‘వైద్యో నారాయణో హరి’ అంటారు. వైద్యుడు దేవుడితో సమానం అని! అయితే ‘వైద్యుడు దేవుడు కాకపోయినా పర్వాలేదు.. కనీసం మనిషిగానైనా ఉంటే చాలు’ అనిపిస్తుంది.. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఒక యువతికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలిస్తే.
అది చెన్నై మహానగరం. వైద్యవిజ్ఞానం అభివృద్ధి చెందిన నగరం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు, సూపర్ స్పెషలిస్టులైన డాక్టర్లకు కొదవలేని నగరం. అంతంత చదివిన పెద్ద డాక్టర్లకు.. సంస్కారవంతంగా వ్యవహరించాలనే పాఠం ఎవరూ చెప్పలేదో ఏంటో? పేషెంట్ పట్ల చూపించాల్సిన నిబద్ధత, నైతికతల గురించి ఒక్క పుస్తకంలోనూ రాయలేదో లేక ఆ పుస్తకాన్ని ఆ డాక్టర్ చదవకుండానే కోర్సు పూర్తి చేసుకున్నాడో! మొత్తానికి ఆ డాక్టర్ చేసిన పనికిగాను వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన పని చేస్తున్న హాస్పిటల్‌కి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులిచ్చింది.
జ్వరంతో హాస్పిటల్‌కి వెళ్తే
చెన్నైలో ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి తీవ్రమైన జ్వరంతో ఓ పెద్ద హాస్పిటల్‌కి వెళ్లింది. అది నగరంలో మంచి పేరున్న హాస్పిటలే. ఆమెను హెచ్‌డియు (హై డిపెండెన్సీ యూనిట్)లో చేర్చారు. ఆమెను పరీక్షించడానికి వచ్చింది మగడాక్టరు. ఆ సమయానికి డ్యూటీలో ఉన్నది అతడొక్కడే కాబట్టి పేషెంట్‌లకు మరో మార్గంలేదు. ఆమెను పరీక్షిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. వైద్య పరీక్ష నెపంతో దేహ భాగాలను ప్రైవేట్ పార్ట్స్‌ను తాకినట్లు ఆమె ఆరోపిస్తోంది. వైద్య పరీక్షల కోసం దేహాన్ని తాకడానికి, దురుద్దేశంతో తాకడానికి మధ్య తేడా తెలియని వయసు కాదామెది. ‘హాస్పిటల్‌లో తనకు తోడుగా తన వాళ్లెవరినీ అనుమతించలేదని, కనీసం తన ఫోన్‌ను కూడా లోపలికి తెచ్చుకోనివ్వలేదని చెబుతూ, డాక్టర్ పరీక్షిస్తున్నంత సేపు నిస్సహాయంగా దిక్కులేని దానిలాగ ఉండిపోవాల్సి వచ్చింది’ అంటోందామె.‘డాక్టర్ చేతలు అర్థమవుతున్నా తన దేహం అచేతనంగా ఉండటంతో అతడి చేతిని తోసేయడానికి కూడా తన చేయి లేవలేదని, మనసు పెనుగులాడుతున్నా దేహం సహకరించని స్థితిలో ఉండిపోయానని’ చెప్తోందామె. జ్వరంతో ఉన్న పేషెంట్‌కి వైద్యం చేసే ప్రక్రియలో జననాంగాల్ని తడమాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తూ హాస్పిటల్ యాజమాన్యానికి రాతపూర్వకంగా కంప్లయింట్ ఇచ్చింది.
నోరు మెదపని హాస్పిటల్
కంప్లయింట్ ఇచ్చి నెల దాటినా కూడా హాస్పిటల్ నుంచి ఆమెకు ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ఆమె కుటుంబం ఈసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎమ్‌సిఐ)కు కంప్లయింట్ ఇచ్చింది. మెడికల్ కౌన్సిల్ స్పందించింది. డాక్టర్ చర్యలను, హాస్పిటల్ నిర్లక్ష్య ధోరణిని తప్పుపడుతూ ఆ హాస్పిటల్‌కి లీగల్ నోటీసు జారీ చేసింది. పెద్ద భవనాలతో అధునాతనంగా కట్టిన ఆ కార్పొరేట్ వైద్యశాలకు, అందులోని డాక్టర్‌కీ ఇప్పుడైనా పేషెంట్లతో ఎలా వ్యవహరించాలనే పాఠం ఒకటుంటుందని, దానిని కూడా చదవాలనే స్పృహ కలుగుతుందో లేదో? ఇలాంటివి చూస్తుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా ఉండదా అనే ప్రశ్న మళ్లీ మళ్లీ వేసుకోవాలనిపిస్తుంది. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలియని వయసులో పరిచితుల స్పర్శలు కంపరం పుట్టిస్తాయి. చదువుకోవాలంటే టీచర్ల నుంచి, ఉద్యోగాలకు వెళ్తే పై అధికారుల నుంచి లైంగిక వేధింపులు, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడా వేధింపులు తప్పడం లేదు. ఆఖరుకి అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్లినా ఇదే తీరైతే... ఇక మహిళకు రక్షణ ఎక్కడ? ఆరోగ్యాన్ని బాగు చేసి పునర్జన్మనిచ్చిన డాక్టర్‌లో దేవుణ్ని చూస్తారు పేషెంట్‌లు. చేతులెత్తి మొక్కాలనుకుంటారు. వైద్యుడిలో దేవుడు లేకపోయినా ఫర్వాలేదు, మనిషి లేకపోతేనే కష్టం.
చట్టం ఏం చెబుతోంది?
మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్, 2002, మెడికల్ కౌన్సిల్ యాక్ట్, 1956 ప్రకారం పేషెంట్‌కి కొన్ని హక్కులుంటాయి. ఇలాంటి డాక్టర్లున్న చోట ఆ హక్కులను సాధించుకోవడానికి వెనుకాడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పేషెంట్‌లు మహిళలై, డాక్టర్ మగవారు అయితే మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తున్న ఈ హక్కుల గురించి తెలుసుకోవడం అవసరం. పేషెంట్ మత సంప్రదాయాలకు భంగం కలగని విధంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఆ మేరకు పేషెంట్ మత విశ్వాసాలను గౌరవించాలి. పేషెంట్‌కి అవసరమైన వైద్యం, అందుకు అవసరమైన పరీక్షల వివరాలను తెలియచేయాలి. దేహాన్ని ముట్టుకునేటప్పుడు ఎందుకు తాకాల్సి వస్తుందనే విషయాన్ని పేషెంట్‌కి చెప్పాలి.పేషెంట్‌ని పరీక్షించేటప్పుడు వారికి సహాయంగా వచ్చిన వారిని కూడా అనుమతించాలి. అలా ఎవరూ లేకపోతే ఎగ్జామినేషన్ గదిలో డాక్టరు, పేషెంట్‌తోపాటు మహిళానర్సు కూడా ఉండాలి. ప్రతి హాస్పిటల్‌లోనూ కంప్లయింట్స్ కమిటీ ఉండాలి. ఆ కమిటీ పేషెంట్‌ల నుంచి ఎదురైన వినతులు, విజ్ఞప్తులు, ఆరోపణలను విచారించి నిర్ణీత గడువులోపల తీర్పు చెప్పాలి. హాస్పిటల్‌లో డాక్టర్లు, ఇతర వైద్యసేవలందించే ఉద్యోగులందరికీ అప్పాయింట్‌మెంట్ లెటర్‌లో ఎంసిఐ విధి విధానాలన్నీ పొందుపరిచి ఉంటాయి. విధి నిర్వహణలో ఏ మాత్రం అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయిన వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. వైద్యసేవలను మినహాయించి మరేవిధమైన సంబంధాలను (పేషెంట్‌లతో ఫోన్‌లో మాట్లాడటం, బహుమతులివ్వడం, వారితో కలిసి భోజనం చేయడం, ట్రీట్‌మెంట్ సమయంలో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, సన్నిహితంగా మెలగడం, లైంగిక కలయిక) కొనసాగించడానికి ప్రయత్నించినా కూడా అది తప్పే.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment