
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జగ్ ఘూమేయా : వీడియో సాంగ్
నిడివి : 2 ని. 45 సె. హిట్స్ : 25,30,517
అతడికి ఆమెపై ఉన్నది నిజమైన ప్రేమ. లక్షల మందిలో అతడికి ఉన్నది ఆమె ఒక్కరే. అతడు సల్మాన్‌ఖాన్. ఆమె అనుష్కాశర్మ. ఆమెను గుండెల్లో నింపుకుని అతడు పాడే పాట ‘జగ్ ఘూమేయా తారే న కోయీ’. సుల్తాన్ చిత్రం లోని పాట ఇది. సినిమా రంజాన్‌కు విడుదలవుతోంది. ఈ అందమైన ప్రణయగీతాన్ని రాసింది ఇర్షాద్ కమిల్. సంగీతం విశాల్ శేఖర్. పాడింది రహత్ ఫతే అలీ ఖాన్. ‘నేను ప్రపంచమంతా తిరిగాను. కానీ నీలాటి అమ్మాయిని నేను కలవలేదు..’అనే అర్థంతో పాట సాగుతుంది. ఒక మల్లయోధుని చుట్టూ అల్లుకుని ఉండే ఈ కథలో.. మానవజన్మలోని ప్రతి భావోద్వేగమూ ప్రతిఫలిస్తుందని యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇంతకు ముందే ప్రకటించింది. అది నిజమేనని ఈ వీడియోలో సల్మాన్ కళ్లు ఒలికించే భావాలను బట్టి నిర్థారణ చేసుకోవచ్చు.
జస్టిన్ బీబర్ - కంపెనీ
నిడివి : 3 ని. 27 సె.; హిట్స్ : 1,50,90,066
ఈ ఏడాది మార్చిలో విడుదలైన కెనడా యువ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ నాలుగో స్టుడియో ఆల్బమ్ ‘పర్పస్’లోని ఈ ‘కంపెనీ’ సాంగ్ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ అయింది. బీబర్‌తో ఐదుగురు గేయ రచయితలు కలిసి కూర్చుని ఈ ఎలక్ట్రోపాప్‌కి సాహిత్యాన్ని అందించారు. కంపెనీ అంటే ఇక్కడ మ్యాజిక్ కంపెనీనో, మరొకటో కాదు. మనుషుల సాన్నిహిత్యం. ‘మన మధ్య దగ్గరితనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా...’ అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ సాంగ్, మధ్య మధ్యలో మన హృదయపు లోతుల్లోకి దిగబడి, ఆత్మీయ భావనలను జివ్వున ఎగజిమ్ముతూ... చివరికొచ్చేసరికి... ‘కారణం ఏమీ లేదు.. ఊరికే నీతో మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది.. మనం టచ్‌లో ఉన్నామా లేమా అని కాదు.. అలా అనిపిస్తుంది. ఇంతకీ మనల్ని మనం నిలబెట్టుకోగలమా..’ అనే సందేహంతో ఎండ్ అవుతుంది.
82 ఇయర్ సింగర్ షాక్స్
నిడివి : 3 ని. 25 సె.; హిట్స్ : 53,80,232
యూత్ పవర్.. యూత్ పవర్ అని ఎప్పుడూ వింటుంటాం. ఏజ్డ్ పవర్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వినాల్సిందే. జాన్ హెట్లింజర్ అనే ఈ 82 ఏళ్ల అమెరికన్ సింగర్.. ‘ది అమెరికాస్ గాట్ టాలెంట్’ (ఎ..జి.టి) వేదిక మీద తన గానాలాపనతో ఎలా ప్రేక్షకులను షాక్‌కు గురిచేశారో మీరు చూసి తీరవలసిందే. ఎ.జి.టి. అనే సంస్థ రియాలిటీ టెలివిజన్ సీరీస్‌ని షూట్ చేసి ఛానెళ్లకు ఇస్తుంటుంది. అసాధారణమైన, చిత్రవిచిత్రమైన టాలెంట్‌లను మాత్రమే వెదకి పట్టుకునే ఎ.జి.టి.కి ఈసారి హెట్లింజర్ దొరికాడు. షో ఆరంభం కాగానే వరుస ప్రశ్నలతో అతడికి విసుగెత్తించి, నీరసం తెప్పించాలని ప్రయత్నించిన న్యాయనిర్ణేతలు చివరికి వారే అలసిపోయి చెవులు మూసుకోవలసి వచ్చింది. అంతగా ఆ పెద్దాయన ఏం అదరగొట్టాడబ్బా? చిన్న క్లూ. గతంలో అతడు ఏరోస్పేస్ ఇంజినీర్. ఇప్పుడు కనిపెట్టండి. లేదంటే యూట్యూబ్‌లోకి వెళ్లి చూడండి.
కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్
నిడివి : 2 ని. హిట్స్ : 1,54,55,058
సెలీనా గోమెజ్‌ను అమితంగా ఆరాధించే అబ్బాయిలు.. సందేహంలేదు... ఈ ఆల్బమ్‌లో ఆమె చూపించే కైండ్‌నెస్‌తో.. దె కిల్ దెమ్‌సెల్వ్స్! 23 ఏళ్ల ఈ అమెరికన్ యాక్ట్రెస్ కమ్ సింగర్ తన కొత్త ఉద్వేగభరిత జీవన పోరాట గీతం ‘కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్’ను యూట్యూబ్‌కి ఎక్కించిన కొన్ని గంటలకే హిట్లు యాభై లక్షలు దాటి పోయాయి. ఇక అక్కడి నుంచి ఈ నాలుగు రోజులుగా వీక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తన రెండో స్టుడియో ఆల్బమ్ రివైవల్ కోసం సెలీనా ఈ పాటను రికార్డు చేశారు. పాప్ సంప్రదాయం ప్రకారం ఒక బృందంగా ఏర్పడిన సృజనశీలురు పాటకు అందమైన అక్షరాలను సమకూర్చారు. ‘ఈ ప్రపంచమంత దరిద్రపుకొట్టు ప్రదేశం ఇంకొటి లేదు. ఆ సంగతి నీకు తెలుసు. నాకు తెలుసు. అలాగని హృదయంలోని కారుణ్యాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేయ్. కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్’ అని చెబుతుంది సెలీనా గోమెజ్.. ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియోలో. ఆమె వదనంలోని దయాదాక్షిణ్యాలను మిస్ కాకండి. ‘వివో’ కంపెనీ దీనిని హోస్ట్ చేసింది.