మీసాల మాసం
మీసము పస మగమూతికి అని ఓ శతకకారుడు శతాబ్దాల కిందటే సెలవిచ్చాడు. మీసాల ముచ్చట్లు చాలానే ఉన్నాయి. మీసాలపై నిమ్మకాయలను నిలబెట్టే పురుష పుంగవుల గురించి జనాలు అబ్బురంగా కథలు చెప్పుకోవడం కద్దు. అప్పటికీ ఇప్పటికీ మీసమే మగటిమికి గుర్తింపు చిహ్నం. బాలీవుడ్ నటుల్లో మీసాలతో కనిపించే నటులు బహు కొద్దిమంది మాత్రమే. అలాంటి నటులు కూడా పాత్రౌచిత్యాన్ని కాపాడటానికి మీసాలతో మెరిసిన సందర్భాలూ లేకపోలేదు.
మన తెలుగు నటుల్లో మీసాలు లేని నటులు దాదాపు లేరనే చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ జమానాలో మన తెలుగు హీరోలు ఒద్దికగా పెన్సిల్‌కట్ మీసాలతో కనిపించేవారు. వెండితెరపై రంగుల ప్రపంచం వచ్చే సరికి జమానా బదల్ గయా! మీసాలు కాస్త బొద్దుదేరాయి. ఇంతకీ ఈ మీసాల సంగతెందుకంటారా..? నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతేకాదు, ఇది మీసాల మాసం.
ఇదీ నేపథ్యం..
ఆవు పాలలో ఉండే ప్రొటీన్ కొందరికి అలర్జీ కలిగిస్తుంది. కొందరిలో ఇది తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. పురుషులలో వచ్చే ప్రొస్టేట్ కేన్సర్‌తో పాటు పలు రకాల కేన్సర్‌కు కూడా ఆవు పాలలో ఉండే ప్రొటీనే కారణమని వైద్య పరిశోధనల్లో తేలింది. దీనిపై అవగాహ పెంపొందించేందుకు నవంబర్ నెలను ‘మూవంబర్’గా పాటించడం మొదలైంది. ‘కౌస్ మిల్క్ ప్రొటీన్ అలెర్జీ’పై (సీఎంపీఏ) అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నెలంతా పురుష పుంగవులు మీసాలు పెంచుతారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆడిలాయిడ్‌లో 1999 నుంచి ‘మూవంబర్’ పాటించే ఆచారం మొదలైంది.
మీసాలకూ ఓ ఇన్‌స్టిట్యూట్..
మీసం ఉన్నవాళ్లను కొన్ని ప్రాంతాల్లో పెద్దమనుషులుగా పరిగణించరు. ఇలాంటి వివక్షను పోగొట్టేందుకు, మీసాలపై సానుకూలత పెంచేందుకు అమెరికాలో ఏకంగా ఒక ఇన్‌స్టిట్యూటే ప్రారంభమైంది. పిట్స్‌బర్గ్‌లో 1965లోనే ప్రారంభమైన అమెరికన్ మౌస్టేక్ ఇన్‌స్టిట్యూట్ మీసాల కోసం గణనీయమైన కృషి కొనసాగిస్తోంది.
రికార్డు మీసం..
మీసాల్లో తిరుగులేని ఘనత మన భారతీయులదే. అందుకు రాజస్థానీ మీసాలరాయుడు రామ్‌సింగ్ చౌహాన్ ప్రత్యక్ష నిదర్శనం. ఆయన మీసాల పొడవు ఏకంగా 4.29 మీటర్లు (14 అడుగులు). ఈ మీసాలతో ఆయన ఏకంగా గిన్నిస్ రికార్డునే సాధించాడు.