ఓటుకు బిర్యానీ, బీరు!
మద్యం, డబ్బు ఎర వేసి ఓటర్లను ప్రభావితం చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారి చాలా కాలమయింది. సాధారణ ఎన్నికల నుంచి స్టూడెంట్ ఎలక్షన్స్ వరకు ఇది పాకింది. పవర్ పాలిటిక్స్లో ఆధిపత్యం చెలాయించేందుకు రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను అన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గెలుపు కోసం నానాగడ్డీ కరుస్తున్నారు. విద్యార్థి ఎన్నికలకూ ఈ రోగం అంటుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(యూఓహెచ్) విద్యార్థి ఎన్నికలు నేడు(అక్టోబర్ 30) జరిగాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రాబందులు క్యాంపస్లో వాలిపోయాయి. బిర్యానీ, బీర్ సీసాలు ఎర వేసి విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. రాత్రి విందులు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికెట్, మటన్ బిర్యానీ ప్యాకెట్లు పోటాపోటీగా పంచాయి. అలాగే తాము మద్దతిచ్చే వారికి ఓటు వేసేందుకు స్టూడెంట్స్కు లెక్కకు మిక్కిలి బీరు సీసాలు ఆఫర్ చేశారు.
యూఓహెచ్లో విద్యార్థి ఎన్నికలు కొత్తేం కాదు. తమకు ఓటు వేయమని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడం గతంలోనూ జరిగింది. అయితే ఈసారి రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడంతో ఎన్నికల ముఖ'చిత్రం' మొత్తం మారిపోయింది. ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లో పదుల సంఖ్యలో జరిగిన విందులే ఇందుకు నిదర్శనం. కొత్తగా క్యాంపస్లో అడుగుపెట్టిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రలోభాల పర్వం కొనసాగింది. ప్రచారానికి, ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో అభ్యర్థి రూ. 50 వేలు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ప్రధాన రాజకీయ పార్టీలు తమ విద్యార్థి విభాగాలకు చెందిన వారు పోటీ చేసేందుకు రూ. 4 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. లింగ్డో కమిటీ ప్రతిపాదనల ప్రకారం విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన ప్రచారానికి రూ. 5 వేలు మించి ఖర్చు చేయరాదు. కొంత అభ్యర్థులు తమ మేనిఫెస్టోతో 20 వేల కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు విద్యార్థి ఎన్నికలను వదల్లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విద్యార్థులు విజ్ఞతతో వ్యవహరిస్తేనే ఇటువంటి రాజకీయ పార్టీలు తోక ముడిచేది.