మీస విలాసం | World's Largest Mustache: Ram Singh Chauhan | Sakshi
Sakshi News home page

మీస విలాసం

Published Sat, Nov 28 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

మీస విలాసం

మీస విలాసం

 ‘మీసము పస మగమూతికి’ అని సెలవిచ్చాడు కవి చౌడప్ప. అలాగని లోకంలోని మగమూతులన్నీ తప్పనిసరిగా మీసాలతోనే అలరారుతున్న దాఖలాలూ లేవు. అయిననూ... మీసమే మగసిరికి చిహ్నమనే నమ్మకం లోకంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు ఏవీ ఉండవు గానీ, వాటిని తీసిపారేయలేం. ఒకవేళ అలాంటి నమ్మకాలను తేలికగా తీసిపారేసే ప్రయత్నానికి ఒడిగట్టారో... ఇక అంతే సంగతులు! ఎవరివో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి. మరి మనోభావాలు దెబ్బతిన్నాక పరిస్థితి మామూలుగా ఉంటుందంటారా? అంతా రచ్చ రచ్చే కదా..! అయితే, మీసం ఒక్కటే మగసిరికి సంకేతంగా భావిస్తే అది పొరపాటే.
 
 ఒకవేళ అదే నిజమైతే, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అంత ఫాలోయింగ్ ఉండేదా? అష్టమహిషులే కాకుండా, పదహారువేల మంది గోపికలు ఆయన వెంటపడేవారా? కృష్ణుడొక్కడేనా..? అసలు, మన దేవుళ్లలో మీసాలు లేని వాళ్లదే మెజారిటీ. పురాణాలను పరికిస్తే, ఈ విషయం తేలికగానే అర్థమవుతుంది. పురాణాల్లో రాక్షసులు మాత్రమే శ్మశ్రు సంపదతో గంభీర భీకరాకారులై ఉండేవారు. దేవుళ్లు, రాక్షసుల సంగతి అలా వదిలేస్తే, అప్పట్లో మునుపుంగవులు, మహర్షులు మాత్రం మీసాలతో పాటు గడ్డాలను కూడా తెగ ఏపుగా పెంచుకొనేవాళ్లు.
 
  ఎందుకలాగ? అని ప్రశ్నిస్తే, కచ్చితమైన కారణాలను సాధికారికంగా చెప్పలేం గానీ, కొంతవరకు ఊహించుకోవచ్చు. పురాణకాలంలో మీసాలు గడ్డాలు లేని క్లీన్‌షేవ్డ్ ముఖాలను సాత్వికతకు చిహ్నంగా, మెలితిరిగిన బొద్దుమీసాలను తామస చిహ్నంగా భావించేవారని అనుకోవచ్చు. మీసాలు, గడ్డాలను ముఖం కనిపించనంత ఏపుగా పెంచేయడాన్ని మేధావి లక్షణంగా భావించేవారని కూడా అనుకోవచ్చు. పురాణ పురుషులను ఎవరూ చూడలేదు. పురాణ వర్ణనల ఆధారంగా చిత్రకారులు ఊహించి చిత్రించిన చిత్రాలు తప్ప వేరే ఆధారాలేవీ లేవు. ఇక చరిత్రలోకి వస్తే మీసాల గురించి చాలా ముచ్చట్లే కనిపిస్తాయి.
 
 చరిత్రలో మీసగాళ్లు
 గ్రీకువీరులు, రోమన్ యోధులలో మెజారిటీ జనాలు బోడి మూతులతోనే ఉండేవారు. వాళ్లలో కొద్దిమందికి మీసాలు, గడ్డాలు కూడా దట్టంగా ఉండేవనుకోండి. మన దేశంలో మాత్రం మీసాలు లేని రాజుల చిత్రపటాలు గానీ, శిల్పాలు గానీ బహు అరుదు. షేవింగ్ ప్రక్రియ పరిచయం లేని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పురుషులందరికీ మీసాలు, గడ్డాలు దట్టంగానే ఉండేవి. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో రాతితో తయారుచేసిన పదునైన పనిముట్లతో ముఖంపై అడ్డదిడ్డంగా పెరిగిపోయిన రోమాలను తొలగించుకునే పద్ధతి మొదలైంది. ఇప్పటి ఇరాన్ ప్రాంతంలో ఉండే అప్పటి సిథియన్లు ఈ ప్రక్రియకు ఆద్యులని చరిత్ర చెబుతోంది. దట్ వజ్ వెరీ ప్రిమిటివ్ షేవింగ్ మెథడ్ నోన్ టు ది మ్యాన్‌కైండ్. లోహాల ఆవిష్కరణ తర్వాత, ముఖ్యంగా ఇనుము విరివిగా అందుబాటులోకి వచ్చాక గడ్డాలు గీసుకునే ‘మగా’నుభావుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పారిశ్రామిక విప్లవం తర్వాత సేఫ్టీ రేజర్లు, సబ్బులు, షేవింగ్ క్రీములు వంటివి అందుబాటులోకి వచ్చాక ముఖ కేశాలంకరణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి.
 
 మీసవైవిధ్యం
 క్షౌర ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటి నుంచి మీసాలలో వైవిధ్యమూ పెరిగింది. ముఖాకృతులకు, అభిరుచులకు తగిన రీతిలో మీసాలను తీర్చిదిద్దుకోవడం, వాటి సొగసును చెక్కు చెదరకుండా కాపాడుకోవడం మొదలైంది. క్రమంగా మీసం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ స్థాయికి ఎదిగింది. బొద్దింకలను తలపించే బొద్దు మీసాలు, ఎగువకు మెలితిరిగిన మీసాలు, దిగువకు ఒంపుతిరిగి నేలచూపులు చూసే హ్యాండిల్‌బార్ మీసాలు, కనీ కనిపించని సరళరేఖ వంటి పెన్సిల్‌కట్ మీసాలు, పెపైదవికి ఇటూ అటూ ఉన్న రోమాలను శుభ్రంగా గొరిగేసి నడిమధ్యన గుబురుగా పెంచిన టూత్‌బ్రష్ మీసాలు... ఎగువకు మెలితిరిగిన గుబురు మీసాలను పెంచడంలో రాజస్థాన్‌కు చెందిన రాజపుత్రులది ప్రత్యేకశైలి. వీరి శైలి మీసాలను ‘రాజ్‌పుటానా’ మీసాలంటారు.
 
 రామ్‌సింగ్ చౌహాన్ అనే రాజస్థానీ ‘మగా’నుభావుడు ఏకంగా 14 అడుగుల మీసాన్ని పెంచి గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు. మీస వైవిధ్యాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించేంత ఉంటుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత హిట్లర్ టూత్‌బ్రష్ మీసంతోనే కనిపించేవాడు. హిట్లర్ జర్మనీవాడే అయినా, అతడి మీసకట్టు ఫ్రెంచ్‌కట్‌గానే ప్రసిద్ధి పొందింది. తొలితరం హాలీవుడ్ నటాగ్రేసరుడు చార్లీ చాప్లిన్‌ది కూడా ఇలాంటి మీసమే. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన హీరోల్లో చాలామంది పెన్సిల్‌కట్ మీసాన్ని మెయింటైన్ చేసేవాళ్లు. అప్పట్లో అదే ఫ్యాషన్. బాలీవుడ్ హీరోల్లో రాజ్ కపూర్ వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే, చాలామంది హీరోలు మీసాల్లేకుండానే కనిపించేవారు. ఇప్పటికీ బాలీవుడ్‌లో బోడిమూతుల హీరోలదే మెజారిటీ అనుకోండి. పంచరంగుల సినిమాల యుగం మొదలయ్యాక మన తెలుగు హీరోల మీసకట్టు కాస్త బొద్దుదేరింది. మీసాల్లేని కుర్రహీరోలు కొందరున్నా, టాలీవుడ్ స్టార్‌డమ్‌లో మీసగాళ్లదే అగ్రస్థానం.
 
 మీసాల మాసం
 ఇంతకీ మీసాల గొడవెందుకని మీమాంసలో పడుతున్నారా..? మరేం లేదు.. ఇది మీసాల మాసం. మగాళ్లకు మాత్రమే వచ్చే ప్రొస్టేట్ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్లపై ప్రపంచవ్యాప్తంగా ‘మగా’నుభావులకు అవగాహన కల్పించేందుకు ఏటా నవంబర్ నెలను మీసాల మాసంగా జరుపుకోవడం 2004 నుంచి మొదలైంది. ఈ నెలను ‘నో షేవ్ నవంబర్’గా... ‘మూవంబర్’గా పాటిస్తారు. నెల పొడవునా ముఖాన పెరిగే కేశసంపదను తొలగించే ప్రయత్నం చేయరు. ‘మూవంబర్’ను పాటించే వాళ్లలో మధ్యేమార్గాన్ని అవలంబించే వాళ్లు గడ్డాన్ని నున్నగా గీసేసినా, మీసాలను మాత్రం దట్టంగా పెంచుతారు. మీసం పౌరుష సంకేతం. ప్రొస్టేట్ గ్రంథిని తెలుగులో పౌరుష గ్రంథి అంటారు. అందుకే ఇదంతా...
 
 - పన్యాల జగన్నాథ దాసు

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement