చూపుకు మీసం వస్తే... | When mustache to show ... | Sakshi
Sakshi News home page

చూపుకు మీసం వస్తే...

Published Mon, Feb 1 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

చూపుకు మీసం వస్తే...

చూపుకు మీసం వస్తే...

అచ్చోసిన ఆంబోతు అనేది ఒక చక్కటి తిట్టు. బహుశా ఆడవాళ్లే కనిపెట్టి ఉంటారు. ఎవరైనా కుర్రాళ్లు పనీ పాటా లేకుండా ఊళ్లో పడి తిరుగుతూ ఉంటే వారిని ఈ తిట్టుతో గౌరవిస్తూ ఉంటారు. మంచిదే. కాని- మగాడు తిరక్క చెడ్డాడు అనే జాతీయం ఎక్కడిది? దీనిని కూడా ఆడవాళ్లే సృష్టించి ఉంటారు. పనీ పాట లేకుండా ఇంట్లోనే గోళ్లు గిల్లుకుంటూ బుద్ధిగా ఏ కుర్రాడైనా కూచుంటే అతడిని ఈ తిట్టుతోనే సత్కరించి బజారున పడేస్తారు. తిరిగితే తప్పు. తిరక్కపోయినా తప్పు. హతవిథీ.
 
మూతికి మీసం రాకపోతే గేలి చేస్తారు. అదే చూపుకు మీసం వస్తే ‘ఏయ్ మిస్టర్... నీకు అక్కచెల్లెళ్లు లేరా’ అంటారు. ఏ లా పుస్తకాల్లోని నీతి ఇది?
 
నాకా ఉద్దేశం లేదంటే పెద్ద ప్రవరాఖ్యుడివిలే అని ఈసడిస్తారు. కాసింత చొరవచూపామో గ్రంథసాంగుడంటూ భ్రష్టుపట్టిస్తారు.మగవాడికి ఇదేం శాపం?
 

అందం చూడవయా ఆనందించవయా అంటారు. అందమే ఆనందం అంటారు. కాని- మీరు చాలా అందంగా ఉన్నారండీ అనగానే ‘చెప్పు తెగుద్ది’ అని ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్తారు. ఆడవాళ్లూ... మీకు జోహార్లు.
 
నరసింహను నీలాంబరి హింసిస్తే తప్పుకాదు. కాని- కి...కి... కి...కిరణ్ అంటూ వెంటపడినందుకు షారూక్‌ఖాన్ మాత్రం జీవితాంతం మచ్చ మోయాలి. ఇద్దరు కలిసే తప్పు చేశారు. కాని బిల్ క్లింటనే బద్‌నామ్ కావాల్సి వచ్చింది. ఎవరో సరిగ్గానే చెప్పారు- ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా అరిటాకు వెళ్లి ముల్లు మీద పడ్డా మగవాడికే నష్టం.
 

మగవారికి గత జన్మల పాపాల పర్యవసానంగా ఏదో మగ పుట్టుక పుట్టేస్తాం గానీ, ఓరి భగవంతుడా.. ఈ జన్మను గట్టెక్కడానికి ఎన్ని పాట్లు పడాలి..! ఎన్నెన్ని నింద నిష్టూరాలను భరించాలి..! బాల్యం కన్నుమూసి తెరిచినంత వేగంగా గడిచిపోతుంది. టీనేజీని, కాలేజీని ఎంజాయ్ చేద్దామనుకునేలోపు భవిష్యత్ చిత్రపటం బెంబేలెత్తిస్తుంది. ఉద్యోగం చేయాలి. లేదంటే సద్యోగం వెతుక్కోవాలి. కాదంటే నిర్బంధ నిరుద్యోగపర్వంలో నానా నరక యాతననూ అనుభవించాలి. నాయనా! ఇది మగపుట్టుక. అయ్యిందా... ఇది చాలక పెద్దలు కుదిర్చిన పిల్లను బుద్ధిగా పెళ్లాడి సంసార సాగరంలో పడాలి. తా దూర కంత ఉన్నా, లేకున్నా మెడకో డోలు. డోలు తగులుకున్నాక దరువులకు కరువా? డడ్డనక... డడ్డనక... బతుకు బస్టాండైపోతుంది. పవిత్ర కర్మభూమిలో సగటు మగ బతుకుల పద్నాలుగు రీళ్ల కథ ఇంతే.
 
ఇంతటి దీనులూ అర్భకులూ అయినప్పటికీ మగవారి మీద ప్రభుత్వాలకు గానీ, చట్టాలకు గానీ ఏమాత్రం కనికరం ఉండదు. చెయ్యి కదిపితే తప్పు... నోరు మెదిపితే తప్పు... కన్ను తిప్పితే తప్పు... కాలు జారితే తప్పు... తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనంటుంది చట్టం. ‘ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్‌క్యూజాట్’... అనగా చట్టము పట్ల అజ్ఞానమునకు క్షంతవ్యత లేదు. ఇంటా బయటా ఎక్కడికక్కడ అనుల్లంఘనీయమైన నిషేధాజ్ఞలు. అదృశ్య లక్ష్మణరేఖలు. స్లీప్‌వెల్ మెట్రెసెస్ అని మార్కెట్‌లో అమ్ముతుంటరు కాని ప్రతి మగవాడూ పడుకునేది అంపశయ్య మీదే కదా. ఇంట్లోని బాణాలు వీపున దిగే సమాజపు శరాలు... వీటితో నిద్రెక్కడిది? సుఖమైన కునుకెక్కడిది.
 
నిషేధాలు, నిబంధనలు సరే! ప్రకృతి ఒకటి ఉంటుంది కదా! అది మగాళ్లను ఒక పట్టాన కుదురుగా ఉండనివ్వదు. పరిసరాల్లో సూదంటురాళ్లు సంచరిస్తుంటే మగ కళ్లు అసంకల్పితంగా అటే మళ్లుతాయి. వాటిని వెనక్కు మళ్లించుకోవడం ఎంత కష్టం? కళ్ల ముందు హరివిల్లులు అరవిరుస్తుంటే నాట్యం చేయకుండా నిభాయించుకోవడం మరెంత కష్టం..? మండు వేసవి మధ్యాహ్నవేళ రోడ్లు కొలుస్తున్నప్పుడు ‘పిల్ల’గాలి తెమ్మెర చల్లగా సోకితే పట్టరాని ఉత్సాహంతో ఈల నోరు దాటనివ్వకుండా అరికట్టడం ఇంకెంత కష్టం..? ఇలాంటి కష్టాల కొలిమిలో కాలిపోవడం తప్ప మగబతుకులకు వేరే దిక్కేది..? చట్టమా..? ప్రకృతా..? ఎటువైపు మొగ్గాలనేది మగ బతుకుల్లో అతి పెద్ద డైలమా! బాడీ లాంగ్వేజ్‌లో తేడా ఉన్నట్లు తెగువ గల ఏ మగువ ఫిర్యాదు చేసినా ఊచలు లెక్కపెట్టక తప్పదు.
 
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడింది. లౌకిక రాజ్యాంగం అమలవుతోంది. అయినా మగ బతుకుల్లో ఆశాజనకమైన మార్పులేవీ రాలేదు. శత వృద్ధ పార్టీ మొదలుకొని, బొడ్డూడని పార్టీల వరకు చాలా రాజకీయ పార్టీలు దేశసేవలో తెగ తరిస్తున్నాయి. అయితే, ఇవేవీ మగ బతుకులను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. రాజకీయ పార్టీల నాయకుల్లోనూ అత్యధికులు మగాళ్లే, కార్యకర్తల్లోనూ అత్యధికులు మగాళ్లే. కోర్టుల్లోనూ, జైళ్లలోనూ మెజార్టీ ‘మగా’నుభావులదే. అయినా, ఈ దేశంలో మగ బతుకులు తరతరాలుగా అన్యాయమైపోతున్నాయంటే... ఓ ‘మగ’ర్షీ..! ఓ ‘మగా’నుభావా..! గోడు ఎవరితో చెప్పుకోవాలి? ఆడదానికి ఆడదే శత్రువని ఆడిపోసుకుంటారు గానీ, నిజానికి ఈ దేశంలో మగ బతుకులను గమనిస్తుంటే.. మగాడికి మగాడే శత్రువనే అనుమానం పెనుభూతమవుతోంది. లేకపోతే... ప్రజాస్వామ్య మూలస్తంభాలలో మెజారిటీ మగాళ్లదే అయినా... మగాళ్ల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎవరూ అరికట్టే ప్రయత్నమే చేయరేం..? మహిళా పక్షపాత చట్టాలకు చెల్లుచీటీ రాసే చర్యలు చేపట్టరేం..?
 - పన్యాల జగన్నాథ దాసు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement