మనసుశిక్షణ
ఏ ఆసనం కూడా శక్తినంతా ఉపయోగించి బలవంతంగా చేయకూడదు. మనస్సులో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా మనస్సును ఫ్రీ చేసినప్పుడే శరీరం కూడా ఫ్రీ అవుతుంది. లేకపోతే శరీరం అంతా స్టిఫ్‌నెస్ ఉంటుంది. దీంతో శరీరంలో ఏ భాగమూ సహకరించదు. అందువల్లనే మనం శరీరంతో పనిచేస్తున్నప్పటికీ మనస్సే ప్రధానం. యోగసాధకులందరూ ఈ సత్యాన్ని గ్రహించాలి.
ఏకపాద శిరాసన
కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేయాలి. మోకాళ్లు భూమి నుంచి కొంచెం పైకి, మళ్లీ క్రిందకి చేస్తూ రిలాక్స్ అవ్వాలి. కాళ్లు రెండూ మడిచి ఒక అరిపాదానికి రెండవ అరిపాదాన్ని తాకించి బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) వలె మోకాళ్ళను పైకి కిందకు చేస్తూ తొంటికీలు భాగాల్ని రిలాక్స్ చేయాలి. కుడికాలుని ముందుకు స్ట్రెచ్ చేసి, ఎడమ కాలుని పైకి లేపి, ఎడమ చేతిని ఎడమ కాలు క్రిందకు తీసుకువెళ్లాలి. నెమ్మది నెమ్మదిగా కాలుని భుజం మీదకి తీసుకువెళ్తూ ఇంకా పైకి మెడ మీదకు వీలైతే ఇంకా వీపుపై భాగానికి దగ్గరగా తీసుకువెళ్లాలి. చేతులు రెండూ నమస్కార ముద్రలో జోడించాలి. ఈ స్థితిలో ఎడమతొడ వెనుక భాగం ఎడమ భుజం వెనుక భాగాన్ని తాకుతూ ఉంటుంది. తలపైకి ఎత్తి ఉంచినట్లయితే కాలు భుజం మీద నుంచి ఎట్టి పరిస్థితిలోనూ క్రిందకు జారదు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత ఎడమ కాలును తిరిగి అదే క్రమంలో వెనుకకు తీసుకువచ్చి పూర్తిగా రిలాక్స్ అయి మళ్లీ రెండవవైపు కూడా చేయాలి.
పై విధంగా చేయలేనివారు కాలును వీలైనంతపైకి తీసుకువెళ్లి పాదం ముందు భాగాన్ని నుదురుకి దగ్గరగా లేదా యింకా కొంచెంపైకి తీసుకువెళ్ళి మడమను తలపైన ఆనించే ప్రయత్నం చేయవచ్చు. ఒక నిర్ధిష్టమైన ఆసనంలో పురోగతి మనం చేసే సాధనను బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.
నోట్: ఈ ఆసనం తర్వాత రెండు కాళ్లను రెండు భుజాల మీద పెట్టుకున్నట్లయితే దానిని ద్విపాద శిరాసనమని, ఆ రెండు కాళ్లని బాగా పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినట్లయితే త్రిభాసనమని అంటారు. ఆ ఆసనాలు అందరూ చేయలేరు కనుక వాటి గురించి పూర్తి వివరణ ఇవ్వడం లేదు.
ఉపయోగాలు: తొడలు, పిక్కలు బాగా సాగదీయబడతాయి. మెడ వీపు భాగాలు బలంగా తయారవుతాయి. పొట్ట భాగంలో ఉన్న కండరాలు బాగా సంకోచింపబడతాయి కనుక జీర్ణశక్తి పెరుగుతుంది.
ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసన
ఈ ఆసనం సాధన చేయడానికి ముందు వీపు మీద ముందుకు పశ్చిమోత్తనాసనం మాదిరి వెనుకకు, హలాసనం లాగా రోల్ అవ్వాలి. దీని వలన వెన్నెముకకు మంచి టోనింగ్ జరిగి ప్రిపరేటరీగా పనిచేస్తుంది. ఆ తరువాత రెండు చేతులతో రెండు కాలి బొటనవేళ్లను పట్టుకుని (ముందు మోకాళ్లు వంచే ఉంటాయి) పాదాలు రెంటినీ నెమ్మదిగా కలిపి ఉంచి మోకాళ్లు క్రమంగా నిటారుగా చేసుకుని పిరుదులు (హిప్స్) మీద బ్యాలెన్స్ చేస్తూ కూర్చోవాలి. దీనిని ఉభయ పాదాంగుష్టానాసమని పిలుస్తారు. అదే బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ క్రమంగా రెండు కాళ్లను పక్కలకు విడదీస్తూ అదే స్ట్రెచ్ మెయింటెయిన్ చేయడానికి ప్రయత్నించాలి. కాళ్లు పక్కకు స్ప్లిట్ చే సి, స్ట్రెచ్ చేయడం వల్ల ఇది ప్రసారిత ఉభయ పాదాంగుష్టాసనమని పిలుస్తారు. అలా కూర్చొని బ్యాలెన్స్ చేయలేని ప్రారంభ సాధకులు గోడకి ఆనుకొని కూర్చొని సాధన చేయవచ్చు.
ఉపయోగాలు
తొడ కీలు భాగాలు ఓపెన్ అవ్వడానికి, పెల్విక్ ప్రాంతం ఓపెన్ అవ్వడానికి మంచిది. ప్రీ నేటల్ యోగాలో ఇది ఒక ముఖ్యమైన ఆసనం.
సమన్వయం
ఎస్. సత్యబాబు సాక్షి ప్రతినిధి
బకాసన
బకము అనగా కొంగ (ఛిట్చ్ఛ). నేల మీద గొంతుకి కూర్చుని అరచేతులు ముందువైపు భూమి మీద పూర్తిగా ఆనించి, మోకాళ్ళు రెండు పక్కలకు రెండు తొడల ముందు భాగంలో పక్క భాగాలకు నొక్కుతూ రెండు మోకాళ్లు, రెండు చంక భాగాలలోకి సపోర్ట్‌గా ఉంచి శ్వాస వదులుతూ తలను ముందుకు దించుతూ రెండు కాళ్లను కలిపి ఉంచి క్రమ క్రమంగా పైకి లేపు బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితికి రావాలి. 3-5 సాధారణ శ్వాసల తరువాత తిరిగి వెనక్కి రావాలి. కొత్త సాధకులు ఒక స్టూలుని కాళ్ల కింద ఉంచుకుని లేదా కుర్చీ ఆధారంగా చేసుకొని ప్రయత్నం చేయవచ్చు. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం మీద పట్టు సాధించడమే ఈ ఆసంలోని విశేషత.
ఉపయోగాలు: డెల్టాయిడ్, ట్రెపీజియస్ కండరాలు, బెసైప్స్ ట్రైసెప్స్ బలంగా అవడానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనస్సుకి ఏకాగ్రతా శిక్షణ ఇవ్వబడుతుంది.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్