మనసుకు రిలీఫ్
1 ప్రసారిత మార్జాలాసన
వజ్రాసనంలో కూర్చున్న తరువాత (రెండు కాళ్ళు మడిచి కాలి మడమల మీద కూర్చోవాలి) అర చేతులు రెండూ ముందు వైపు నేల మీద ఉంచి మోకాళ్లు కింద ఉంచి నడుమును పూర్తిగా రిలాక్స్ చేయాలి. దీనిని మార్జాలాసనమని అంటారు. మార్జాలం అంటే పిల్లి. జంతుజాలములన్నింటిలో పిల్లికి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే వెన్నెముక ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల వెన్నెముకకు మంచి రిలాక్సేషన్ వస్తుంది కనుక దీనిని మార్జాలాసనమని అన్నారు. ఈ స్థితిలో ఉండి శ్వాస తీసుకుంటూ ఎడమచేతిని ముందుకు, కుడికాలును వెనుకకు ఒకే సరళ రేఖలో ఉండేటట్లుగా సాగదీస్తూ ఉండి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడిమోకాలు క్రిందకు, ఎడమచేయి క్రిందకు తీసుకురావాలి. మళ్ళీ సీటు నడుము భాగాలను రిలాక్స్ చేస్తూ కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత ఇదే ఆసనం రెండవవైపు కూడా చేయాలి. ఆపోజిట్ చేతిని, కాలుని స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాలన్స్ చేయడంతో ఎక్కువ ఇబ్బంది ఉండదు.
గమనిక: ఎవరికైనా మోకాలు సమస్య ఉన్నట్లయితే టర్కీ టవల్‌ని కానీ పలచ్చడి దిండును కాని మోకాళ్ల కింద పెట్టుకోవచ్చు.
ఉపయోగాలు: నడుము, సీటు, వెన్నెముక భాగాలు ముఖ్యంగా లోయర్ బ్యాక్ ఔ1 నుంచి ఔ5 వరకు ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి ఉపశమనం కలుగుతుంది. వెన్నెముక ఫ్లెక్సిబుల్‌గా అవుతుంది. వీపు భాగంలో కండరాలలో ఉన్న బిగుత్వంపోతుంది. కండరాలను సడలించినప్పుడు ఆక్సీజన్ కంజప్షన్ కెపాసిటీ పెరుగుతుంది.
2 అర్ధ అధోముఖ శ్వాసాసన
మార్జాలాసనములోలాగానే మోకాళ్ళ మీద ఉండి మోకాలు నుండి సీటు వరకూ (నడుము వరకూ) 90 డిగ్రీల కోణంలో ఉంచి వీపును ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ, నుదురు లేదా గడ్డమును నేల మీద ఉంచి చేతులు రెండూ ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ శ్వాసను సాధారణ స్థితిలో ఉంచి కనీసం 5 లేదా 10 శ్వాసల వరకూ అదే ఆసనంలో ఉండేటట్లయితే, డోర్సల్ స్పైన్‌కి, డెల్టాయిడ్ ట్రెపీజియస్ కండరాలకు మంచిగా టోనింగ్ జరిగి అప్పర్ బ్యాక్‌కి పూర్తిగా రిలీఫ్ దొరుకుతుంది.
ఉపయోగాలు: మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. స్ట్రెస్, కొద్దిపాటి డిప్రెషన్ నుండి రిలీఫ్ కలుగుతుంది. మెనోపాజ్ లక్షణాలను దూరంగా ఉంచడానికి, స్త్రీలకు రుతుక్రమంలో ఉండే అసౌకర్యానికి పరిష్కారంగానూ, తలనొప్పి, ఇన్‌సోమ్నియా, అధికరక్తపోటుకు ఆస్తమా వంటి సమస్యలకు ఉపయోగకారిగా పనిచేస్తుంది.
3 శశాంకాసన
పైన చెప్పిన అర్థ అధోముఖశ్వాసాసనంలో నుండి నెమ్మదిగా సీటు భాగాన్ని క్రిందకు క్రమక్రమంగా దించి మడమల మీద కూర్చొనే విధంగా ప్రయత్నించాలి. పొట్ట ఛాతీ భాగాలు తొడలపైన ఉంచి శ్వాస వదులుతూ నుదురుని నేలకు వీలైనంత దగ్గరలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. నుదురు నేలకు దగ్గరగా తీసుకువెళ్ళకపోయినా ఫరవాలేదు. కానీ వెనుక మడమల మీద సీటును ఉంచే ప్రయత్నం చేస్తూ మోకాళ్లు రెండూ కలిసి ఉంచే ప్రయత్నం చేయవలెను. చేతులను ముందుకు బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంచాలి.
ఉపయోగాలు: స్ట్రెచ్ మేనేజ్‌మెంట్‌కి రికమండ్ చేయబడిన ఆసనం ఇది. మెదడుకి రక్తసరఫరా పెరగడం వలన పార్కిన్‌సన్, బ్రెయిన్ ఎటక్సియా అల్జీమర్స్ వంటి సమస్యలకు కొంతవరకూ పరిష్కారం లభిస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ కోపం తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. పొట్ట దగ్గర అవయవాలకు టోనింగ్ జరగడం వలన జీర్ణవ్యవస్థ బాగుగా పనిచేస్తుంది. ఈ స్థితిలో శ్వాస చాలా వేగంగా ఉంటుంది. శ్వాసలు చిన్నవిగా ఉంటాయి. అందువలనే దీనికి శశాంకాసన అనే పేరు వచ్చింది.
ఈ ఆసనాలు అన్నీ వెన్నెముక నడుము భాగాలకు పూర్తిగా ఉపశమనం ఇవ్వడానికి మనసుకు ఆందోళన తగ్గించి ప్రశాంతతను చేకూర్చడానికి ఉపకరించేవే!
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్