విశాఖ అందాలకు ఫిదా.. | World Tourism Special Story On Vizag | Sakshi
Sakshi News home page

అందాలలో.. అహొ.. మహోదయం

Published Fri, Sep 27 2019 10:15 AM | Last Updated on Sat, Sep 28 2019 10:23 AM

World Tourism Special Story On Vizag  - Sakshi

కొండకోనలను చూసినా.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మన్యంలో అడుగు పెట్టినా.. అలల సవ్వడితో.. హొయలొలుకుతున్న సాగర తీరంలో అడుగులు వేస్తున్నా.. ఆధ్యాత్మిక శోభతో ఆహ్లాదపరిచే దేవాల యాల్లో పూజ చేసినా... ఏ చోటకి వెళ్లినా.. ఏ గాలి పీల్చినా.. భూతల స్వర్గమంటే ఇదేనేమోనన్న అనుభూతిని అందిస్తోంది విహార విశాల విశాఖ. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలన్నీ ఓచోట చేరిస్తే.. బహుశా దాని పేరే విశాఖ అంటారేమోనన్నట్లుగా పరిఢవిల్లుతున్న అందాల జిల్లా.. పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో ఏడాదికి కోటికి పైగా.. పర్యాటకులు వస్తున్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే అననడంలో ఎలాంటి సందేహం లేదు. 
–సాక్షి, విశాఖపట్నం, అరకులోయ

మన్యం.. ప్రకృతి చెక్కిన శిల్పం
ప్రకృతి కాన్వాస్‌పై రమణీయ అందాలు.. చక్కిలిగింతలు పెట్టే చలిలో కనిపించే.. సహజ సిద్ధమైన సోయగాలు, కాలుష్యాన్ని దరిచేరనివ్వని ప్రకృతి రమణీయత, కలకాలం గుర్తిండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను ముడుపుగా ఇచ్చే అరకు అందాలు, విశాఖ మన్యం సోయగాలను వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్‌ లంబసింగి వరకూ ఎటు చూసినా.. ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. జిల్లాకు వచ్చే పర్యాటకుల్లో 80 శాతం మంది అరకు మొదలైన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పర్యాటక స్థలాలను సందర్శిస్తుంటారు. అలాంటి మన్యం అందాలకు మెరుగులు దిద్దేలా.. రూ.156 కోట్లతో అరకు టూరిజం సర్క్యూట్‌ పేరుతో సమీకృత ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ కేంద్రానికి పంపించింది. త్వరలోనే దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ రానుంది. ఇదే ఏర్పాటైతే మన్యంలోని 11 మండలాలు అందులో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన 36 ప్రాంతాలను ఈ టూరిజం సర్క్యూట్‌లో భాగం కానున్నాయి. ఈ అందాలకు మరింత సొబగులద్దే నిర్మాణాలు చేపట్టనున్నారు. తొలి విడతగా 9 ఎకరాల్లోనూ, మలివిడతగా 18 ఎకరాల్లోనూ మన్యం ప్రాంతంలో పలు చోట్ల ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.

జలపాతాల సవ్వడి
మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. ముఖ్యంగా అనంతగిరిలోని కటిక జలపాతం, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు జలపాతం, పెదబయలులోని పిట్టలబొర్ర వాటర్‌ఫాల్స్, బొంగదారి జలపాతం, ఒడిషా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ జలపాతం, చింతపల్లి మండలం దారకొండలోని జలపాతం, జిమాడుగులలో కొత్తపల్లి జలపాతం... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. అయితే.. వాటర్‌ఫాల్స్‌ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడతంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన జలపాతాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చెయ్యాలని భావిస్తున్నారు. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల్ని తొలిదశలో ఎంపిక చేశారు. ఈ జలపాతాల వద్ద రూమ్‌లు, ఫుడ్‌కోర్టులు, వాష్‌రూమ్‌లు, రెస్ట్‌రూమ్‌లు నిర్మించాలని నిర్ణయించారు.

సర్క్యూట్‌లతో సూపర్‌...
జిల్లాలో మూడు టూరిజం సర్క్యూట్‌లు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. అరకు టూరిజం సర్క్యూట్‌కి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతుల రావాల్సి ఉండగా.. మిగిలిన సర్క్యూట్‌లు కూడా కొత్త పాలసీ వచ్చాక ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అరకు ఎకో టూరిజం సర్క్యూట్, రూ.49 కోట్లతో భీమిలిలో పాసింజర్‌ జెట్టీ సర్క్యూట్‌ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. ఈ డీపీఆర్‌ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండటంతో ఇటీవలే మంత్రి అవంతి శ్రీనివాసరావు సంబంధిత అధికారులు, కేంద్ర మంత్రులతో భేటీ అయి.. ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు అనుమతులు కోరారు. అదే విధంగా బౌద్ధ కేంద్రాలైన బొజ్జనకొండ, తొట్లకొండ, బావికొండని సందర్శించేలా రూ.20.70 కోట్లతో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ మూడు ప్రాజెక్టులు సిద్ధమైతే.. విశాఖ పర్యాటకానికి మరింత సొబగులు చేకూరనున్నాయి.
అభివృద్ధి పథంలో నడిపిస్తాం...

రెస్టారెంట్లు.. రిసార్టులు..
పెరుగుతున్న పర్యాటకానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పర్యాటక శాఖ సిద్ధమవుతోంది. పలు రెస్టారెంట్లు, రిసార్టులు నిర్మిస్తోంది. ఎర్రమట్టిదిబ్బల సమీపంలో రూ.2 కోట్లతో కంటైనర్‌ రెస్టారెంట్‌ను నిర్మించింది. అదే విధంగా రూ.2 కోట్లతో అరకులో డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌ నిర్మించింది. ఇవి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వీటితో పాటు ఏజెన్సీలో రూ.5.5 కోట్లతో ట్రైబల్‌ హట్‌(సంత), రూ.2.2 కోట్లతో ఈట్‌ స్ట్రీట్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇవే కాకుండా విభిన్న ప్రాంతాల్లో వివిధ ప్రాజెక్టు రూపకల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పర్యాటక శాఖకు ఉన్న 550 ఏకరాలను లీజుకు ఇచ్చి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రకృతి అందాల కలబోత విశాఖపట్నం. ఈ జిల్లాను పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్క్యూట్‌లు, టూరిజం ప్యాకేజీలతో పాటు సరికొత్త ప్రాజెక్టులు అమలు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు కృషిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నాయి.
–అవంతి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

విదేశీయుల తాకిడి పెరుగుతోంది...
విశాఖపట్నం అంటే.. విదేశీయులు చాలా ఇష్టపడుతున్నారు. అందుకే.. ప్రతి నెలా విశాఖ సందర్శిస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారికి అనుగుణంగా పర్యాటక శాఖ కొత్త కొత్త ప్రాజెక్టులు పరిచయం చేస్తోంది.
– పూర్ణిమ, జిల్లా పర్యాటక శాఖాధికారి

విదేశీయులు ఫిదా...
విశాఖ అందాలకు విదేశీ పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది వచ్చిన పర్యాటకుల సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.  2018లో 2,49,20,169 మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 95,759 మంది విదేశీయులు విశాఖకు వచ్చారు. మొత్తం 2,50,13,607 మంది వచ్చారు. 2019లో ఎనిమిది  నెలల్లో 1,86,47,551 మంది స్వదేశీ, 69,091 మంది విదేశీయులతో కలిపి మొత్తం 1,87,16,642 మంది పర్యాటకులు విశాఖ జిల్లాను సందర్శించారు.

విదేశీ క్రీడలకూ వెల్‌కమ్‌....
సరికొత్త సాహస క్రీడకు విశాఖనే వేదికగా మార్చాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇందుకోసం రుషికొండ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ఓ ప్రైవేట్‌ సంస్థ నగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు బీచ్‌లను పరిశీలించింది. రుషికొండలో పారాసెయిలింగ్‌ నిర్వహణకు అనుకూలంగా ఉందనీ, అక్కడ సీ స్పోర్ట్స్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏపీ టూరిజంతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు స్థానిక పర్యాటక శాఖ అధికారులు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే రుషికొండలో విశాఖ పర్యాటకులకు పారాసెయిలింగ్‌ చేసే అవకాశం కలగనుంది.

మరిన్ని సందర్శనీయ స్థలాలు...
నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రధానమైన రామకృష్ణ బీచ్‌(ఆర్‌కే బీచ్‌)కు రోజూ సుమారు లక్ష మంది వస్తుంటారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటోంది. అదే విధంగా యారాడ, తొట్లకొండ, రుషికొండ బీచ్‌లలోనూ సందర్శకుల తాకిడి కొంత మేర ఉంటోంది. ఇలా.. కొన్ని ప్రాంతాలకే పర్యాటకం పరిమితం కాకుండా మరో 5 బీచ్‌లు అభివృద్ధి చెయ్యనుంది. భీమిలి బీచ్‌తో పాటు సాగర్‌నగర్, అప్పికొండ, పూడిమడక, తంతడి బీచ్‌లను తొలి దశలో గుర్తించింది. ఈ 5 బీచ్‌లు సందర్శకులకు అనుకూలమైన వాతావరణంతో ఉంటాయి.

ఏపీటీడీసీ ప్యాకేజీలు
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ పరుగులు పెడుతోంది. ఏపీటీడీసీ విశాఖ వ్యాప్తంగా పలు టూరిజం హోటల్స్‌తో పాటు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచి విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరిన్ని కొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తేవడం ద్వారా పర్యాటకానికి కొత్త హంగులు సంతరించుకున్నాయి.

కొత్త ప్యాకేజీలు...
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు పలు ప్యాకేజీలను అందిస్తోంది. ఈ గతంలో ఉన్న ఫ్యాకేజీలకు పదును పెట్టడంతో పాటు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కొత్త ఫ్యాకేజీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉండగా శుక్రవారం జరిగే పర్యాటక దినోత్సవం వేడుకల్లో ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖపట్నం– శ్రీకాకుళం కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నారు. 

విశాఖ– శ్రీకాకుళం
ప్రఖ్యాత అరసవల్లి దేవాలయం, శ్రీకూర్మం, శ్రీకూర్మలింగం, సీతంపేట అడ్వెంచర్‌ పార్కు సందర్శన కోసం ఏపీటీడీసీ ఈ ప్యాకేజీని అందిస్తోంది. పెద్దలకు రూ.670 , పిల్లలకు రూ.535గా ధర నిర్ణయించారు. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఉదయం 6.45 గంటలకు పర్యాటకులు విశాఖ ఆర్టీసీ కాంప్లక్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బస్సు 7 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 6 గంటలకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటుంది.

రైల్‌ కమ్‌ రోడ్డు ప్యాకేజీ
గతంలో పర్యాటకులకు మంచి మజిలిని అందించిన ఈ ప్యాకేజీనిని ఏపీటీడీసీ తిరిగి ఈ నెలలో(సెప్టెంబర్‌) పునఃప్రారంభించింది. రూ.1500తో పెద్దలకు, రూ.1200 పిల్లలకు ఈ టికెట్‌ ధర నిర్ణయించారు. రైల్వేశాఖతో ఉన్న టూరిజం ఒప్పందంలో భాగంగా ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది. పద్మాపురం బొటానికల్‌ గార్డెన్, ట్రైబల్‌ మ్యూజియం, ట్రైబల్‌ థింసా , అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, థైడా జంగిల్‌ బెల్‌కు తీసుకువెళతారు. ఉదయం 6.15కు రైల్వేస్టేషన్‌లోని ఏపీటీడీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటలకు తిరిగి విశాఖ చేరుకుంటారు. 

అరకు– లంబసింగి మధ్య..
అరకు – లంబసింగి– అరకు.. మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. చాపరాయి వాటర్‌ స్ట్రీమ్స్, మత్స్యగుండం, కొత్తపల్లి వాటర్‌ పాల్స్, లంబసింగి, గాలికొండ వ్యూపాయింట్, యాపిల్, ఫైనాపిల్, స్టాబెర్రీ పంటల సందర్శన ఉంటుంది. పెద్దలకు రూ. 999, చిన్న పిల్లలకు రూ.799గా టికెట్‌ ధర. ఉదయం 6.45 గంటలకు అరకులోని హరిత వ్యాలీ రిసార్ట్స్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 

విస్తృతమైన సేవలు
పర్యటకులకు విస్తృత సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీటీడీసీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాం. కార్పొరేట్‌ హోట ల్స్‌కు దీటుగా టూరిజం హోటల్స్‌లో సౌకర్యాలు, రూమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. విశాఖ– తిరుపతి, విశాఖ – అన్నవరం, అరకు –చిత్రకోట్‌ వాటర్‌ఫాల్స్, విశాఖ– భద్రాచలం ప్యాకేజీలను సైతం అందుబాటులో ఉంచాం. ఠీఠీఠీ.్చp్టఛీఛి.జీn వెబ్‌సైట్‌ నుంచి అన్ని రకాల సేవలను పొందవచ్చు.
– ప్రసాదరెడ్డి, డీవీఎం, ఏపీటీడీసీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement