
న్యూయార్క్: రోజూ ఓ అరటిపండు, అవకాడో తీసుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు. ఇవి గుండె ధమనులు పెళుసుబారడాన్ని నిరోధించి గుండె జబ్బులు, అకాల మరణాల ముప్పును తగ్గిస్తాయని వెల్లడైంది. ఎలుకలపై ఈ ఆహారాన్ని పరీక్షించి చూడగా పొటాషియం సమృద్ధిగా ఉన్న ఈ ఆహారంతో గుండె, కిడ్నీ జబ్బులకు దారితీసే కాల్షియం నిల్వలు పేరుకుపోవడాన్ని ఇది తగ్గించినట్టు ఈ అథ్యయనంలో వెల్లడైంది. శరీర కణాల్లో, రక్తం ఇతర అవయవాల్లో కాల్షియం పేరుకుపోతే అది పలు ముప్పులకు కారణమవుతుంది.శరీర సాధారణ క్రియలను అస్తవ్యస్తం చేసి శరీరాన్ని రోగాలకు నిలయం చేస్తుంది.
అరటి పండు, అవకాడోల్లో సమృద్ధిగా ఉండే పొటాషియం పలు కార్డియోవాస్కులర్ ముప్పు కారకాలనూ తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగంలోశరీరంలో పేరుకుపోయే కాల్షియం నిల్వలను పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారం గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడైందని, తక్కువ పొటాషియం తీసుకోవడం ఎంతటి హాని కలిగిస్తుందో కూడా తేలిందని అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ శాండర్స్ చెప్పారు.
తమ పరిశోధనలో భాగంగా ఎలుకకు అధిక పొటాషియం, తక్కువ పొటాషియం ఉన్న ఆహారాలను ఇవ్వగా అధిక పొటాషియం తీసుకున్న సందర్భాల్లో ఎలుక ధమనులు గట్టిబారలేదని, తక్కువ పొటాషియం తీసుకున్నప్పుడు దాని ధమనులు పెళుసుబారాయని పరిశోధకులు తెలిపారు. ఈ అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ఆయా గుండె జబ్బుల నియంత్రణలో సానుకూల ఫలితాలకు దారితీస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment