ఫోటోషాప్ ప్రేమ!
సాంకేతిక ప్రేమ
ప్రేమికుడు అంటే పదహారేళ్ల తర్వాత పరిచయం అయ్యేవాడా! ప్రాయంలోకి వచ్చాక ప్రియమైన అనుభూతులను అందించే వాడా! దాదాపుగా ప్రపంచంలోని ప్రతి ప్రేమికుడూ ఇలాగే ఉంటాడేమో! అయితే తాను దానికి భిన్నంగా ఉండాలని అనుకొన్నాడు వాన్. చైనాకు చెందిన ఈ ప్రేమికుడు తన ప్రియురాలికి ఒక అరుదైన బహుమతిని ఇచ్చాడు.
యాన్ ఫొటోషాప్ నిపుణుడు. అందులోని తన నైపుణ్యాన్ని ఉపయోగించుకొని తన ప్రియురాలికి సర్‌ప్రైజ్‌ను ఇచ్చాడు అతడు. యాన్ తన ప్రియురాలి చిన్నప్పటి ఫొటోలను అడిగి తీసుకొన్నాడు. వాటిని స్కాన్ చేసి తన కంప్యూటర్‌లో ఫొటోషాప్ టెక్నిక్స్ ద్వారా చిన్న మాయ చేశాడు. ప్రియురాలు చిన్నప్పటి ఫొటోల్లో తను కూడా ఉన్నట్టుగా భ్రమింపజేశాడు. ఇతడి ఫొటోషాప్‌లో ఎంత సహజత్వం ఉందంటే... అవి ఫోటోషాప్ ట్రిక్స్ అంటే ఎవ్వరూ నమ్మలేరు. దాదాపు 15 యేళ్ల కిందట తీసిన ఫోటోల్లో తన లేటెస్ట్‌స్టిల్స్‌ను ఒదిగిపోయేలా చేశాడు యాన్.
తన ప్రియురాలు చిన్నారిగా ఉన్నప్పుడు తను ఆమె పక్కనే ఉన్నట్టుగా, ఫొటోల్లోని సహజత్వం దెబ్బతినకుండా అతడు ఫొటోషాప్ ద్వారా మాయ చేయడం చాలామందిని అబ్బురపరుస్తోంది. ఈ విధంగా ఆమె బాల్యంలోకి చొరబడి ఒక అరుదైన గిఫ్ట్‌ను అందించాడు యాన్. ఈ ఫోటోలను చూసి అతడి ప్రియురాలు తెగమురిసిపోతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.