యోగా..మంచుదేగా | manch lakshmi visit to yoga master as a sakshi reporter | Sakshi
Sakshi News home page

యోగా..మంచుదేగా

Published Sat, Dec 20 2014 10:41 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

యోగా..మంచుదేగా - Sakshi

యోగా..మంచుదేగా

అందమైన మేని కోసం కుందేలులా పరుగెత్తాల్సిన అవసరం లేదు.దృఢమైన దేహం కోసం జిమ్‌లో చెమటోడ్చాల్సిన పని అంతకన్నా లేదు.ఆరడుగుల నేల చాలు.. ఆయుష్షున్నంత కాలం మిమ్మల్ని ఆరోగ్యంగాఉంచడానికి. పతంజలి ఆసనాల శాసనాలు అక్షరాలా అనుసరిస్తే చాలు ఈడు ముడతలు మీ దరి చేరవు.

పరగడుపునే కాసేపు విల్లులా ఒళ్లు వంచి చూడండి.. వయసు పైబడినా మీ నడుం వాలితే ఒట్టు. మయూరాసనం వేయగలిగితే.. జాతక చక్రంలో మాలవ్య యోగం పట్టిన వారిలా మీ మేను నిగనిగలాడుతుంది. అదీ యోగా పవర్. యోగాసనాలు వాటి వల్ల కలిగే యోగాల గురించి సాక్షి సిటీప్లస్ తరఫున నటి, నిర్మాత మంచు లక్ష్మియోగాభ్యాసకులను పలకరించారు.
 
మంచు లక్ష్మి: యోగా.. ఈ దేశం మనకిచ్చిన గిఫ్ట్. నేను అమెరికాలో ఉండగా నేర్చుకున్నాను. అమెరికన్స్‌ని చూసి నేర్చుకున్నందుకు చాలా బాధగా ఉంది. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మన దేశమే. చిత్రం ఏంటంటే.. పొరుగు దేశాల్లో యోగాకు ఉన్నంత క్రేజ్ మన దగ్గర లేకపోవడమే. అందుకే యోగా అందరి జీవితంలో తప్పనిసరి అవ్వాలనే ఉద్దేశంతో స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు ఇక్కడికి వచ్చి కాసేపు ముచ్చటిస్తున్నాను. చెప్పండి సార్.. అసలు యోగా అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది?

చంద్రారెడ్డి: కీస్త్రు పూర్వం ఐదువేల సంవత్సరాల క్రితమే మన దేశంలో యోగా అనే పదం ఉందంటారు. యోగాకు సంబంధించి పూర్తి హక్కులు మన దేశానికే ఉన్నాయి. రుషులు అందించిన విద్య యోగ. మనస్సుని, దేహాన్ని కలిపి చూడటమే యోగా అంటే.

మంచు లక్ష్మి: అవును.. కానీ మహర్షుల జీవితాల్లో యోగా ముఖ్యమైన భాగం. ఈ హైటెక్ కాలంలో యోగా చేసే తీరిక, ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి సంఖ్య పెంచడానికి మార్గం ఏంటి?

చంద్రారెడ్డి: ఏం లేదు.. యోగా ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే.

మంచు లక్ష్మి: ఇక్కడ మీ సెంటర్‌లో వారం రోజుల కిందట యోగాక్లాస్‌లోని చేరినవారైనా ఉన్నారా?

కైవల్య: నేనున్నానండి.

మంచు లక్ష్మి: వావ్. నువ్వు చూస్తే స్కూల్ స్టూడెంట్ వి. ఎందుకు యోగాలో చేరావు?

కైవల్య: నాకు ఏదో ప్రాబ్లమ్ వల్ల మోకాళ్ల నొప్పి వచ్చింది. ఎన్ని రకాల మందులు వాడినా తగ్గడంలేదు. యోగావల్ల రిజల్ట్ ఉంటుంది అంటే వన్ వీక్ బ్యాక్ ఇక్కడ చేరాను. కొంచెం చేంజ్ కనిపించింది.

మంచు లక్ష్మి: గుడ్.. కానీ మన దగ్గర చాలామంది ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటే కానీ యోగా దగ్గరికి రారు. దటీజ్ గుడ్ అండ్ బ్యాడ్.

భార్గవి: కనీసం అలాగైనా రావడం మంచిదేకదా మేడమ్.

మంచు లక్ష్మి: అవును.. కానీ యోగా శారీరక, మానసిక సమస్యలు తీర్చేది మాత్రమే కాదు. మనని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. అనారోగ్య సమసల్ని దరి చేరనీయదు. అమ్మా.. మీరు ఎన్నాళ్ల నుంచి యోగా చేస్తున్నారు.

సరస్వతి: ఆరేళ్లుగా చేస్తున్నాను. నాకు 59 ఏళ్లు. ఈ వయసులో సాధారణంగా ఉండే ఏ సమస్యలూ నాకు లేవు.

మంచు లక్ష్మి: వావ్.. మీరు అంత వయసున్నట్టు లేరు. మీ ముఖం కూడా చాలా తేజస్సుగా ఉంది. సార్.. యోగాతో ఆర్యోగంతో పాటు ముఖంలో ప్రశాంతత, గ్లో వస్తుంది కదా!

చంద్రారెడ్డి: కచ్చితంగా.. ముందుగా డల్‌నెస్ పోతుంది. ముఖంలో తేజస్సు, చురుకుదనం, బాగా ప్రాక్టీస్ చేసిన వారిలో పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది.

మంచు లక్ష్మి: మరో ముఖ్యమైన ప్రశ్న. బరువు తగ్గడానికి యోగానే సరైన మార్గం. వారంలో, రోజులోనూ బరువు తగ్గించే వైద్య సదుపాయాలు వచ్చాయనుకోండి. కానీ యోగాతో బరువు తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

చంద్రారెడ్డి: ఓ 20 ఏళ్ల పాటు పెంచిన కాయాన్ని.. 20 రోజుల్లో తగ్గించాలనుకోవడం చాలా తప్పు. దాని వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోగాతో బరువు మెల్లిగా తగ్గినా, ఎనర్జీ లెవల్స్‌లో ఏ మార్పూ ఉండదు. 20 కిలోల అదనపు బరువుంటే నెలకు నాలుగైదు కిలోలు తగ్గడం మంచిది. అది యోగా వల్ల మాత్రమే సాధ్యం. డైట్ కంట్రోల్ కూడా ఉండాలి.

మంచు లక్ష్మి: దాని గురించీ నాలుగు ముక్కలు చెప్పండి. నాకు తెలిసి హెల్దీబాడీకి ఫైవ్ వైట్ ఫుడ్స్ ఎనిమీస్ అంటారు.

చంద్రారెడ్డి: అవును.. రైస్, సాల్ట్, మైదా, షుగర్, పాలు.

మంచు లక్ష్మి: పాలుకూడానా?

చంద్రారెడ్డి: మనిషి ఆరేళ్ల వయసులోపు మాత్రమే పాలు తాగాలి. ఆ తర్వాత అవసరం లేదు. కచ్చితంగా చెప్పాలంటే అమ్మపాలు చాలు. మీరు చూడండి.. ఈ భూమ్మీద 84 లక్షల జీవరాశులున్నాయి. అవన్నీ వాటి తల్లి పాలు తాగుతాయి కానీ మరో జంతువు పాలు తాగాలని అనుకోవు. మనం మాత్రమే గేదె, ఆవు, మేకపాలు తాగడానికి ఇష్టపడతాం.

మంచు లక్ష్మి: మరి పెరుగు?

చంద్రారెడ్డి: పెరుగు కాదు.. మజ్జిగ మంచిది. దానివల్ల ప్రయోజనాలుంటాయి.

మంచు లక్ష్మి: మహిళలకు యోగా తప్పనిసరి అని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేర్చుకుంటే ఇంట్లో పిల్లలకి కూడా అలవాటవుతుంది. అదొక్కటే కాదు మహిళ ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. దీనికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పండి?

భార్గవి: నేను ఏడేళ్ల నుంచి యోగా చేస్తున్నానండి. నేను ప్రెగె ్నంట్‌గా ఉన్నప్పుడు కొన్ని యోగాసనాలు వేశాను. దానివల్ల ఆ సమయంలో వచ్చే బీపీ, ఒంట్లో నీరు చేరడం వంటి సమస్యలేమీ రాలేదు. కవలలైనప్పటికీ నార్మల్ డెలవరీ అయింది. పాపలు పుట్టిన రెండు వారాల తర్వాత నా పనులు నేను చేసుకున్నాను. ఇది కేవలం యోగా వల్లే సాధ్యమైంది.

మంచు లక్ష్మి: మరి మీ పిల్లలకు యోగా నేర్పుతున్నారా?

భార్గవి: ప్రత్యేకంగా నేర్పడమంటూ ఏం లేదండి. నేను చేస్తుంటే చూసి వాళ్లే చేసేస్తున్నారు.

మంచు లక్ష్మి: గ్రేట్.. చాలామంది యోగా చేయొచ్చు కదా అంటే.. టైం లేదంటారు. ఇది నిజమైన సమాధానం అంటారా ?

రంజన: టైం మన చేతిలో ఉంటుంది. యోగా విలువ తెలిస్తే దానికి ఎంత టైమైనా కేటాయించగలరు.

మంచు లక్ష్మి: యా.. రోజూ ఇన్ని గంటలని చేయక్కర్లేదు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఒళ్లు వంచితే చాలు.

శ్వేత: మేడమ్.. మిమ్మల్ని రెండు ప్రశ్నలడగాలి.

మంచు లక్ష్మి: డెఫినెట్లీ...

శ్వేత: మీరు ఎప్పుడు యోగా నేర్చుకున్నారు?

మంచు లక్ష్మి: నేను అమెరికాలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మొదలుపెట్టాను. చాలా సాధన చేశాను. తెల్లవారుజామున 4:30 గంటలకు మొదలుపెడితే ఉదయం 10 గంటల వరకూ చేసేదాన్ని. అలా రెండు నెలలు చేసిన తర్వాత నాకు కుదిరిన టైంలో చేయడం మొదలుపెట్టాను. చాలామంది గురువుల దగ్గర యోగా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను.

శ్వేత: మీ ప్రొఫెషన్‌లో ఒత్తిడి ఉంటుందంటారు కదా! దానికిది ఉపయోగపడిందంటారా?

మంచు లక్ష్మి: ఒత్తిడిని అధిగమించడం ఒక్కటే కాదు...నేను ఐరేంద్రీ క్యారెక్టర్ అంత ఫర్‌ఫెక్ట్‌గా చేయగలిగానంటే.. దానికి కారణం యోగానే. షూటింగ్ గ్యాప్‌లో యాక్టివ్‌గా ఉండడం కోసం ఆసనాలు ప్రాక్టీస్ చేసేదాన్ని.

సరస్వతి: బిజీగా ఉంటారు కదా! యోగా టైమింగ్స్ ఎలా ఎడ్జెస్ట్ చేసుకుంటున్నారు?

మంచు లక్ష్మి: నాకు ఏదైనా యోగా తర్వాతే. దీని రుచి తెలిసినవారెవరూ దీన్ని వదులుకోరు. థ్యాంక్యూ సో మచ్. ఈ కథనం చూసి మరికొంతమంది యోగా చేయడానికి సిద ్ధపడతారని ఆశిస్తున్నాను. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement