ఎలాంటి ఫ్యాషన్‌లు ఎవర్ గ్రీన్‌గా ఉంటాయి?
అమ్మాయిలు ఫాలో అయ్యేవా?
అమ్మాయిల్ని ఫాలో అయ్యేవా?
అమ్మాయిల్ని ఫాలో అయ్యేవే!
నైన్టీన్ సిక్స్‌టీస్ నుంచి ‘పోల్కా’ అనే ఒక ఫ్యాషన్...
అమ్మాయిల్ని ఫాలో అవుతూ వస్తోంది.
వాళ్ల బట్టల్నీ, తట్టాబుట్టల్నీ, గోళ్ల రంగుల్నీ...
చుక్కలు చుక్కలుగా డిజైన్ చేస్తూ చక్కనమ్మలుగా ముస్తాబు చేస్తోంది.
వాళ్ల ఇష్టాయిష్టాలను తెలుసుకుని గౌరవ మర్యాదలు పొందుతోంది.
దీన్ని బట్టి ఏం అర్థమౌతోంది?
అమ్మాయిల్ని ఫాలో అవాలంటే ఒక స్టేచర్, ఒక డిగ్నిటీ ఉండాలని కదా!
ఆ రెండూ పోల్కాకి ఉన్నాయి కనుకనే...
ఈవారం ఈ టాపిక్.
గుండ్రటి, పెద్ద పెద్ద చుక్కలు అన్నీ ఒకే పరిమాణంలో, సమానమైన దూరంలో కనిపిస్తాయి. తమ మధ్యా ఒక బంధం ఉందన్న భావనను తెలుపుతుంటాయి. ఆ భావనే పోల్కా ప్రింట్‌కు ప్రాణం అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. మొదట స్విమ్‌సూట్ మీద ఊపిరిపోసుకున్న ఈ చుక్కలు ఆ తర్వాత పిల్లల దుస్తులు మొదలుకొని ఆధునికం నుంచి సంప్రదాయం వరకు అన్నింటా పాకిపోయాయి.
పోల్కా డాట్స్‌కు సామాన్యులే కాదు రాజకీయ నాయకులూ దాసోహమన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని జాన్ మేజర్, ప్రస్తుత ప్రదాని టోనీ బ్లేయర్ తమ డ్రెస్ నెక్ భాగంలో పోల్కా డాట్స్ ఉండేలా డిజైన్ చేయించుకునేవారు. 1950లో గ్లామర్ క్వీన్ మార్లిన్ మన్రో తన దుస్తుల్లో పోల్కాకు ప్రత్యేకమైన స్థానమిచ్చారు.
అనుకరణే ఆయుధం:
రెట్రో ఫ్యాషన్‌కి అతి పెద్ద దారిని చూపాయి పోల్కా డిజైనర్ దుస్తులు. వీటిలో ఉండే స్పార్క్ అత్యంత వేగంగా దుస్తుల నుంచి యాక్ససరీస్ వరకు పాకింది. ‘చుక్కలు ఎప్పుడైతే ఫ్యాషన్ ప్రపంచంలోకి వచ్చాయో, అప్పుటి నుంచి మనమూ వాటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాం’ అంటారు ప్రఖ్యాత డిజైనర్ సత్యపాల్! దానికి తగ్గట్టే లుక్ ఎలా కావాలంటే అలా మారిపోతుంది పోల్కా డ్రెస్ ధరిస్తే! పోల్కా ప్రింటెడ్ బ్లౌజ్ ధరించి, సాదా చీర కట్టినా, సాదా జాకెట్టు వేసి పోల్కా చుక్కల చీర కట్టినా ఆ అందమే వేరు. అలాగే ప్యాంట్ షర్‌ట పైన చుక్కల ఓవర్ కోట్ వేసి, సన్ గ్లాసెస్ పెడితే చాలు అల్ట్రామోడ్రన్‌గానూ వెలిగిపోవచ్చు.
జీన్స్ పై పోల్కా: చుక్కల డిజైనింగ్‌లో తమదైన ముద్ర వేయాలనుకుంటే చుక్కల ప్రింట్స్ నచ్చిన దుస్తుల మీద ఫ్యాబ్రిక్ పెయింట్‌తో వేసుకోవచ్చు. బ్లూ, బ్లాక్ జీన్స్, జెగ్గింగ్స్ పైనా పోల్కా చుక్కలను వేసి, సరికొత్త లుక్‌తో మీరు మెరిసిపోవచ్చు.
డిజైనర్స్ ఫేవరేట్ పోల్కా:
జార్జెట్, షిఫాన్, క్రేప్, బ్రాసో.. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీదా అందంగా ఒదిగిపోయే సుగుణం పోల్కా చుక్కల సొంతం. అందుకే డిజైనర్ల పాలిట అదృష్టంగా మారింది పోల్కా. సెలబ్రిటీల అందచందాలను మరింతగా చూపించడానికి పోల్కాను ప్రధానంగా వాడుతున్నారు డిజైనర్లు. ర్యాంప్ పై చుక్కలను చుట్టుకున్న చక్కనమ్మలు చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోతూ డిజైనర్లకు హ్యాట్సాప్ చెబుతున్నారు. పోల్కాతో జిమ్మిక్కులు చేసే డిజైనర్లలో రోహిత్‌బాల్, సవ్యసాచి, సత్యపాల్ వంటి ప్రముఖులూ ఉన్నారు. పోల్కా డాట్స్ డ్రెస్సింగ్ గురించి వారు చెబుతున్న కొన్ని సూచనలు..
మీ వార్డ్ రోబ్‌లో ఒక్క పోల్కా డ్రెస్ లేదా ఏ ఒక్క యాక్ససరీ ఉన్నా చాలు. వెస్ట్రన్ పార్టీకి 5 నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు.
ప్లెయిన్ డ్రెస్ ధరించి ఒక్క టోపీ వాడితే చాలు. లేదంటే అదే ప్లెయిన్ డ్రెస్‌కు పోల్కా చుక్కలు ఉన్న బెల్ట్ ఉపయోగించినా అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు.
కాటన్ షూ, శాండల్స్, చెప్పల్స్, బ్యాగ్, ఇయర్ రింగ్స్, బ్రేస్‌లెట్స్... ఏ చిన్న అలంకరణ వస్తువైనా పోల్కాకు స్థానమిస్తే ఆ లుక్ రిఫరెంట్ అనిపించకమానదు.
పోల్కా డ్రెస్ వేసుకుంటున్నాం కదా! అని టాప్ టు బాటమ్ ‘ఇదే తరహా’లో వెళ్లాలనుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే అలంకరణలో ఏదో ఒక ఎలిమెంట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
చుక్కనమ్మలు
Published Thu, Dec 19 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement