నిర్వచనం: ఈ ఆసనం వేసినప్పుడు దేహాకృతి చక్రంలా కనిపిస్తుంది. అందుకే ఇది చక్రాసనంఅయింది.
చేసే విధానం
ముందుగా వెల్లకిలా పడుకొని రెండు చేతులు ఇరువైపుల ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.
తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద వంచి రెండుపాదాలను పిరుదుల వద్దకు తీసుకోవాలి. మడమలు పిరుదులకు ఆనించి ఉంచాలి.
ఇప్పుడు రెండు అరచేతులను తలకిరువైపుల నేల పైన ఉంచాలి.
శ్వాస పూర్తిగా తీసుకొని శరీరబరువు పూర్తిగా రెండు చేతులు రెండు పాదముల పైన ఉంచి శరీరాన్ని పైకి లేపాలి.
ఈ స్థితిలో ఛాతీ, నడుము పైకి లేపబడి తలక్రిందకు వ్రేలాడబడి ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు వంగకుండా అరచేతులు, పాదాలు నేలను తాకి ఉంటాయి.
ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత యథాస్థితికి రావాలి.
ప్రతిరోజు ‘3’ సార్లు చేయాలి.
ఉపయోగాలు
వెన్నునొప్పి తొలగిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్, శ్వాస సంబంధిత రోగాలు పోతాయి.
చేతులు, భుజాలు, మోకాళ్లు, తొడలు, మణికట్టు శక్తిమంతం అవుతాయి.
పొత్తికడుపు కండరాలు శక్తిమంతం అవుతాయి.
అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్దకం పోతాయి.
రుతుక్రమ సమస్యలు పోతాయి.
తొడలపై కొవ్వు కరుగుతుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది.
వెన్ను సరళతరమవుతుంది.
చేయకూడనివాళ్ళు
హైబీపీ, మైగ్రేన్, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు ఉన్న వారు చేయకూడదు.
అధికబరువు ఉన్నవారు, మోకాళ్ల నొప్పులు, భుజముల నొప్పులు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతు, చెవికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
మోడల్: అంజు రిషిత
ఫొటోలు: శివ మల్లాల
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు
సప్తరుషి యోగవిద్యాకేంద్రం
హైదరాబాద్
చక్రాసనం
Published Mon, Nov 18 2013 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement