Student Elections
-
ఓటెత్తిన బాలలు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : ఓటుహక్కు వినియోగించేందుకు బారులు తీరారు. ఓటర్ల జాబితా చూసి ఎన్నికల అధికారి ఓట్లు అందించారు. బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయడంతో ప్రక్రియ ముగిసింది.. ఇటీవలే ఎన్నికలు ముగిశాక.. మళ్లీ ఈ ఎన్నికలేమిటా?.. అనుకుంటున్నారు కదూ.. ఇవి సార్వత్రిక ఎన్నికలు కావు.. వాటిని తలపించేలా నిర్వహించిన విద్యార్థి నాయకుని ఎన్నికలు. తెర్లాం మండలం నందబలగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు శుక్రవారం హెచ్ఎం విజయభాస్కర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎన్నికలను నిర్వహించారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగానే నందబలగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థి నాయకున్ని ఎన్నుకొనేందుకు ఎన్నికలు జరిగాయి. ప్రతి తరగతి నుంచి ఒకరిని, పాఠశాలకు సంబంధించి ఒక నాయకుడిని ఎన్నుకొనేందుకు సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేయించడం, నామినేషన్ల ఉప సంహరణ, ఓటర్ల జాబితా (హాజరు రిజిస్టర్)ల ప్రచురణ, అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం, బ్యాలెట్ పేపరు తయారు, బెండకాయ మార్క్‌తో అభ్యర్థుల గుర్తుపై బ్యాలెట్‌పై ఓటుముద్ర వేయడం వంటి ప్రక్రియలన్నీ విద్యార్థులతో చేయించారు. ఇదంతా పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల మాదిరిగా నిర్వహించడంతో విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ తరగతి, పాఠశాల నాయకులను ఎన్నుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత ఓట్లను లెక్కించి విజేతల వివరాలు ప్రకటించి, విద్యార్థి నాయకులతో ప్రమాణం చేయిస్తామని పాఠశాల హెచ్ఎం విజయభాస్కర్ తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు వేయడం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఏటా తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఇదే పద్ధతిలో ఎన్నుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులంతా తమ సహకారం అందిస్తున్నారని హెచ్ఎం తెలిపారు. -
‘ప్రాక్టికల్’ ప్రాబ్లమ్స్
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట జూనియర్ కళాశాలలో రూ.22 వేల విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారం రోజుల క్రితమే కళాశాలలో కరెంట్ తొలగించారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్షలు నిర్వహించాలంటే కరెంట్, నీటి వసతి తప్పనిసరి. అలాగే ప్రాక్టికల్ ప్రశ్నా పత్రాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ కరెంట్ లేకపోవడంతో ప్రశ్నా పత్రాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు అదే రోజు ఆన్లైన్ చేయాలన్నా విద్యుత్ సౌకర్యం తప్పనిసరి. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో కరెంట్, నీటి సమస్యలతోపాటు సరిపడా ల్యాబ్ గదులు, ఫర్నిచర్ లేక ప్రాక్టికల్స్ అయిపోయాయనిపిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సాధించే మార్కులు విద్యార్థుల మెరిట్‌కు దోహదపడతాయి. ప్రయోగాలు.. పరిశోధనకు మూలాలు. శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధితోనే వైజ్ఞానిక విప్లవం సాధించవచ్చు. ప్రపంచ పరిణామాలను మార్చవచ్చు. అందుకే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాత్మక విద్య అందిస్తున్నారు. కానీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలతో ప్రయోగాలు నామమాత్రంగా మారుతున్నాయి. పరిపూర్ణత లేని ప్రయోగాలతో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు నాలుగు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2నుంచి 5గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 20మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల్లో పాల్గొంటారు. దీనికనుగుణంగా మెదక్ జిల్లా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో జనరల్ విద్యార్థులు–2651, ఒకేషనల్ విద్యార్థులు–1121 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు, 7 ఆదర్శ కళాశాలలు, 2 టీఎస్‌ఆర్‌జేఎస్, 2 సోషల్ వెల్ఫేర్, 2 ట్రైబల్ వెల్ఫేర్, 3 కస్తూర్బా, 23 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ రోజు పరీక్షకు అరగంట ముందు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి పరీక్ష పత్రాలు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ ద్వారా ప్రశ్నా పత్రాన్ని ఎగ్జామినర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని నోడల్ అధికారి సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. అలాగే విద్యార్థులు సాధించిన మార్కులు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సమస్యల ఒడిలో ప్రాక్టికల్ పరీక్షలు.. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరిపడా ల్యాబ్ గదులు లేక ఆరుబయట వరండాల్లో ప్రయోగాలు అయిపోయానిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాపన్నపేట జూనియర్ కళాశాలలో కరెంట్ బిల్ బకాయి పడటంతో కనెక్షన్ తొలగించారు. దీంతో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రం డౌన్లోడ్ చేసుకోవడం, మార్కులను పంపించడం ఎలా అంటూ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్‌కు నీటి సౌకర్యం తప్పనిసరి. కానీ కరెంట్ లేకపోవడంతో నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాలుగు ప్రాక్టికల్ గదులు లేక మూడింటిలోనే నాలుగు ల్యాబ్‌లు నడిపిస్తున్నారు. అల్లాదుర్గంలో జూనియర్ కళాశాలకు ప్రత్యేక భవనం లేక హైస్కూల్లోనే షిఫ్టింగ్ పద్ధలో కొనసాగిస్తున్నారు. దీంతో మొక్కుబడి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. రెండేళ్లవుతున్నా సొంత భవన నిర్మాణం పూర్తి కావడం లేదు. అలాగే మెదక్ బాలికల జూనియర్ కళాశాలలో సైతం హైస్కూల్, ఇంటర్మీడియెట్ తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా అ దే పరిస్థితి నెలకొంది. ఇలా పలు కళాశాలల్లో ల్యా బ్‌లకు సరిపడా ఫర్నిచర్, సౌకర్యాలు లేక సైన్స్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్లను నియమించాం. పర్యవేక్షణకు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ముగ్గురు జిల్లా పరీక్షల సభ్యులు ఉంటారు. పాపన్నపేటలో విద్యు™త్ సౌకర్యం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – సూర్యప్రకాశ్, నోడల్ అధికారి కరెంట్ లేకుంటే పరీక్షలు ఎలా? మా కళాశాలలో వారం రోజలు క్రితమే కరెంట్ తొలగించారు. దీంతో కళాశాలలో బోరు నడవక తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్‌లో నీరు తప్పనిసరి. అలాగే ఫ్యాన్లు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఒకే గదిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ నడిపిస్తున్నారు. దీంతో సౌకర్యంగా లేదు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే పరీక్షలు మంచి వాతావరణంలో రాయగలుగుతాం. – ఆసీఫ్బాబా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
జేఎన్‌యూ ఓట్ల లెక్కింపు వాయిదా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం వాయిదా పడి రాత్రి మళ్లీ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించారనీ, అందుకే లెక్కింపు ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల నిర్వహణ విభాగం తెలిపింది. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వనేలేదనీ, తమ ఏజెంట్ లేకుండానే బ్యాలెట్ పెట్టెల సీల్ తెరవడంతోపాటు ఆ తర్వాతా తమ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. శనివారం రాత్రికి ఓట్ల లెక్కింపు పునఃప్రారంభం కావడంతో ఆదివారానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. -
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్‌ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్ఎస్యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే. -
'మనూ'లో విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదా
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో గురువారం జరగాల్సిన విద్యార్థి సంఘ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ఆఫీసర్లతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్ననేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రధానంగా వర్శిటీ ప్రొక్టర్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ వాహెద్ రాజీనామా చేయడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిసింది. మరో వైపు గురువారం జరగాల్సిన పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించం కుదరదని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఓటుకు బిర్యానీ, బీరు!
మద్యం, డబ్బు ఎర వేసి ఓటర్లను ప్రభావితం చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారి చాలా కాలమయింది. సాధారణ ఎన్నికల నుంచి స్టూడెంట్ ఎలక్షన్స్ వరకు ఇది పాకింది. పవర్ పాలిటిక్స్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు రాజకీయ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను అన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గెలుపు కోసం నానాగడ్డీ కరుస్తున్నారు. విద్యార్థి ఎన్నికలకూ ఈ రోగం అంటుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(యూఓహెచ్) విద్యార్థి ఎన్నికలు నేడు(అక్టోబర్ 30) జరిగాయి. ఈ నేపథ్యంలో రాజకీయ రాబందులు క్యాంపస్‌లో వాలిపోయాయి. బిర్యానీ, బీర్ సీసాలు ఎర వేసి విద్యార్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయి. రాత్రి విందులు ఏర్పాటు చేసి విద్యార్థులకు చికెట్, మటన్ బిర్యానీ ప్యాకెట్లు పోటాపోటీగా పంచాయి. అలాగే తాము మద్దతిచ్చే వారికి ఓటు వేసేందుకు స్టూడెంట్స్‌కు లెక్కకు మిక్కిలి బీరు సీసాలు ఆఫర్ చేశారు. యూఓహెచ్‌లో విద్యార్థి ఎన్నికలు కొత్తేం కాదు. తమకు ఓటు వేయమని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించడం గతంలోనూ జరిగింది. అయితే ఈసారి రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడంతో ఎన్నికల ముఖ'చిత్రం' మొత్తం మారిపోయింది. ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లో పదుల సంఖ్యలో జరిగిన విందులే ఇందుకు నిదర్శనం. కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆ ప్రలోభాల పర్వం కొనసాగింది. ప్రచారానికి, ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో అభ్యర్థి రూ. 50 వేలు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విద్యార్థి విభాగాలకు చెందిన వారు పోటీ చేసేందుకు రూ. 4 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. లింగ్డో కమిటీ ప్రతిపాదనల ప్రకారం విద్యార్థి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన ప్రచారానికి రూ. 5 వేలు మించి ఖర్చు చేయరాదు. కొంత అభ్యర్థులు తమ మేనిఫెస్టోతో 20 వేల కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ పార్టీలు విద్యార్థి ఎన్నికలను వదల్లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విద్యార్థులు విజ్ఞతతో వ్యవహరిస్తేనే ఇటువంటి రాజకీయ పార్టీలు తోక ముడిచేది.