విలన్స్ ఆర్ నాట్ బార్న్.. దే ఆర్ మేడ్ బై సొసైటీ.. వ్యవస్థే విలన్లను తయారు చేస్తుందని అర్థం. అవసరాలకు తగ్గట్లు బతికే మనిషి.. అవతలివాళ్లను అవహేళన చేయడం అంతే పరిపాటిగా మార్చేసుకున్నాడు. అయితే మానసిక రుగ్మతలో కూరుకుపోయిన మనిషి ముందు అది ప్రదర్శిస్తే.. అది ప్రాణాల మీదకే రావొచ్చు. అలాంటి వాస్తవ ఘటనే ఇది. ‘‘తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి నేరగాళ్లు మన మధ్యే ఉంటారు’’ అని పాఠకులకు తెలియజేయడమే మా ఉద్దేశం.
33 ఏళ్ల రామ్ స్వరూప్. చూడడానికే కాదు.. మీడియా ముందు అతని మాటలు అంతే అమాయకంగా ఉన్నాయి. కానీ, ఓ హత్య కేసు ఇంటరాగేషన్‌లో నోరు విప్పి అతను చెప్పిన విషయాలు ఖాకీలనే విస్తుపోయేలా చేశాయి. ఏడాదిన్నర కాలంలో 11 మందిని అతికిరాకతంగా హతమార్చిన సీరియల్ కిల్లర్ ఇతనేనంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు!.
పంజాబ్(Punjab)లో ఈ సీరియల్ కిల్లర్ ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మగవాళ్లకు మాత్రమే లిఫ్ట్ ఇచ్చి.. ఆపై వాళ్లను దారుణంగా హతమార్చాడతను. ఈ క్రమంలో అతను నేరాలకు పాల్పడ్డ తీరు.. అందుకు అతను చెప్తున్న కారణాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ‘‘వాళ్లు నన్ను కొజ్జావాడంటూ హేళన చేశారు. నా వేషధారణను అవహేళన చేశారు. పైగా నాతో శారీరక అవసరాలు తీర్చుకుని ఇస్తానన్న డబ్బూ ఇవ్వలేదు. ఈ విషయాలు నన్ను ఎంతో బాధించాయి. అందుకే చేతికి ఏది దొరికితే దాంతో.. అక్కడికక్కడే వాళ్లను చంపాల్సి వచ్చింది’’ ఇది నేరాంగీకారంలో రామ్ స్వరూప్ అలియాస్ సోధీ చెప్పిన అసలు విషయం.
👉రామ్ స్వరూప్ స్వస్థలం.. హోషియార్పుర జిల్లా చౌరా గ్రామం. అతని తల్లిదండ్రులు విద్యావంతులు. ఆర్థికంగా ఉన్న కుటుంబమే. కానీ, రామ్ స్వరూప్‌లోపల ఇంకొకరు ఉన్నారు. అతనికి చిన్నప్పటి నుంచి ఆడవాళ్లలా అలంకరించుకోవడం ఇష్టం. చెబితే.. ఇంట్లోవాళ్లు కోప్పడతారనే భయం. అందుకే తల్లిదండ్రులు లేనప్పుడు రహస్యంగా మేకప్ వేసుకుని మురిసిపోయేవాడు. ఆ రహస్య జీవితం చాలా ఏళ్లపాటు అలాగే కొనసాగింది. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో మరో కోణాన్ని బయటకు తీసింది.
👉అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడతను. ఆపై తిరిగి స్వదేశానికి వచ్చాడు. కోడుకులోని ఆ కోణం తెలిసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. చివరకు.. రామ్ స్వరూప్‌కు వివాహం చేశారు. ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే అతనిలోని ఆ కోణం.. భార్యకు ఆలస్యంగా తెలిసింది. రెండేళ్ల కిందట పిల్లలను తీసుకుని పుట్టింటి వెళ్లిపోయింది. ఇటు తల్లిదండ్రులు అతన్ని దూరం పెట్టారు.
