::: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌లో న్యాయం ఉందా అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టిన పోలింగ్‌కు 57 శాతం మంది ఆమెను సమర్థిస్తూ, 43 శాతం మంది ఆమెపై వస్తున్న ట్రోలింగ్‌ని సమర్థిస్తూ కామెంట్‌లు పెట్టారు. మతాంతర వివాహం చేసుకున్న ఒక జంట పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని చెత్త ప్రశ్నలతో అవమానించారన్న ఆరోపణపై లక్నోలోని పాస్‌పోర్ట్ సేవాకేంద్రం అధికారి వికాశ్ మిశ్రాను అక్కడి నుంచి బదలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ‘అల్పసంఖ్యాకులను బుజ్జగించడం మానకుంటే మీకు తగినశాస్తి జరిగి తీరుతుంది’ అంటూ సుష్మపై మొదలైన ట్రోలింగ్ నేటికీ కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో తాజాగా, ‘నీ భార్యను కొట్టి చెప్పు. ముస్లింలను మంచి చేసుకోవడానికి హిందువులను చెడు చేసుకోవద్దని’ అంటూ సుష్మ భర్త స్వరాజ్ కౌషల్‌కు కూడా ట్రోలింగ్‌లు వస్తున్నాయి ::: చిలక కోసం ఆన్‌లైన్‌లో 71 వేల రూపాయలు చెల్లించి, ఆ చిలక ఎంతకూ డెలివరీ కాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీజా (32) అనే పక్షి ప్రేమికురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో ఉంటున్న శ్రీజ.. ‘కొనేందుకు మంచి చిలక ఎక్కడ దొరుకుతుందీ’ అంటూ ఆన్‌లైన్‌లో ఆరా తీస్తున్నప్పుడు వాట్సాప్ ద్వారా ఆమెను పరిచయం చేసుకున్న బాబీ అనే వ్యక్తి, తనొక చిలకల వ్యాపారినని, తన అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తే చిలక డెలివరీ అవుతుందని నమ్మించి మోసం చేయడంతో.. అతడు తన ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుకున్నాడని ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు ::: ‘నేను అయ్యంగార్ల అమ్మాయిని’ అని 2014లో శృతీహాసన్ స్పష్టం చేస్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో అకస్మాత్తుగా ప్రత్యక్షం కావడంతో.. ఆమె తండ్రి, సినీ నటుడు, ‘మక్కల్ నీది మయం’ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కమలహాసన్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న ట్విట్టర్‌లో కమలహాసన్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘‘నా ఇద్దరు కూతుళ్లను స్కూల్లో చేర్పించేటప్పుడు దరఖాస్తు ఫారంలో ‘క్యాస్ట్ అండ్ రిలిజయన్’ కాలమ్‌ని నింపేందుకు తిరస్కరించానని’’ చెప్పడంతో వెంటనే ఆయన ప్రత్యర్థులు శృతీ వీడియోను తవ్వి తీసి ‘దీని సంగతేమిటి?’ అని ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టారు ::: జమ్ము–కాశ్మీర్‌లో రాళ్లు రువ్వే నిరసనకారులలో ఇప్పుడు కొత్తగా యువతులు కూడా కనిపిస్తుండడంతో వారిని నిరోధించేందుకు సెంట్రల్ రిజర్వు›్డ పోలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) 500 మంది మహిళా కమెండోలను రంగంలో దించింది. పంప్ యాక్షన్ గన్స్, షాట్ గన్స్, పెలెట్స్ గన్స్ పేల్చడంలో సుశిక్షితులై, స్థానికంగా హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో దారితెన్నులపై అవగాహన ఉన్న ఈ కమెండోలు సమర్థంగా అల్లర్లను అడ్డుకోగలరని విశ్వసిస్తున్న సి.ఆర్.పి.ఎఫ్. గతంలో నక్సల్స్‌ను నిలువరించేందుకు కూడా కొంతమంది మహిళా కమెండోలను అడవుల్లోని యుద్ధక్షేత్రానికి పంపింది.
స్త్రీ మనస్ఫూర్తిగా సమ్మతించనిదే ఆమెతో సంగమించడం కూడా అత్యాచారమే అవుతుందనే చట్ట సవరణ ఒకటి ఒకటి ఈ ఆదివారం నుంచి స్వీడన్‌లో అమలులోకి వచ్చింది. భయపెట్టి, బలప్రయోగం చేసి, హింసించి స్త్రీని లోబరుచుకున్నప్పుడు మాత్రమే అది ‘అత్యాచారం’ అవుతుందని ఇప్పటి వరకు స్వీడన్ చట్టంలో ఉన్నదానికి భిన్నంగా, ఇలాంటివేమీ జరగకున్నా.. స్త్రీని నిస్సహాయ స్థితిలోకి నెట్టి, ‘వద్దు’ అనడానికి వీల్లేని పరిస్థితులు కల్పించి ఆమెను పొందడం కూడా ‘రేప్’ కిందికే వస్తుందని పేర్కొంటూ.. చూపులు, మాటలు, మరే విధమైన సంకేతాలు ఇవ్వకుండానే మగవాడు స్త్రీ ని శారీరకంగా ఆక్రమించడాన్ని ఇక మీదట నేరంగా పరిగణించడం జరుగుతుందని కొత్త చట్ట సవరణ స్పష్టం చేసింది ::: విక్టోరియా బర్జెస్ అనే ఫ్లారిడా మహిళ క్యూబా నుంచి ఫ్లారిడా వరకు స్టాండప్ పెడల్‌బోర్డు మీద 160 కి.మీ. ప్రయాణించి ఇలాంటి ఒక సాహసోపేతమైన పర్యటన చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. అట్లాంటిక్ జలసంధిపై ఏకబిగిన 28 గంటలపాటు విక్టోరియా ఎంతో ధైర్యంగా, ఒడుపుగా పెడలింగ్ చేశారు :: పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్.. గెడ్డంతో ఉన్న ఒక ఇస్లాం మత పెద్ద ఫొటోను మార్ఫింగ్ చేసి ఫొటోషాప్‌లో ఆయన ముఖం స్థానంలో తన ముఖాన్ని పెట్టి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి సంచలనానికి కారణం అయ్యారు. ఈ చర్యతో ఒకవైపు ఆమెపై విమర్శలు కురుస్తుండగానే, ఏ మత పెద్ద ఫొటోనైతే రెహమ్ తనకు తెలియకుండా మార్ఫింగ్‌కి వాడుకున్నారో ఆ జింబాబ్వే మతపెద్ద ట్విటర్‌లో స్పందిస్తూ అది తన ఫొటో అని చెప్పగానే, ‘మీపై నాకు ఎంతో గౌరవం ఉంది.
ఇది కేవలం సరదాగా, నన్ను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (భర్త ఇమ్రాన్ ఖాన్ పార్టీ) కార్యకర్తలపై సంధించిన విమర్శనాస్త్రం మాత్రమే అని ఆమె సమాధానం ఇచ్చారు ::: యు.కె.లోని ఒక ఇండియన్ రెస్టారెంట్‌లో భారతీయుల ఉద్దేశించి ఒక బ్రిటిష్ మహిళా పోలీసు అధికారి చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై స్పందించిన ఇంగ్లండ్ పోలీస్ శాఖ ఆమెను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించింది. ఉత్తర ఇంగ్లండ్‌లోని నార్తంబ్రియా పోలీస్ శాఖలో పని చేస్తున్న కటీ బ్యారెట్ అనే 22 ఏళ్ల ఆ కుర్ర ఆఫీసరమ్మ న్యూక్యాజిల్ ప్రాంతంలోని ‘స్పైస్ ఆఫ్ పంజాబ్’ అనే ఆ ఫుడ్ ఔట్‌లెట్‌కు తినడానికి వచ్చి, నోరు ఊరుకోక అక్కడ పనిచేస్తున్న భారతీయ వెయిటర్‌లను ఉద్దేశించి తన సహోద్యోగులతో జాత్యహంకార వ్యాఖ్యల్ని చేసినట్లు, వేరెవరో కస్టమర్ల ద్వారా తెలుసుకున్న బ్రిటన్ పోలీసులు కటీని విధుల నుంచి తొలగించారు :::
స్త్రీలోక సంచారం
Published Tue, Jul 3 2018 12:10 AM | Last Updated on Tue, Jul 3 2018 12:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment