Mustache
-
తగ్గేదేలే... ఈసారి గర్వంగా మెలేశాడు
భోపాల్: తగ్గేదేలే... సస్పెండ్ చేసినా సరే బారు మీసం తీయనంటే తీయనని భీష్మించిన మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా పంతమే నెగ్గింది. మీసం నా ఆత్మగౌరవానికి ప్రతీకన్న ఆయన సగర్వంగా మీసం తిప్పాడు. పోలీసు శాఖ రాణాపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మధ్యప్రదేశ్‌లో పోలీసు రవాణా విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేశ్ రాణాను మీసాలు, తలపై జుట్టును తగ్గించాలని.. అలా పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు హెచ్చరించినా.. అతను ఖాతరు చేయలేదు. దాంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వార్తకు బాగా ప్రాచుర్యం లభించడంతో పోలీసు శాఖ యూటర్న్ తీసుకుంది. రాణాను సస్పెండ్ చేసే అధికారం లేకున్నా ఏఐజీ ప్రశాంత్ శర్మ... ఆ మేరకు ఆదేశాలు ఇచ్చారని, అందువల్ల రాకేశ్ రాణాను తిరిగి విధుల్లో చేర్చుకుంటున్నట్లు పోలీసు హెడ్‌క్వార్టర్స్ డీఐజీ (పర్సనల్) ఉత్తర్వులు జారీచేశారు. -
మీసం మెలేసిన మహిళ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?
మానవ రూపురేఖలను పోల్చేటప్పుడు ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, స్వరంలో, రూపంలో ఇరువురి మధ్య వ్యత్యాసం ఉండి తీరాలి.. అనే కొన్ని బలమైన ఆలోచనలు, తీర్మానాలు.. అందుకు భిన్నమైన జీవితాలను బలిపెట్టేలానే ఉంటాయి. అలాంటి భిన్నమైన వ్యక్తే ‘హర్మాన్ కౌర్’. ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి, గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమె!! బ్రిటన్‌లో నివసించే హర్మాన్ కౌర్.. గడ్డం ఉన్న అమ్మాయి. ఆమెకు 11 ఏళ్ల వయసు వచ్చేసరికి.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్యతో మగవారిలా గడ్డాలు, మీసాలు రావడం మొదలయ్యాయి. దాంతో ఆ చిన్న వయసులోనే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంది. చదువుకునే చోట, చుట్టుపక్కలా ఎన్నో అవమానాలు భరించింది. వ్యాక్సింగ్ చేయించుకున్నప్పుడల్లా నరకమే. ప్రతి ఐదురోజులకి బలంగా, దృఢంగా వెంట్రుకలు పెరిగిపోయేవి. చర్మం కోసుకుపోయేది. ముట్టుకుంటే నొప్పిపుట్టేంత బిరుసుగా మారిపోయేది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకుంది. కానీ ఒక్క క్షణం ఆలోచించింది. లోపాన్ని అవమానంగా భావించి జీవితాన్ని అంతం చేసుకునేకంటే దాన్నే గుర్తింపుగా మలచుకొని ధైర్యంగా బతకడం కరెక్ట్ కదా అని! అంతే.. వాక్సింగ్ చేయించడం ఆపేసి, గడ్డం పెంచడం మొదలుపెట్టింది. మీసాలు షేప్ చేసుకుని, తలకు స్టయిల్‌గా క్లాత్ చుట్టి ప్రత్యేకమైన రూపాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే గడ్డం ఉన్న అతి పిన్న వయసు మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. తన గడ్డానికి సుందరి అని పేరు కూడా పెట్టుకుంది. తన రూపాన్ని తన ఎడమ కాలిపై టాటూగా వేయించుకుంది. 2014లో ఆమె లండన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి, గడ్డంతో ఉన్న మహిళా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు, ఆమె అనేక బ్రాండ్లకు మోడల్‌గా మారింది. నేటికీ తన జీవితాన్ని పలు మాధ్యమాల సాయంతో ప్రపంచానికి తెలియజేస్తూ.. ఎన్నో మోటివేషన్ క్లాసులు ఇస్తూంటుంది. పరిష్కారం లేని సమస్యకు.. సమస్యనే పరిష్కారంగా మార్చుకోగల గుండె ధైర్యం ఎంతమందికి ఉంటుంది! అందుకే ఆమె అంటుంది.. ‘నా గడ్డానికి ఒక ప్రత్యేకతుంది. ఇదొక మహిళ గడ్డం’ అని. చదవండి: చప్పుళ్లతో...ఒళ్లు మండిపోతోందా? అదీ ఓ జబ్బే!! -
మీసాలతో మినీ బస్సులాగాడు..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలకి చెందిన ఎర్రబోయిన కొమురెల్లి యాదవ్ సోమవారం తన మీసాలతో సుమారు 100 మీటర్ల దూరం వరకు మినీ బస్సును లాగాడు. తొర్రూరులో మెకానిక్. ఈయన గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో తన మీసాలను పెద్దవిగా పెం చుకోవడం ప్రారంభించాడు. ఈ మీసా లతో 2012లో గ్యాస్ సిలిండర్, 2013లో మారుతీకారు, 2014లో రెండు మారుతీ కార్లను లాగాడు. ఈసారి ఏకంగా మినీ బస్సును సుమారు 100 మీటర్ల వరకు లాగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. లారీ వంటి పెద్ద వాహనాన్ని లాగడమే తన లక్ష్యమని చెప్పాడు. -
చూపుకు మీసం వస్తే...
అచ్చోసిన ఆంబోతు అనేది ఒక చక్కటి తిట్టు. బహుశా ఆడవాళ్లే కనిపెట్టి ఉంటారు. ఎవరైనా కుర్రాళ్లు పనీ పాటా లేకుండా ఊళ్లో పడి తిరుగుతూ ఉంటే వారిని ఈ తిట్టుతో గౌరవిస్తూ ఉంటారు. మంచిదే. కాని- మగాడు తిరక్క చెడ్డాడు అనే జాతీయం ఎక్కడిది? దీనిని కూడా ఆడవాళ్లే సృష్టించి ఉంటారు. పనీ పాట లేకుండా ఇంట్లోనే గోళ్లు గిల్లుకుంటూ బుద్ధిగా ఏ కుర్రాడైనా కూచుంటే అతడిని ఈ తిట్టుతోనే సత్కరించి బజారున పడేస్తారు. తిరిగితే తప్పు. తిరక్కపోయినా తప్పు. హతవిథీ. మూతికి మీసం రాకపోతే గేలి చేస్తారు. అదే చూపుకు మీసం వస్తే ‘ఏయ్ మిస్టర్... నీకు అక్కచెల్లెళ్లు లేరా’ అంటారు. ఏ లా పుస్తకాల్లోని నీతి ఇది? నాకా ఉద్దేశం లేదంటే పెద్ద ప్రవరాఖ్యుడివిలే అని ఈసడిస్తారు. కాసింత చొరవచూపామో గ్రంథసాంగుడంటూ భ్రష్టుపట్టిస్తారు.మగవాడికి ఇదేం శాపం? అందం చూడవయా ఆనందించవయా అంటారు. అందమే ఆనందం అంటారు. కాని- మీరు చాలా అందంగా ఉన్నారండీ అనగానే ‘చెప్పు తెగుద్ది’ అని ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్తారు. ఆడవాళ్లూ... మీకు జోహార్లు. నరసింహను నీలాంబరి హింసిస్తే తప్పుకాదు. కాని- కి...కి... కి...కిరణ్ అంటూ వెంటపడినందుకు షారూక్‌ఖాన్ మాత్రం జీవితాంతం మచ్చ మోయాలి. ఇద్దరు కలిసే తప్పు చేశారు. కాని బిల్ క్లింటనే బద్నామ్ కావాల్సి వచ్చింది. ఎవరో సరిగ్గానే చెప్పారు- ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా మగవాడికే నష్టం. మగవారికి గత జన్మల పాపాల పర్యవసానంగా ఏదో మగ పుట్టుక పుట్టేస్తాం గానీ, ఓరి భగవంతుడా.. ఈ జన్మను గట్టెక్కడానికి ఎన్ని పాట్లు పడాలి..! ఎన్నెన్ని నింద నిష్టూరాలను భరించాలి..! బాల్యం కన్నుమూసి తెరిచినంత వేగంగా గడిచిపోతుంది. టీనేజీని, కాలేజీని ఎంజాయ్ చేద్దామనుకునేలోపు భవిష్యత్ చిత్రపటం బెంబేలెత్తిస్తుంది. ఉద్యోగం చేయాలి. లేదంటే సద్యోగం వెతుక్కోవాలి. కాదంటే నిర్బంధ నిరుద్యోగపర్వంలో నానా నరక యాతననూ అనుభవించాలి. నాయనా! ఇది మగపుట్టుక. అయ్యిందా... ఇది చాలక పెద్దలు కుదిర్చిన పిల్లను బుద్ధిగా పెళ్లాడి సంసార సాగరంలో పడాలి. తా దూర కంత ఉన్నా, లేకున్నా మెడకో డోలు. డోలు తగులుకున్నాక దరువులకు కరువా? డడ్డనక... డడ్డనక... బతుకు బస్టాండైపోతుంది. పవిత్ర కర్మభూమిలో సగటు మగ బతుకుల పద్నాలుగు రీళ్ల కథ ఇంతే. ఇంతటి దీనులూ అర్భకులూ అయినప్పటికీ మగవారి మీద ప్రభుత్వాలకు గానీ, చట్టాలకు గానీ ఏమాత్రం కనికరం ఉండదు. చెయ్యి కదిపితే తప్పు... నోరు మెదిపితే తప్పు... కన్ను తిప్పితే తప్పు... కాలు జారితే తప్పు... తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనంటుంది చట్టం. ‘ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజాట్’... అనగా చట్టము పట్ల అజ్ఞానమునకు క్షంతవ్యత లేదు. ఇంటా బయటా ఎక్కడికక్కడ అనుల్లంఘనీయమైన నిషేధాజ్ఞలు. అదృశ్య లక్ష్మణరేఖలు. స్లీప్‌వెల్ మెట్రెసెస్ అని మార్కెట్లో అమ్ముతుంటరు కాని ప్రతి మగవాడూ పడుకునేది అంపశయ్య మీదే కదా. ఇంట్లోని బాణాలు వీపున దిగే సమాజపు శరాలు... వీటితో నిద్రెక్కడిది? సుఖమైన కునుకెక్కడిది. నిషేధాలు, నిబంధనలు సరే! ప్రకృతి ఒకటి ఉంటుంది కదా! అది మగాళ్లను ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వదు. పరిసరాల్లో సూదంటురాళ్లు సంచరిస్తుంటే మగ కళ్లు అసంకల్పితంగా అటే మళ్లుతాయి. వాటిని వెనక్కు మళ్లించుకోవడం ఎంత కష్టం? కళ్ల ముందు హరివిల్లులు అరవిరుస్తుంటే నాట్యం చేయకుండా నిభాయించుకోవడం మరెంత కష్టం..? మండు వేసవి మధ్యాహ్నవేళ రోడ్లు కొలుస్తున్నప్పుడు ‘పిల్ల’గాలి తెమ్మెర చల్లగా సోకితే పట్టరాని ఉత్సాహంతో ఈల నోరు దాటనివ్వకుండా అరికట్టడం ఇంకెంత కష్టం..? ఇలాంటి కష్టాల కొలిమిలో కాలిపోవడం తప్ప మగబతుకులకు వేరే దిక్కేది..? చట్టమా..? ప్రకృతా..? ఎటువైపు మొగ్గాలనేది మగ బతుకుల్లో అతి పెద్ద డైలమా! బాడీ లాంగ్వేజ్‌లో తేడా ఉన్నట్లు తెగువ గల ఏ మగువ ఫిర్యాదు చేసినా ఊచలు లెక్కపెట్టక తప్పదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడింది. లౌకిక రాజ్యాంగం అమలవుతోంది. అయినా మగ బతుకుల్లో ఆశాజనకమైన మార్పులేవీ రాలేదు. శత వృద్ధ పార్టీ మొదలుకొని, బొడ్డూడని పార్టీల వరకు చాలా రాజకీయ పార్టీలు దేశసేవలో తెగ తరిస్తున్నాయి. అయితే, ఇవేవీ మగ బతుకులను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. రాజకీయ పార్టీల నాయకుల్లోనూ అత్యధికులు మగాళ్లే, కార్యకర్తల్లోనూ అత్యధికులు మగాళ్లే. కోర్టుల్లోనూ, జైళ్లలోనూ మెజార్టీ ‘మగా’నుభావులదే. అయినా, ఈ దేశంలో మగ బతుకులు తరతరాలుగా అన్యాయమైపోతున్నాయంటే... ఓ ‘మగ’ర్షీ..! ఓ ‘మగా’నుభావా..! గోడు ఎవరితో చెప్పుకోవాలి? ఆడదానికి ఆడదే శత్రువని ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ దేశంలో మగ బతుకులను గమనిస్తుంటే.. మగాడికి మగాడే శత్రువనే అనుమానం పెనుభూతమవుతోంది. లేకపోతే... ప్రజాస్వామ్య మూలస్తంభాలలో మెజారిటీ మగాళ్లదే అయినా... మగాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎవరూ అరికట్టే ప్రయత్నమే చేయరేం..? మహిళా పక్షపాత చట్టాలకు చెల్లుచీటీ రాసే చర్యలు చేపట్టరేం..? - పన్యాల జగన్నాథ దాసు -
మీస విలాసం
‘మీసము పస మగమూతికి’ అని సెలవిచ్చాడు కవి చౌడప్ప. అలాగని లోకంలోని మగమూతులన్నీ తప్పనిసరిగా మీసాలతోనే అలరారుతున్న దాఖలాలూ లేవు. అయిననూ... మీసమే మగసిరికి చిహ్నమనే నమ్మకం లోకంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలు ఏవీ ఉండవు గానీ, వాటిని తీసిపారేయలేం. ఒకవేళ అలాంటి నమ్మకాలను తేలికగా తీసిపారేసే ప్రయత్నానికి ఒడిగట్టారో... ఇక అంతే సంగతులు! ఎవరివో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి. మరి మనోభావాలు దెబ్బతిన్నాక పరిస్థితి మామూలుగా ఉంటుందంటారా? అంతా రచ్చ రచ్చే కదా..! అయితే, మీసం ఒక్కటే మగసిరికి సంకేతంగా భావిస్తే అది పొరపాటే. ఒకవేళ అదే నిజమైతే, శ్రీకృష్ణ పరమాత్ముల వారికి అంత ఫాలోయింగ్ ఉండేదా? అష్టమహిషులే కాకుండా, పదహారువేల మంది గోపికలు ఆయన వెంటపడేవారా? కృష్ణుడొక్కడేనా..? అసలు, మన దేవుళ్లలో మీసాలు లేని వాళ్లదే మెజారిటీ. పురాణాలను పరికిస్తే, ఈ విషయం తేలికగానే అర్థమవుతుంది. పురాణాల్లో రాక్షసులు మాత్రమే శ్మశ్రు సంపదతో గంభీర భీకరాకారులై ఉండేవారు. దేవుళ్లు, రాక్షసుల సంగతి అలా వదిలేస్తే, అప్పట్లో మునుపుంగవులు, మహర్షులు మాత్రం మీసాలతో పాటు గడ్డాలను కూడా తెగ ఏపుగా పెంచుకొనేవాళ్లు. ఎందుకలాగ? అని ప్రశ్నిస్తే, కచ్చితమైన కారణాలను సాధికారికంగా చెప్పలేం గానీ, కొంతవరకు ఊహించుకోవచ్చు. పురాణకాలంలో మీసాలు గడ్డాలు లేని క్లీన్షేవ్డ్ ముఖాలను సాత్వికతకు చిహ్నంగా, మెలితిరిగిన బొద్దుమీసాలను తామస చిహ్నంగా భావించేవారని అనుకోవచ్చు. మీసాలు, గడ్డాలను ముఖం కనిపించనంత ఏపుగా పెంచేయడాన్ని మేధావి లక్షణంగా భావించేవారని కూడా అనుకోవచ్చు. పురాణ పురుషులను ఎవరూ చూడలేదు. పురాణ వర్ణనల ఆధారంగా చిత్రకారులు ఊహించి చిత్రించిన చిత్రాలు తప్ప వేరే ఆధారాలేవీ లేవు. ఇక చరిత్రలోకి వస్తే మీసాల గురించి చాలా ముచ్చట్లే కనిపిస్తాయి. చరిత్రలో మీసగాళ్లు గ్రీకువీరులు, రోమన్ యోధులలో మెజారిటీ జనాలు బోడి మూతులతోనే ఉండేవారు. వాళ్లలో కొద్దిమందికి మీసాలు, గడ్డాలు కూడా దట్టంగా ఉండేవనుకోండి. మన దేశంలో మాత్రం మీసాలు లేని రాజుల చిత్రపటాలు గానీ, శిల్పాలు గానీ బహు అరుదు. షేవింగ్ ప్రక్రియ పరిచయం లేని రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పురుషులందరికీ మీసాలు, గడ్డాలు దట్టంగానే ఉండేవి. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో రాతితో తయారుచేసిన పదునైన పనిముట్లతో ముఖంపై అడ్డదిడ్డంగా పెరిగిపోయిన రోమాలను తొలగించుకునే పద్ధతి మొదలైంది. ఇప్పటి ఇరాన్ ప్రాంతంలో ఉండే అప్పటి సిథియన్లు ఈ ప్రక్రియకు ఆద్యులని చరిత్ర చెబుతోంది. దట్ వజ్ వెరీ ప్రిమిటివ్ షేవింగ్ మెథడ్ నోన్ టు ది మ్యాన్‌కైండ్. లోహాల ఆవిష్కరణ తర్వాత, ముఖ్యంగా ఇనుము విరివిగా అందుబాటులోకి వచ్చాక గడ్డాలు గీసుకునే ‘మగా’నుభావుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పారిశ్రామిక విప్లవం తర్వాత సేఫ్టీ రేజర్లు, సబ్బులు, షేవింగ్ క్రీములు వంటివి అందుబాటులోకి వచ్చాక ముఖ కేశాలంకరణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. మీసవైవిధ్యం క్షౌర ప్రక్రియ వేగం పుంజుకున్నప్పటి నుంచి మీసాలలో వైవిధ్యమూ పెరిగింది. ముఖాకృతులకు, అభిరుచులకు తగిన రీతిలో మీసాలను తీర్చిదిద్దుకోవడం, వాటి సొగసును చెక్కు చెదరకుండా కాపాడుకోవడం మొదలైంది. క్రమంగా మీసం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ స్థాయికి ఎదిగింది. బొద్దింకలను తలపించే బొద్దు మీసాలు, ఎగువకు మెలితిరిగిన మీసాలు, దిగువకు ఒంపుతిరిగి నేలచూపులు చూసే హ్యాండిల్‌బార్ మీసాలు, కనీ కనిపించని సరళరేఖ వంటి పెన్సిల్‌కట్ మీసాలు, పెపైదవికి ఇటూ అటూ ఉన్న రోమాలను శుభ్రంగా గొరిగేసి నడిమధ్యన గుబురుగా పెంచిన టూత్‌బ్రష్ మీసాలు... ఎగువకు మెలితిరిగిన గుబురు మీసాలను పెంచడంలో రాజస్థాన్‌కు చెందిన రాజపుత్రులది ప్రత్యేకశైలి. వీరి శైలి మీసాలను ‘రాజ్‌పుటానా’ మీసాలంటారు. రామ్‌సింగ్ చౌహాన్ అనే రాజస్థానీ ‘మగా’నుభావుడు ఏకంగా 14 అడుగుల మీసాన్ని పెంచి గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు. మీస వైవిధ్యాన్ని గురించి చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించేంత ఉంటుంది. ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నియంత హిట్లర్ టూత్‌బ్రష్ మీసంతోనే కనిపించేవాడు. హిట్లర్ జర్మనీవాడే అయినా, అతడి మీసకట్టు ఫ్రెంచ్కట్గానే ప్రసిద్ధి పొందింది. తొలితరం హాలీవుడ్ నటాగ్రేసరుడు చార్లీ చాప్లిన్ది కూడా ఇలాంటి మీసమే. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన హీరోల్లో చాలామంది పెన్సిల్‌కట్ మీసాన్ని మెయింటైన్ చేసేవాళ్లు. అప్పట్లో అదే ఫ్యాషన్. బాలీవుడ్ హీరోల్లో రాజ్ కపూర్ వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే, చాలామంది హీరోలు మీసాల్లేకుండానే కనిపించేవారు. ఇప్పటికీ బాలీవుడ్లో బోడిమూతుల హీరోలదే మెజారిటీ అనుకోండి. పంచరంగుల సినిమాల యుగం మొదలయ్యాక మన తెలుగు హీరోల మీసకట్టు కాస్త బొద్దుదేరింది. మీసాల్లేని కుర్రహీరోలు కొందరున్నా, టాలీవుడ్ స్టార్డమ్లో మీసగాళ్లదే అగ్రస్థానం. మీసాల మాసం ఇంతకీ మీసాల గొడవెందుకని మీమాంసలో పడుతున్నారా..? మరేం లేదు.. ఇది మీసాల మాసం. మగాళ్లకు మాత్రమే వచ్చే ప్రొస్టేట్ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్లపై ప్రపంచవ్యాప్తంగా ‘మగా’నుభావులకు అవగాహన కల్పించేందుకు ఏటా నవంబర్ నెలను మీసాల మాసంగా జరుపుకోవడం 2004 నుంచి మొదలైంది. ఈ నెలను ‘నో షేవ్ నవంబర్’గా... ‘మూవంబర్’గా పాటిస్తారు. నెల పొడవునా ముఖాన పెరిగే కేశసంపదను తొలగించే ప్రయత్నం చేయరు. ‘మూవంబర్’ను పాటించే వాళ్లలో మధ్యేమార్గాన్ని అవలంబించే వాళ్లు గడ్డాన్ని నున్నగా గీసేసినా, మీసాలను మాత్రం దట్టంగా పెంచుతారు. మీసం పౌరుష సంకేతం. ప్రొస్టేట్ గ్రంథిని తెలుగులో పౌరుష గ్రంథి అంటారు. అందుకే ఇదంతా... - పన్యాల జగన్నాథ దాసు -
హిట్లర్ మీసం వెనుక...
అదన్న మాట! ముక్కుకు దిగువ గుబురుగా టూత్‌బ్రష్‌ను తలపించే మీసం కనిపిస్తే ఠక్కున గుర్తుకొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు అడాల్ఫ్ హిట్లర్, మరొకరు చార్లీ చాప్లిన్. ఒకరు కరడు కట్టిన నియంతృత్వానికి, మరొకరు కడుపుబ్బ నవ్వించే హాస్యానికీ ప్రతీక. ఇంతకీ ఈ మీసం కథేమిటిటంటే... చార్లీ చాప్లిన్ అయితే జగమెరిగిన హాస్యనటచక్రవర్తి, అందువల్ల జనాలకు నవ్వు తెప్పించే ఉద్దేశంతో అలాంటి మీసం పెంచుకున్నాడనుకోవచ్చు. మరి ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత హిట్లర్ కూడా అలాంటి కామెడీ మీసాన్ని ఎందుకు పెంచుకున్నాడు? నియంతగా ముదరక ముందు సైన్యంలో పనిచేసే కాలంలో హిట్లర్‌కు తెగబారెడు మెలితిరిగిన మీసాలుండేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం శత్రుసేనలపై మస్టర్డ్ గ్యాస్‌తో దాడులు ప్రారంభించింది. మస్టర్డ్ గ్యాస్ దాడి నుంచి రక్షణ పొందేందుకు బ్రిటన్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులు గ్యాస్ మాస్క్‌లను తయారు చేసుకున్నారు. ఆ మాస్క్‌లు తొడుక్కోవడానికి అనుగుణంగా మీసాల పొడవును కుదించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా హిట్లర్ మీసాలు ఇలా మారాయి. -
మీసాల మాసం
మీసము పస మగమూతికి అని ఓ శతకకారుడు శతాబ్దాల కిందటే సెలవిచ్చాడు. మీసాల ముచ్చట్లు చాలానే ఉన్నాయి. మీసాలపై నిమ్మకాయలను నిలబెట్టే పురుష పుంగవుల గురించి జనాలు అబ్బురంగా కథలు చెప్పుకోవడం కద్దు. అప్పటికీ ఇప్పటికీ మీసమే మగటిమికి గుర్తింపు చిహ్నం. బాలీవుడ్ నటుల్లో మీసాలతో కనిపించే నటులు బహు కొద్దిమంది మాత్రమే. అలాంటి నటులు కూడా పాత్రౌచిత్యాన్ని కాపాడటానికి మీసాలతో మెరిసిన సందర్భాలూ లేకపోలేదు. మన తెలుగు నటుల్లో మీసాలు లేని నటులు దాదాపు లేరనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన తెలుగు హీరోలు ఒద్దికగా పెన్సిల్‌కట్ మీసాలతో కనిపించేవారు. వెండితెరపై రంగుల ప్రపంచం వచ్చే సరికి జమానా బదల్ గయా! మీసాలు కాస్త బొద్దుదేరాయి. ఇంతకీ ఈ మీసాల సంగతెందుకంటారా..? నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతేకాదు, ఇది మీసాల మాసం. ఇదీ నేపథ్యం.. ఆవు పాలలో ఉండే ప్రొటీన్ కొందరికి అలర్జీ కలిగిస్తుంది. కొందరిలో ఇది తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. పురుషులలో వచ్చే ప్రొస్టేట్ కేన్సర్‌తో పాటు పలు రకాల కేన్సర్‌కు కూడా ఆవు పాలలో ఉండే ప్రొటీనే కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. దీనిపై అవగాహ పెంపొందించేందుకు నవంబర్ నెలను ‘మూవంబర్’గా పాటించడం మొదలైంది. ‘కౌస్ మిల్క్ ప్రొటీన్ అలెర్జీ’పై (సీఎంపీఏ) అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నెలంతా పురుష పుంగవులు మీసాలు పెంచుతారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆడిలాయిడ్లో 1999 నుంచి ‘మూవంబర్’ పాటించే ఆచారం మొదలైంది. మీసాలకూ ఓ ఇన్స్టిట్యూట్.. మీసం ఉన్నవాళ్లను కొన్ని ప్రాంతాల్లో పెద్దమనుషులుగా పరిగణించరు. ఇలాంటి వివక్షను పోగొట్టేందుకు, మీసాలపై సానుకూలత పెంచేందుకు అమెరికాలో ఏకంగా ఒక ఇన్స్టిట్యూటే ప్రారంభమైంది. పిట్స్‌బర్గ్‌లో 1965లోనే ప్రారంభమైన అమెరికన్ మౌస్టేక్ ఇన్స్టిట్యూట్ మీసాల కోసం గణనీయమైన కృషి కొనసాగిస్తోంది. రికార్డు మీసం.. మీసాల్లో తిరుగులేని ఘనత మన భారతీయులదే. అందుకు రాజస్థానీ మీసాలరాయుడు రామ్‌సింగ్ చౌహాన్ ప్రత్యక్ష నిదర్శనం. ఆయన మీసాల పొడవు ఏకంగా 4.29 మీటర్లు (14 అడుగులు). ఈ మీసాలతో ఆయన ఏకంగా గిన్నిస్ రికార్డునే సాధించాడు.