ఒంటరి అయిన రామ్ స్వరూప్‌కు ‘తేడాగాడు’ అనే ముద్ర వేసి ఎవరూ పని ఇవ్వలేదు. దీంతో తనదైన అవసరాల కోసం రోడ్డెక్కాడతను. అందుకోసం చీర కట్టి.. బొట్టు పెట్టి.. ముస్తాబయ్యేవాడు. చూసేవాళ్లంతా తనను తేడా అనుకున్నా ఫర్వాలేదనే ధీమా అతనికి కలిగింది అప్పుడు. అయితే.. ఎప్పుడైతే తాను అనుకున్నది నెరవేరలేదో.. అతనిలో మృగం బయటికి వచ్చింది.
👉 మోద్రా టోల్‌ప్లాజా వద్ద టీ, వాటర్ బాటిళ్లు అమ్ముకునే మహిందర్ సింగ్ అనే వ్యక్తి ఆగష్టు 18వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీంకు ఓ చిన్న గుడ్డముక్క దొరికింది. అయితే అప్పటిదాకా దొరక్కుండా జాగ్రత్త పడిన రామ్ స్వరూప్.. ఎప్పుడూ తన మెడలో ఉంచుకునే మఫ్లర్‌తో అడ్డంగా దొరికిపోయాడు. నాలుగు నెలలపాటు జరిగిన దర్యాప్తు.. గాలింపు అనంతరం డిసెంబర్ 25వ తేదీన రామ్ స్వరూప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
👉తనతో శారీరక అవసరం తీర్చుకునే సమయంలో మహిందర్ తన కట్టూబొట్టును అవమానించాడని.. అది తట్టుకోలేకే అతన్ని హతమార్చినట్లు రామ్ స్వరూప్ నేరం ఒప్పుకున్నాడు. అంతేకాదు.. దీనికంటే ముందు 10 హత్యలు చేసినట్లు ఈ సీరియల్ కిల్లర్(Serial Killer) పోలీసుల దిమ్మతిరిగిపోయేలా విషయం ఒకటి చెప్పాడు.
👉రామ్ స్వరూప్ చేసిన తొలి హత్య.. హర్‌ప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిది. 18 నెలల కిందట జరిగిందా ఘోరం. ఆయనతో లైంగికంగా కలిశాక.. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హర్‌ప్రీత్‌ను హతమార్చి.. ఆయన వీపులో ధోకేబాజ్(మోసగాడు) అని రెడ్ ఇంక్‌తో రాత రాశాడు. ఈ కేసు పంజాబ్‌లో ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది కూడా. అయితే విచారణలో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.
👉ఈ ఘటన తర్వాత.. రామ్ స్వరూప్ అప్రమత్తం అయ్యాడు. రోజూవారీ పని చేసుకునే కూలీలు, మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డును రామ్ స్వరూప్ టార్గెట్ చేసుకునేవాడు. మరికొందరికి లిఫ్ట్ ఆఫర్ చేసేవాడు. వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయటపెట్టేవాడు. అందుకు ఒప్పుకున్నవాళ్లతో నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లేవాడు. అయితే ఏకాంతంగా ఉన్న టైంలో.. వాళ్లు తనతో ప్రవర్తించిన తీరే.. తనను నేరానికి ఉసిగొల్పిందని చెబుతున్నాడను. వాళ్ల మాటలు, చేతలు అతన్ని మానసికంగా కుంగదీశాయట. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో వాళ్లను దారుణంగా హతమార్చి.. తన సిగ్నేచర్ వీపులో మోసగాడు అని రాసి.. వాళ్ల జేబుల్లో ఉన్నదంతా దోచుకుని వెళ్లిపోయేవాడట.
అలా రూపానగర్, సర్‌హింద్, ఫతేఘడ్ సాహిబ్.. ఇలా చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పటిదాకా 11 మందిని హతమార్చాడు. వీటిలో ఆరు కేసుల్లో ఈ సైకో గే కిల్లర్ పాత్రను పోలీసులు ధృవీకరించుకున్నారు. మరో ఐదు కేసుల్లో.. రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సి ఉంది. రాబోయే.. రోజుల్లో రామ్ స్వరూప్ నేరచరితను ఏ సినిమాగానో, వెబ్ సిరీస్(Web Series)గానో తెర మీద చూడాల్సిన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో కదా!.
Comments
Please login to add a commentAdd a comment