టిఫినీలు చేశారా.. స్పూన్‌లు తిన్నారా..
ఒక ఆలోచన మన జీవితాన్నే మార్చేయొచ్చు.. ఇతరులకు ప్రేరణగా నిలవొచ్చు.. సమాజానికి మేలూ చేయొచ్చు! పీసపాటి నారాయణరావుకి వచ్చిన ఆలోచన ఆయన జీవితాన్ని ఎంతవరకు మార్చిందో తెలియదు కానీ ఇతరులకు ప్రేరణ.. సమాజానికి మేలు చేస్తోంది! ఆ ఐడియా.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ తయారు చేయడం. దీనికి.. సమాజహితానికి సంబంధం ఏంటో తెలుసుకునే ముందు ఆయన గురించి చిన్న పరిచయం..
- సరస్వతి రమ
నారాయణరావు పూర్వాశ్రమంలో సైంటిస్ట్. కోల్‌కతాలో పుట్టిపెరిగిన తెలుగు వ్యక్తి. బరోడాలో పన్నెండేళ్లు పనిచేశాక హైదరాబాద్ ఇక్రిశాట్‌కు బదిలీ అయ్యాడు. ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో కొలువు. అక్కడ తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం దొరుకుతుందని ఆశపడ్డాడు. అదే ఉత్సాహంతో గ్రౌండ్ వాటర్ డిప్లెషన్ మీద పరిశోధన చేశాడు. నేలలో నీటి నిల్వలు తగ్గుతున్నాయనగానే వర్షాభావం అనే సమాధానమే దొరుకుతుంది. కానీ, నారాయణరావు పరిశోధనల్లో మూడేళ్ల సగటు వర్షపాతం ఏమాత్రం తగ్గలేదు. సాగుభూమి పెరిగింది.
ఈ లెక్కన జీడీపీలో వ్యవసాయం భాగస్వామ్యం కూడా పెరిగుండాలి, కానీ పెరగలేదు. అదే టైంలో రైతుల సంఖ్య తగ్గింది. ఈ రీసెర్చ్, రిజల్ట్స్ ఆధారంగా గ్రౌండ్ వాటర్ ఎస్టిమేషన్ మోడల్‌ని తయారు చేశాడు. నీటి నిల్వలు అడుగంటడానికి కారణమూ కనుక్కున్నాడు.. ‘8’ ఆకారంలో ఉన్న రెండు విషస్ సర్కిల్స్ అని. ఒకటి.. రైతులు మితిమీరిన కరెంటును వాడుకోవడం.. రెండు మితిమీరిన నీటిని ఉపయోగించడం. వీటిని సరిచేయాలంటే ఇనెఫిషియెంట్ ఇరిగేషన్ సిస్టమ్‌ను, ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్‌ను కరెక్ట్
చేసుకోవాలి. ఈ దిశగా పనిచేయడానికి ఉద్యోగ పరిమితులు అడ్డొచ్చాయి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని వేచి చూడకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇదీ ఆయన పరిచయం.. జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ ఆలోచనకు ముందు విషయం!
ఆలోచనకు కారణమైన సంఘటన..
రాజీనామా చేశాక ఇనెఫీషియెంట్ క్రాపింగ్ చాయిసెస్‌ను కరెక్ట్ చేసే ప్రయత్నంలో ఉండగా జొన్నపంట.. దానితో ఉన్న ఆరోగ్య లాభాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. ఎకరా వరికి సరిపోయే నీటితో 60 ఎకరాల జొన్నపంటను పండించొచ్చు. అంటే ఆరుతడి పంటలతో నీటి నిల్వలనూ పెంచొచ్చు. పూర్‌మెన్ క్రాప్‌గా జొన్నకున్న అపవాదునూ పడగొట్టి దాని డిమాండ్ పెంచాలనుకున్నాడు నారాయణ. ఆ టైమ్‌లోనే అతను దేశంలోని చాలా ప్రాంతాల్లో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్లేవాడు.
ఇదంతా 2004 నాటి సంగతి. ప్లాస్టిక్ వాడకం మీద అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సెమినార్ ముగించుకుని ఫ్లయిట్‌లో హైదరాబాద్ వస్తున్నాడు. అంతకుముందు సెమినార్‌లో మాట్లాడిన విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకం ఇంతలా పెరిగిపోయింది కదా.. ఎన్ని టన్నుల ప్లాస్టిక్ గార్బేజ్ తయారై ఉంటుందో! రైల్వేట్రాక్స్‌కి రెండు వైపులా పేరుకున్న ప్లాస్టిక్ గార్బేజ్ గుర్తొచ్చింది.
హైదరాబాద్ వచ్చాక విద్యానగర్‌లోని తనింటి దగ్గరున్న చాట్ భండార్‌కెళ్లాడు. చాట్ తినడానికి అన్నీ ప్లాస్టిక్ స్పూన్సే. పక్కనే చెత్తకుండీ ఉంది. ఈ భండార్‌లో వాడిన ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ ఈ చెత్తకుండీలో ఉండాలి కదా అని పక్కనే ఉన్న చెత్త ఏరుకునే మనిషిని అందులో స్పూన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడమన్నాడు. విరిగినవి తప్ప దొరకలేదు. అంటే అవన్నీ రీయూజ్ అవుతున్నాయన్నమాట. దిగ్భ్రాంతి కలిగింది నారాయణకు. అప్పుడు ఎప్పుడో అనుకున్న జొన్న పంటకు.. ప్లాస్టిక్‌కు ఒక లింక్ కుదిరినట్టనిపించింది.
బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్
అలా సింక్రనైజ్ అయిన ఆలోచనే ‘బేకీస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్’గా రూపొందింది. ఆరోగ్యకరమైన జొన్నపంట డిమాండ్ పెంచాలి. విషతుల్యమైన ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అందుకే జొన్నలను ప్లాస్టిక్‌కు అల్టర్‌నేటివ్‌గా మార్చుకున్నాడాయన. ఆ ధాన్యం పిండితో తయారైన బిస్కట్స్‌ను చెంచాల రూపంలో తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ పరిశ్రమలోకి ఆయన
అడుగుపెట్టి ఏడేళ్లు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్థికంగా కూడా. ఉన్న ఇంటినీ అందులోనే పెట్టాడు. ఈ తపనంతా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. మొదట్లో ఈ చెంచాలు ఎవరినీ ఆకట్టుకోలేదు. కస్టమర్ల రుచి, అభిరుచి, ఉపయోగానికి అనుగుణంగా వీటిని
మారుస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు..
జొన్న, రాగులు వంటి వాటి మీద జనాలకు అవగాహన పెరిగింది. ఇదివరకన్నా కాస్త డిమాండ్ ఉంది. ఈ బిస్కట్ చెంచాల ఉపయోగమూ ఊపందుకుంది. అందుకే ఇప్పుడు ఫోర్క్స్, డెజర్ట్ స్పూన్స్, లంచ్ స్పూన్స్, చాప్‌స్టిక్స్ తయారు చేస్తున్నాడు నారాయణ. ‘వీటిని ఉపయోగించి ఐస్‌క్రీమ్ కోన్స్‌లా తినేయొచ్చు. ప్లెయిన్, మసాలా, స్వీట్.. అనే మూడు ఫ్లేవర్స్‌లో ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్‌ని తయారు చేస్తున్నాం. ఉట్టి నుంచి కాటిదాకా అనే సామెతుంటుంది మన దగ్గర. నేను జొన్నలను వూంబ్ నుంచి గ్రేవ్ దాకా అని అభివర్ణిస్తాను. ఇందులోని పోషక విలువలు ప్రెగ్నెంట్ విమెన్‌కి చాలా మంచివి. ఈ జొన్నపిండి బిస్కట్ స్పూన్స్ పళ్లొచ్చే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జొన్నల్లోని ఫోలిక్ యాసిడ్స్ టీనేజర్స్‌లో కలిగే హార్మోనల్ ఇన్‌బాలెన్స్‌ను కరెక్ట్ చేస్తాయి. చిన్నప్పటినుంచి జొన్నలు తినడం వల్ల మధుమేహం రాదు.
కొలెస్ట్రాల్‌కు విరుగుడు. మరెన్నో లాభాలున్న ఈ జొన్నప్రొడక్ట్స్‌కు ఇంకా డిమాండ్ పెరగాలి. మార్కెటింగ్ జరగాలి. రైల్వేస్ వాళ్ల కేటరింగ్‌లో వీటిని వాడేలా చేయాలి. ఇప్పుడు నా లక్ష్యం అదే. ఈ పరిశ్రమ అభివృద్ధికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడిప్పుడు మార్కెట్ కాస్త స్పందిస్తోంది. నేను చేస్తున్న పని రైతుకు ఆదాయం పెంచేది. ప్రపంచానికి చాలా అవసరం’అంటాడు నారాయణ. ఇన్ని ఉపయోగాలున్న ఈ బిస్కట్ స్పూన్ విలువ ఎంతో తెలుసా.. కేవలం మూడు రూపాయలే!