బచ్‌ఫన్.. థియేటర్ హంగామా | Bachpan theater celebrations at Hyderabad Children's Theatre Festival -2014 | Sakshi
Sakshi News home page

బచ్‌ఫన్.. థియేటర్ హంగామా

Published Fri, Oct 17 2014 12:22 AM | Last Updated on Thu, Jul 26 2018 12:41 PM

రోమియో అండ్ జూలియెట్ నాటకంలోని ఓ సన్నివేశం - Sakshi

రోమియో అండ్ జూలియెట్ నాటకంలోని ఓ సన్నివేశం

కంప్యూటర్ గేమ్స్.. కార్టూన్ చానల్స్.. ఫేస్‌బుక్ షేరింగ్స్.. నయా జమానా పోకడ ఇది. ఆటలు, పాటలున్న సినిమాలే అసలైన ఆటవిడుపనుకునే ఈ తరం.. నాటకాలనూ తెగ ఎంజాయ్ చేస్తోంది. రంగురంగుల సినిమా బొమ్మలే కాదు.. రంగస్థలం హంగులనూ చూస్తామంటోంది. లైవ్‌లో నటిస్తూ.. అలరిస్తున్న నటులను చప్పట్లతో ఎంకరేజ్ చేస్తోంది. రెండు రోజులుగా సిటీలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014కు వెళ్లి చూస్తే ఈ సీన్ కనిపిస్తోంది.
 
 నాటకం రమ్యం అని ఆనాడు కాళిదాసు చెప్పిన మాటకు వంతపాడుతున్నారు నేటి సిటీ  చిన్నారులు. సహజత్వంతో పోటీపడుతూ సాగిపోయే కళాకారుల నటన ఈ తరాన్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. అందుకే గంట, గంటన్నర నిడివి ఉండే నాటకాలకు గ్రాండ్ సలామ్ చెబుతున్నారు పిల్లలు. డ్రామా ఆర్టిస్టుల హాస్యం.. చిన్నారుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఇన్నాళ్లూ మిస్సయిన ఆనందం ఏంటో పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే డ్రామా పూర్తయ్యే వరకూ కన్నార్పకుండా చూసి  సంబరపడిపోతున్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్-2014 అటు పిల్లలను.. ఇటు పెద్దలను అలరిస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌లో ఇప్పటికే ముంబైకి చెందిన హబీజబీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ‘ఈట్’, బెంగళూరుకు చెందిన తహట్టో వారి ‘రోమియో అండ్ జూలియట్’ డ్రామాలు ఆకట్టుకున్నాయి.
 
 విజ్ఞానం కావాలంటే కంప్యూటర్‌లో కావాల్సినంత దొరుకుతుంది. కానీ సామాజిక అవగాహన నాటకాల ద్వారానే కలుగుతుందంటున్నారు తల్లిదండ్రులు. అందుకే తమ పిల్లలకు దగ్గరుండి మరీ నాటకాలు చూపిస్తున్నారు. నగరంలో పిల్లలకు సంబంధించిన రంగస్థల నాటకాలు ఎక్కడ జరిగినా అక్కడికి తీసుకెళుతున్నారు. ఉద్యోగంతో ఎప్పుడు బిజీగా ఉండే నగరవాసులు పిల్లలతో పాటు డ్రామాలకు వెళ్లి రిలాక్స్ అవుతున్నారు.
 
 పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది
 ప్రస్తుత ఆధునిక సమాజంలో కనుమరుగవుతున్న రంగస్థల నాటకాల ప్రాముఖ్యాన్ని తెలియజేసేందుకే నగరంలో ‘హైదరాబాద్ థియేటర్ ఫెస్టివల్’ ప్రారంభించాం. ఐదేళ్ల నుంచి ‘థియేటర్’కు క్రేజ్ పెంచే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు అనుగుణంగా సిటీలో నాటకాలపై తల్లిదండ్రులతో పాటు పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది.
 - వైశాలి, ఫౌండర్, వైశాలి బిస్ట్స్ థియేటర్ వర్క్‌షాప్
 
 సిటీలో మంచి క్రేజ్ ఉంది
 ‘బెంగళూరులోనూ థియేటర్‌కు మంచి ఆదరణ పెరుగుతోంది.
 హైదరాబాద్ వేదికగా రోమియో అండ్ జూలియెట్ పాత్రలో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నాం. మేం చేసిన నటనకు
 హైదరాబాదీలు ఇచ్చిన ప్రోత్సాహం అద్భుతం. ఈ ఫెస్ట్‌కు వచ్చే
 వారిని చూస్తే రానురాను ఈ సిటీ నుంచి కూడా మంచి థియేటరీ
 ఆర్టిస్ట్‌లు తెరపైకి వస్తారనుకుంటున్నామ’ని బెంగళూరుకు చెందిన ప్రశాంత్ నాయర్, కళ్యాణి నాయర్ తెలిపారు.
 
 ఇది మూడోసారి...
 ప్రత్యక్షంగా నాటక ప్రదర్శన చూడటం ఇది మూడోసారి. అమ్మ వల్లే మంచి వినోదం కలిగిన నాటకాలను చూడగలిగా. అనేక విషయాలు తెలుసుకోగలిగా. భవిష్యత్‌లోనూ నేను కూడా ఇలాంటి పాత్రలు పోషించాలనుకుంటున్నా.  
 -క్రిశాంతిని, గీతాంజలి పాఠశాల, బేగంపేట
 
 సందేశం.. వినోదం..
 ఇతర నగరాలకు చెందిన కళాకారులు ఇక్కడ వేస్తున్న రంగస్థల నాటకాలు పిల్లలను ఆలోచింపజేస్తున్నాయి. అర్థవంతమైన ప్రదర్శనతో మంచి సందేశం, వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ డ్రామాల వల్ల పిల్లలకు ప్రేమానురాగాలు, సమాజంలో ఎలా ఉండాలనే దానిపై క్లారిటీ వస్తుంది.
 -శిరీష, గృహిణి, ఎస్‌ఆర్ నగర్
 
 ‘సురభి’ మాయాబజార్ నేడు
 హైదరాబాద్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్‌లో తొలిసారిగా తెలుగు రంగస్థల నాటికను ప్రదర్శించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30కి శిల్పకళా వేదిక (మాదాపూర్)లో ‘సురభి’
 ఆధ్వర్యంలో ‘మాయాబజార్’ నాటకం ప్రదర్శిస్తున్నారు.
 - వాంకె శ్రీనివాస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement