యోగాతో నడుమునొప్పి మాయం
వాషింగ్టన్: యోగాతో నడుము నొప్పికి చక్కని పరిష్కారం లభిస్తుందని ఇండియా, యూకే, యూఎస్‌లలో నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. నడుము నొప్పి అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యే అయినప్పటికీ దీని నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల మందులు వాడతారు. ఫలితంగా అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. మందుల అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నడుము నొప్పితో బాధపడుతున్న కొందరితో యోగాసనాలు వేయించడంతో కేవలం మూడు నెలల్లోనే వారు ఈ సమస్య నుంచి బయటపడ్డారని అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుసాన్ వీల్యాండ్ తెలిపారు. యోగా.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆధునిక జీవన విధానంలోనూ భాగమవుతోందని, అందుకే అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ఆసనాలను అనుసరించాలని సుసాన్ సూచించారు. 1,080 మందిపై పరిశోధన చేయగా.. వెన్నునొప్పిపై దృష్టి కేంద్రీకరించి యోగా సాధన చేసినవారిలో మిగతా వారితో పోలిస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయని చెప్పారు.