
ఎస్. ఐ యామ్ గే
థర్డ్ వండర్
ఎస్. ఐ యామ్ గే. సిగ్గెందుకు.. చెప్పుకోడానికి?! నేను అబ్బాయిని. కానీ అమ్మాయిలకు ఎట్రాక్ట్ కాను. ఇందులో తప్పేముంది? / నేను అమ్మాయిని. కానీ అబ్బాయిలు నన్ను ఎట్రాక్ట్ చెయ్యలేరు. ఇందులో ఒప్పుకానిది ఏముంది? ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా అంటుంది లోకం. ప్రకృతి ఒక్కటేనా ధర్మం? ప్రకృతి విరుద్ధ ధర్మాలు ఉండవా?!
అబ్బాయిల దగ్గర మాత్రమే కంఫర్ట్ ఫీలయ్యే అబ్బాయిలు, అమ్మాయిల ఆలింగనాలలో మాత్రమే ఆలంబన పొందే అమ్మాయిలు అడుగుతున్న ఈ ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? లేదు. సానుభూతి ఉందా? లేదు. సహానుభూతి ఉందా? అదెలాగూ ఉండదు. సాఫ్ట్ కార్నర్ ఉందా? ఎప్పటికైనా ఏర్పడుతుందేమో తెలీదు. మరేముంది? అభ్యంతరం ఉంది. అసహనం ఉంది. అవహేళన ఉంది. ‘ఎట్లానో చావండి. మీ ఒంట్లో ఏం జరుగుతోందో మా కంట్లో పడనివ్వకండి’ అని దూరంగా జరిగిపోయేంత ఈసడింపు ఉంది.
‘గే’ స్ హర్ట్ అవుతున్నారు. నేచురల్. బాధ అనేది సాధారణ జెండర్‌లకు ఉండి, ట్రాన్స్‌జెండర్‌లకు లేకుండా పోతుందా?! ఎవరైనా మనుషులే కదా. బాధ పడతారు. అయితే వారి బాధ.. వాళ్లని మనం గుర్తించడం లేదని కాదు. వాళ్లని మనం గౌరవించడం లేదని కాదు. మరి? వాళ్లేమిటో వాళ్లని చెప్పుకోనివ్వడం లేదని! మగధీరుడిగా నిన్ను నువ్వు ఎగ్జిబిట్ చేసుకుంటావు. కోమలాంగిగా నిన్ను నువ్వు రిప్రెజెంట్ చేసుకుంటావు. మరి గే గా నన్నెందుకు బయట పడనివ్వవు అని ఎల్.జి.బి.టి. (లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ అడుగుతోంది! ‘అవును. నేను ఇదీ’ అని ప్రైడ్ వాక్ కూడా చేస్తోంది.
యూఎస్ ఆర్మీలో ‘డోంట్ ఆస్క్, డోంట్ టెల్’ అనే పాలసీ ఉండేది. మిలటరీలో ఎవరైనా గే స్ ఉన్నారని అనుమానం వస్తే ఆ విషయం గురించి ఎవరూ అడక్కూడదు, ఎవరూ చెప్పకూడదు. ఆర్మీలోని గే స్ కూడా తమని తాము బయట పెట్టుకోకూడదు. అదీ పాలసీ. చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేసేవారు. సైన్యంలో ఒక్క ‘గే’ ఉన్నా సైన్యం గౌరవం, గాంభీర్యం తగ్గుతాయన్న భయంతో 1994లో క్లింటన్ ఈ పాలసీ తెచ్చారు. 2011లో ఒబామా దీనిని రద్దు చేశారు. ఆ పదిహేడేళ్ల కాలంలో గే స్ కొందరు పాలసీకి విరుద్ధంగా ‘అడిగి’, ‘చెప్పి’ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకున్న వాళ్లలో మన ఇండియన్ సంతతి అమ్మాయి కూడా ఉంది. పేరు రాబిన్ చౌరాసియా. యు.ఎస్. ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తుండేది. ‘డోంట్ ఆస్క్, డోంట్ టెల్’ పాలసీని బ్రేక్ చేసి మరీ 2009లో బయటికి వచ్చేసింది. గే పాలసీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపి ఒబామాకు సంతకాలు పంపినవాళ్లలో ఇండియా నుంచి చౌరాసియా ముఖ్య కథానాయిక. ఇప్పుడు ఆమె ముంబైలో ‘క్రాంతి’అనే సంస్థను నడుపుతోంది. సెక్స్ వర్కర్ల కూతుళ్లకు చదువు చెబుతోంది.
గే స్ తమ గురించి మాత్రమే చెప్పుకోవాలనుకోవడం లేదు. తమ బతుకేదో తాము బతికేయాలనీ అనుకోవడం లేదు. ఆదివాసీ కార్యకర్త సోనీసోరీ పై జరిగిన దాడిని ఖండిస్తున్నారు. గిరిజన మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై నిజనిర్థారణ చేయాలని అడుగుతున్నారు. సమాజంలో ఒకరిగా అన్ని సామాజిక బాధ్యతలనూ మోస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా తమను తాము దాచుకుని చెయ్యాలనుకోవడం లేదు. ఇది ఐడెంటిటీ క్రైసిస్ కాదు. ఆత్మ గౌరవం. ‘హాయ్ ఐ యామ్ గే’ అని వాళ్లు గర్వంగా చెయ్యందిస్తున్నారు. ‘గ్లాట్ టు మీట్ యు’ అని మనం ఆ చేతిని జెంటిల్‌గా షేక్ చెయ్యగలమా... మన చెయ్యి వణక్కుండా?!
మాధవ్ శింగరాజు