మీ ఇంట్లోనే డంబ్‌బెల్ మెంటల్ జిమ్ ఉంది!
కాఫీ విత్ కరణ్ టీవి షోలో ‘‘మన రాష్ట్రపతి ఎవరు?’’ అన్న ప్రశ్నకు-
‘‘పృథ్వీరాజ్ చవాన్’’ అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది బాలివుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్.
ఇక అప్పటి నుంచి ఈ అమ్మాయి మీద సామాజిక మాధ్యమాల్లో జోక్‌లే జోకులు. ఇది తట్టుకోలేక ‘డంబ్‌బెల్ మెంటల్ జిమ్’లో చేరి తన విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసింది ఆలియా.
‘మెంటల్ జిమ్’లో రకరకాల దినపత్రికలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదవడంతో పాటు చరిత్రకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేది. ‘‘ఇప్పుడు నన్ను ఏ పశ్న అడిగినా సమాధానం చెబుతాను’’ అని ధీమాగా అంటోంది.
సరే, ఆలియా భట్ సంగతి వదిలేద్దాం. మన విషయం ఆలోచిద్దాం.
‘మనిషన్నాక కాస్త కళా పోసన ఉండాలి’ అనే డైలాగు మీకు తెలిసిందే కదా. గమనించాల్సిన విషయం ఏమిటంటే, కళాపోసన పక్కన, లోకజ్ఞానం(జనరల్ నాలెడ్జ్) కూడా ఉండాలి. యువతలో అధికశాతం..పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నప్పుడే ‘జనరల్ నాలెడ్జ్’ చదువుతారు. మిగతా సమయంలో దాంతో సంబంధం లేనట్లుగానే ఉంటారు. ఇది సరియైన విధానం కాదనే విషయాన్ని గ్రహించాలి. మన దేశానికి సంబంధించిన ఏ విషయం గురించి అడిగినా టక్కుమని చెప్పేలా ఉండాలి.
జనరల్ నాలెడ్జ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం ఆలియా భట్‌లా ‘డంబ్ బెల్ మెంటల్ జిమ్’కు వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి నుంచే విజ్ఞానాన్ని మెరుగు పర్చుకోవచ్చు.
ఇలా చేసి చూడండి: దినపత్రికలు తప్పనిసరిగా చదవాలి. ఆలా చదువుతున్న క్రమంలో ఎన్నో విషయాలు మనసులో నిక్షిప్తమైపోతాయి క్విజ్ పోటీలలో తరచుగా పాల్గొనాలి. దీని ద్వారా మనకు ఎంత తెలుసు, ఎంత తెలియదు అనేది అవగాహనలోకి వస్తుంది చరిత్ర, ఆటలు, సంస్కృతి, శాస్త్రీయం... ఇలా విభజించుకొని వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను ఒకటికి రెండుసార్లు చదవాలి జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను కొని చదువుతూ ఉండాలి జీకె మీద ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్‌తో కలిసి ‘ప్రశ్న-జవాబు’ ఆట ఆడండి. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారే విజేత ‘రోజుకు అయిదు కొత్త విషయాలు’ నేర్చుకోండి. నెలకు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.