‘షకలక’ శంకర్
కష్టాలను మరచిపోయేందుకు నవ్వుతూ గడిపాడు. ప్రేక్షకులను నవ్విస్తూ తన పేదరికాన్ని ఎదిరించాడు. పకపకా నవ్వాలంటే అతడి కామెడీ చూడాల్సిందే అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు.
శ్రీకాకుళం యాస విప్పితే కిలకిలా నవ్వకుండా ఉండలేం.. రాంగోపాల్‌వర్మలా అనుకరిస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే! అతడే షకలక కామెడీ శంకర్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్ ఆర్థిక స్తోమత లేక పదో తరగతికే ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చే వాడు. ఒకరోజు మంజునాథ సినిమా షూటింగ్‌లో చిరంజీవిని చూసి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుని 2002లో హైదరాబాద్ బస్సెక్కాడు. పెయింటింగ్ తప్ప ఇంకే పనీ రాదు.
హైదరాబాద్‌లో మొదట స్నేహితుల వద్ద ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనికి వెళ్లాడు. ఆ తర్వాత ప్రముఖ సినీనటి నిర్మలమ్మ వద్ద పనిచేశాడు. అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ బాయ్‌గా పని చేస్తూ సినిమాలు చూస్తూ గడిపేవాడు. రన్ రాజా రన్ దర్శకుడు అప్పట్లో తాను తీసిన షార్ట్‌ఫిలింలో ఒక అవకాశం ఇచ్చాడు.
దానిని సద్వినియోగం చేసుకున్నాడు. క్లిక్ కావడంతో వెంటనే ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి జబర్దస్త్ కామెడీషోలో అవకాశం ఇవ్వడం.. ప్రేక్షకులు ఆదరించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. తర్వాత గీతాంజలి, రన్ రాజా రన్ సినిమాల్లో నటించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ శంకర్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా షార్ట్ ఫిల్మ్ మహిమే అంటాడు శంకర్!