిబద్ధతతో పనిచేస్తే సక్సెస్ మీ వెంటే ఉంటుంది.
కలుపుగోలుతనం ఉండాలి
ఏ ఉద్యోగంలో అయినా కలివిడితనం చాలా అవసరం. మానవ సంబంధాలను కొనసాగించాలి. ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. సందేహం అడిగితే అవతలి వారు ఏమనుకుంటారో అనే భావనను పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఎంత ఎక్కువ మందితో సత్సంబంధాలు ఉంటే అంత మంచిది.
‘నో’ చెప్పడానికి వెనకాడకండి
చాలా మంది మహిళలు ఇల్లు దాటి బయటకు రావాలంటేనే మొహమాటపడుతుంటారు. కొలీగ్స్ ఏదైనా అడిగినా సమాధానాలు చెప్పడానికి వెనకాడతారు. బిజీగా ఉన్నప్పుడు వాళ్లేదైనా పని చెప్తే ‘నో’ చెప్పేందుకు సంశయిస్తుంటారు. సమయం చాలా విలువైంది. ఈ విషయంలో గట్టిగా ఉండటం నేర్చుకోవాలి. ఇష్టం లేని వాటికి ధైర్యంగా నో చెప్పేయాలి.
అప్‌డేటెడ్‌గా ఉండాలి
టెక్నాలజీకి తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. నిరంతర అభ్యాసమే పరిపూర్ణత వైపు నడిపిస్తుంది. నైపుణ్యాలను పెంచుకోవాలి. నాకు టైం లేదు, వెళ్లలేను అని సాకులు చెప్పకుండా కాలంతో పాటు వేగంగా కదలాలి. అనుభవపూర్వకంగా నేర్చుకోవచ్చనుకుంటే తప్పులు దొర్లే అవకాశం ఉంది. కాబట్టి సరైన శిక్షణ అవసరం.
ఇగోలను వదిలించుకోండి
తోటి వాళ్లు ఎదుగుతుంటే వారిని ప్రోత్సహించాలి. ఈర్ష్య పడకూడదు. మనం ఎదిగేందుకు కావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాలి. ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్లారంటే అది కొద్ది రోజుల్లో సాధ్యమయ్యే విషయం కాదు. దాని వెనుక చాలా కష్టం నిగూఢమై ఉంటుంది. దీనిని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మేలు. కృషి, పట్టుదల మీ వెంట ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది.
- షర్మిల