‘ప్రాక్టికల్‌’ ప్రాబ్లమ్స్‌ | Telangana Intermediate Practicals Examinations Problems | Sakshi
Sakshi News home page

‘ప్రాక్టికల్‌’ ప్రాబ్లమ్స్‌

Published Thu, Jan 31 2019 12:40 PM | Last Updated on Thu, Jan 31 2019 12:40 PM

Telangana Intermediate Practicals Examinations Problems - Sakshi

పాపన్నపేట(మెదక్‌): పాపన్నపేట జూనియర్‌ కళాశాలలో రూ.22 వేల విద్యుత్‌ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారం రోజుల క్రితమే కళాశాలలో కరెంట్‌ తొలగించారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్షలు నిర్వహించాలంటే కరెంట్, నీటి వసతి తప్పనిసరి. అలాగే ప్రాక్టికల్‌ ప్రశ్నా పత్రాలు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ కరెంట్‌ లేకపోవడంతో ప్రశ్నా పత్రాలు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అలాగే పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు అదే రోజు ఆన్‌లైన్‌ చేయాలన్నా విద్యుత్‌ సౌకర్యం తప్పనిసరి. జిల్లాలోని పలు జూనియర్‌ కళాశాలల్లో కరెంట్, నీటి సమస్యలతోపాటు సరిపడా ల్యాబ్‌ గదులు, ఫర్నిచర్‌ లేక ప్రాక్టికల్స్‌ అయిపోయాయనిపిస్తున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల్లో సాధించే మార్కులు విద్యార్థుల మెరిట్‌కు దోహదపడతాయి. ప్రయోగాలు.. పరిశోధనకు మూలాలు. శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధితోనే వైజ్ఞానిక విప్లవం సాధించవచ్చు. ప్రపంచ పరిణామాలను మార్చవచ్చు. అందుకే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాత్మక విద్య అందిస్తున్నారు. కానీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలతో ప్రయోగాలు నామమాత్రంగా మారుతున్నాయి. పరిపూర్ణత లేని ప్రయోగాలతో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ విద్యార్థులకు నాలుగు విడతల్లో ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2నుంచి 5గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 20మంది విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షల్లో పాల్గొంటారు. దీనికనుగుణంగా మెదక్‌ జిల్లా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో జనరల్‌ విద్యార్థులు–2651, ఒకేషనల్‌ విద్యార్థులు–1121 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు, 7 ఆదర్శ కళాశాలలు, 2 టీఎస్‌ఆర్‌జేఎస్,  2 సోషల్‌ వెల్ఫేర్, 2 ట్రైబల్‌ వెల్ఫేర్, 3 కస్తూర్బా, 23 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ రోజు పరీక్షకు అరగంట ముందు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి పరీక్ష పత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ప్రశ్నా పత్రాన్ని ఎగ్జామినర్‌ మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని నోడల్‌ అధికారి సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. అలాగే విద్యార్థులు సాధించిన మార్కులు ఇంటర్‌ బోర్డుకు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.

సమస్యల ఒడిలో ప్రాక్టికల్‌ పరీక్షలు.. 
జిల్లాలోని పలు జూనియర్‌ కళాశాలల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరిపడా ల్యాబ్‌ గదులు లేక ఆరుబయట వరండాల్లో ప్రయోగాలు అయిపోయానిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాపన్నపేట జూనియర్‌ కళాశాలలో కరెంట్‌ బిల్‌ బకాయి పడటంతో కనెక్షన్‌ తొలగించారు. దీంతో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రం డౌన్‌లోడ్‌ చేసుకోవడం, మార్కులను పంపించడం ఎలా అంటూ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్‌కు నీటి సౌకర్యం తప్పనిసరి. కానీ కరెంట్‌ లేకపోవడంతో నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాలుగు ప్రాక్టికల్‌ గదులు లేక మూడింటిలోనే నాలుగు ల్యాబ్‌లు నడిపిస్తున్నారు.

అల్లాదుర్గంలో జూనియర్‌ కళాశాలకు ప్రత్యేక భవనం లేక హైస్కూల్‌లోనే షిఫ్టింగ్‌ పద్ధలో కొనసాగిస్తున్నారు. దీంతో మొక్కుబడి ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. రెండేళ్లవుతున్నా సొంత భవన నిర్మాణం పూర్తి కావడం లేదు. అలాగే మెదక్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో సైతం హైస్కూల్, ఇంటర్మీడియెట్‌ తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా అ దే పరిస్థితి నెలకొంది. ఇలా పలు కళాశాలల్లో ల్యా బ్‌లకు సరిపడా ఫర్నిచర్, సౌకర్యాలు లేక సైన్స్‌ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం
ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, ఎగ్జామినర్లను నియమించాం. పర్యవేక్షణకు ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ముగ్గురు జిల్లా పరీక్షల సభ్యులు ఉంటారు. పాపన్నపేటలో విద్యు™త్‌ సౌకర్యం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – సూర్యప్రకాశ్, నోడల్‌ అధికారి
 
కరెంట్‌ లేకుంటే పరీక్షలు ఎలా? 

మా కళాశాలలో వారం రోజలు క్రితమే కరెంట్‌ తొలగించారు. దీంతో కళాశాలలో బోరు నడవక తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్‌లో నీరు తప్పనిసరి. అలాగే ఫ్యాన్లు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఒకే గదిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ నడిపిస్తున్నారు. దీంతో సౌకర్యంగా లేదు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే పరీక్షలు మంచి వాతావరణంలో రాయగలుగుతాం. – ఆసీఫ్‌బాబా, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement