ఇక్కడ వేసిన గొంగడి.. | Anthra charity will develop of wool-craft Gongadi | Sakshi
Sakshi News home page

ఇక్కడ వేసిన గొంగడి..

Published Thu, Jul 31 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ఇక్కడ వేసిన  గొంగడి..

ఇక్కడ వేసిన గొంగడి..

పల్లెటూరి తాతయ్య భుజాన బాధ్యతలా కనిపించేది.. పశువులు కాసే సిన్నోడికి కవచంలా ఉండేది. తాతల జ్ఞాపకంగా మిగిలిపోయిన గొంగడిని.. ఎక్కడ వేసింది అందరం మరచిపోయాం. తెలంగాణ జనపదాల్లో అడుగడుగునా కనిపించే గొంగడి.. ప్రపంచీకరణ ఫలితంగా ప్రాభవం కోల్పోయింది. మేడ్ ఇన్ తెలంగాణగా పేరొందిన ఈ పేదోడి దుప్పటి కాల క్రమంలో తెరమరుగైంది. ఈ పరిస్థితిని మార్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘అంత్ర’ స్వచ్ఛంద సంస్థ నడుంబిగించింది. గొంగడికి పూర్వ వైభవం తీసుకొస్తోంది.
 
 గొంగడి ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో వర్గాలను కలిపే బంధం. వాటి తయారీకి కావాల్సిన ఉన్ని కోసం కొందరు గొర్రెలు పెంచేవారు. గొర్రెల నుంచి ఉన్నిని దారంగా మలిచే వారు ఇంకొందరు. ఆ దారాలను మగ్గంతో గొంగడిగా తీర్చిదిద్దేవారు మరికొందరు. ఇలా గొంగడి ఎందరికో జీవనోపాధి కల్పించేది. దీని తయారీకి మూలమైన ఉన్నిని డెక్కనీ జాతి గొర్రెల నుంచి తీసేవారు. దక్కన్ పీఠభూమి పరిధిలో మాత్రమే ఉండటంతో వీటిని డెక్కనీ గొర్రెలని పిలుస్తుంటారు. వీటి నుంచి ఏటా రెండుసార్లు సమృద్ధిగా ఉన్ని లభించేది. 1990 తర్వాత అధిక మాంసం ఉత్పత్తి కోసం డెక్కనీ జాతిని మరో జాతితో సంకరం చేయడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. కొత్తరకం గొర్రెల రాకతో ఉన్ని ఉత్పత్తి పడిపోయి.. గొంగళ్ల తయారీదారుల పరిస్థితి దారుణంగా తయారైంది.
 
 ఆదుకున్న ‘అంత్ర’..
 ‘అంత్ర’.. హైదరాబాద్ కేంద్రంగా గ్రామీణుల స్వయం సమృద్ధికి చేయూతనిచ్చే ఓ స్వచ్ఛంద సంస్థ. గొంగడికి పునరుజ్జీవం తీసుకురావాలని సంకల్పించింది. గొంగళ్లు ఎక్కువగా తయారయ్యే మెదక్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పర్యటించి ఉన్ని వేదికలు, డెక్కని గొర్రెల సంఘాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా చేయూతనివ్వడమే కాకుండా నిపుణుల సలహాలు కూడా అందించింది. పదేళ్ల అంత్ర  కృషికి ఫలితం ఇప్పుడు లభిస్తోంది. డెక్కనీ గొర్రెలతో పలు గ్రామాలు కళకళలాడుతున్నాయి. గొంగళ్ల మగ్గాలతో పల్లెలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. ఇటీవల అంత్ర సహకారంతో ఉన్ని వేదిక సభ్యులు  హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గొంగళ్ల ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. నగరవాసులెందరో గొంగళ్లను కొనుగోలు చేసి పాత జ్ఞాపకాలను పదిలంగా ఇళ్లకు మోసుకెళ్లారు.
 
 ప్రభుత్వం చేయూతనివ్వాలి..
గొంగడికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంతో కృషి చేశాం. ఇప్పుడు తెలంగాణలో 60 వేల వరకు డెక్కనీ జాతి గొర్రెలున్నాయి. హైదరాబాద్‌లో గొంగడి ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సంఘాలు స్వయం సమృద్ధి సాధిస్తుండటం ఆనందంగా ఉంది. వీరికి మరింత చేయూతనివ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే.
 - సాగరి (అంత్ర స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు)
 -  ప్రవీణ్‌కుమార్ కాసం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement