Intermediate Practicals
-
నేటి నుంచి ప్రాక్టికల్స్
బూర్గంపాడు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 1 నుంచి 20 వరకు నాలుగు విడతలుగా ఈ పరీక్షలు జరగ నున్నాయి. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగంతో ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల కళాశాలల్లో చదువుతున్న 8వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 60 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభకానున్న ప్రాక్టికల్ పరీక్షలు రోజుకు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే కేంద్రాల్లో (ప్రయోగశాలల్లో) ఉండాలి. 9 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1.30 గంటలకే పరీక్షా కేంద్రాల్లో ఉండాలని సూచించారు. ఉదయం జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉదయం 8.30 గంటలకే ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అందులో వచ్చిన ప్రాక్టికల్నే విద్యార్థులు చేయాల్సి ఉంటుంది. ఈ సారి ఎలాంటి ఆప్షన్స్ ఉండవని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నాపత్రంలో మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలను అన్లైన్లో ఇంటర్ బోర్డుకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేశాం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాలో 60 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నాం. 8వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. ప్రశ్నపత్రం ఆన్లైన్లో అరగంట ముందుగానే వస్తుంది. ఆ ప్రశ్నపత్రాన్నే విద్యార్థులు చేయాల్సి ఉంటుంది. – సయ్యద్ జహీర్ అహ్మద్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి -
‘ప్రాక్టికల్’ ప్రాబ్లమ్స్
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట జూనియర్ కళాశాలలో రూ.22 వేల విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారం రోజుల క్రితమే కళాశాలలో కరెంట్ తొలగించారు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్షలు నిర్వహించాలంటే కరెంట్, నీటి వసతి తప్పనిసరి. అలాగే ప్రాక్టికల్ ప్రశ్నా పత్రాలు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే పరీక్షలు ప్రారంభమవుతాయి. కానీ ఇక్కడ కరెంట్ లేకపోవడంతో ప్రశ్నా పత్రాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులు అదే రోజు ఆన్లైన్ చేయాలన్నా విద్యుత్ సౌకర్యం తప్పనిసరి. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో కరెంట్, నీటి సమస్యలతోపాటు సరిపడా ల్యాబ్ గదులు, ఫర్నిచర్ లేక ప్రాక్టికల్స్ అయిపోయాయనిపిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో సాధించే మార్కులు విద్యార్థుల మెరిట్‌కు దోహదపడతాయి. ప్రయోగాలు.. పరిశోధనకు మూలాలు. శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధితోనే వైజ్ఞానిక విప్లవం సాధించవచ్చు. ప్రపంచ పరిణామాలను మార్చవచ్చు. అందుకే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాత్మక విద్య అందిస్తున్నారు. కానీ కళాశాలల్లో నెలకొన్న సమస్యలతో ప్రయోగాలు నామమాత్రంగా మారుతున్నాయి. పరిపూర్ణత లేని ప్రయోగాలతో ఉత్తమ ఫలితాలు ఎలా సాధించాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు నాలుగు విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2నుంచి 5గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌కు 20మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షల్లో పాల్గొంటారు. దీనికనుగుణంగా మెదక్ జిల్లా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో జనరల్ విద్యార్థులు–2651, ఒకేషనల్ విద్యార్థులు–1121 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 16 ప్రభుత్వ కళాశాలలు, 7 ఆదర్శ కళాశాలలు, 2 టీఎస్‌ఆర్‌జేఎస్, 2 సోషల్ వెల్ఫేర్, 2 ట్రైబల్ వెల్ఫేర్, 3 కస్తూర్బా, 23 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రతీ రోజు పరీక్షకు అరగంట ముందు ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి పరీక్ష పత్రాలు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ ద్వారా ప్రశ్నా పత్రాన్ని ఎగ్జామినర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని నోడల్ అధికారి సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. అలాగే విద్యార్థులు సాధించిన మార్కులు ఇంటర్ బోర్డుకు ఆన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. సమస్యల ఒడిలో ప్రాక్టికల్ పరీక్షలు.. జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరిపడా ల్యాబ్ గదులు లేక ఆరుబయట వరండాల్లో ప్రయోగాలు అయిపోయానిపిస్తున్నారన్న విమర్శలున్నాయి. పాపన్నపేట జూనియర్ కళాశాలలో కరెంట్ బిల్ బకాయి పడటంతో కనెక్షన్ తొలగించారు. దీంతో పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రం డౌన్లోడ్ చేసుకోవడం, మార్కులను పంపించడం ఎలా అంటూ లెక్చరర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే కెమిస్ట్రీ ల్యాబ్‌కు నీటి సౌకర్యం తప్పనిసరి. కానీ కరెంట్ లేకపోవడంతో నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాలుగు ప్రాక్టికల్ గదులు లేక మూడింటిలోనే నాలుగు ల్యాబ్‌లు నడిపిస్తున్నారు. అల్లాదుర్గంలో జూనియర్ కళాశాలకు ప్రత్యేక భవనం లేక హైస్కూల్లోనే షిఫ్టింగ్ పద్ధలో కొనసాగిస్తున్నారు. దీంతో మొక్కుబడి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. రెండేళ్లవుతున్నా సొంత భవన నిర్మాణం పూర్తి కావడం లేదు. అలాగే మెదక్ బాలికల జూనియర్ కళాశాలలో సైతం హైస్కూల్, ఇంటర్మీడియెట్ తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా అ దే పరిస్థితి నెలకొంది. ఇలా పలు కళాశాలల్లో ల్యా బ్‌లకు సరిపడా ఫర్నిచర్, సౌకర్యాలు లేక సైన్స్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి నిర్వహణకోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఎగ్జామినర్లను నియమించాం. పర్యవేక్షణకు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ముగ్గురు జిల్లా పరీక్షల సభ్యులు ఉంటారు. పాపన్నపేటలో విద్యు™త్ సౌకర్యం లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. – సూర్యప్రకాశ్, నోడల్ అధికారి కరెంట్ లేకుంటే పరీక్షలు ఎలా? మా కళాశాలలో వారం రోజలు క్రితమే కరెంట్ తొలగించారు. దీంతో కళాశాలలో బోరు నడవక తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కెమిస్ట్రీ ల్యాబ్‌లో నీరు తప్పనిసరి. అలాగే ఫ్యాన్లు లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఇక్కడ ఒకే గదిలో రెండు సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ నడిపిస్తున్నారు. దీంతో సౌకర్యంగా లేదు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తే పరీక్షలు మంచి వాతావరణంలో రాయగలుగుతాం. – ఆసీఫ్బాబా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం -
పకడ్బందీగా ప్రయోగం
గుడిహత్నూర్(బోథ్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగ కసర త్తు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రాక్టికల్ పరీక్షలకు అరగంట ముందు మాత్రమే ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ప్రశ్నపత్రం ఆన్‌ద్వారా పరీక్షా కేంద్రాలకు అందనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5,927 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ఎంపీసీ వారు 1,884 మంది, బైపీసీ వారు 3,388 ఉండగా వొకేషనల్ విద్యార్థులు 655 మంది ఉన్నారు. వీరందరూ ప్రాక్టికల్ పరీక్షల్లో హాజరుకావడానికి యంత్రాం గం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రాక్టికల్ పరీక్షలంటే మాములుగా తీసుకునే విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా అందనున్న ప్రశ్నపత్రం ప్రాక్టికల్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ విద్యాశాఖ పటిష్ట ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది పరీక్షా సమయానికి అరగంట ముందు ఎగ్జామినర్‌కు ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఆన్లైన్లో ప్రశ్న పత్రం అందనుంది. అందిన వెంటనే ఎగ్జామినర్లు దానిని ప్రింట్ తీసుకొని పరీక్షా సమయానికి విద్యార్థులకు అందించనున్నారు. అయితే ఈ పరీక్షలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ గట్టెక్కేనా? జిల్లాలో 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు 18 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అయితే ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో ప్రాక్టికల్ భయం పుడుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో సెలబస్ పూర్తికానట్లు తెలుస్తోంది. దసరా సెలవులు, ఎన్నికలు, సంక్రాంతి సెలవులతోపాటు అధ్యాపకులు ఎన్నికల విధులు తదితర కారణాల వల్ల సకాలంలో అందుబాటులో ఉండకపోవడం సైతం కారణంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్స్‌కు సంబంధించి సామగ్రి లేకపోవడంతో మొక్కుబడిగా చేయించి థియరీ మాత్రం బట్టీ పట్టించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సారి ప్రాక్టికల్స్‌లో విద్యార్థులు ఎలా గట్టెక్కుతారనే ఆందోళన కనిపిస్తోంది. పకడ్బందీగా నిర్వహిస్తాం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. దీనికిగాను అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కళాశాలల్లో 95శాతం ప్రాక్టికల్ బోధన పూర్తయింది. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా బోధన పూర్తి చేయడంతో పాటు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం. – దస్రు, జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదిలాబాద్ -
ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నల్లగొండ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీఓలతో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా పూర్తయింది. పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఏవిధంగా చేయాలనేది ఇంటర్ బోర్డు సూచనలు చేయడంతో ఆ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ కమిటీతో కలిసి ఏర్పాట్లను చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఉన్న కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలలు మొత్తం 119 ఉన్నాయి. ఇందులో మొదటి సంవత్సరంలో 36,362 మంది విద్యార్థులు ఉండగా, రెండో సంవత్సరంలో 19,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇవి కూడా థియరీనే. నైతికత, మానవ విలువలు పరీక్ష పూర్తి కాగా, పర్యావరణ విద్య పరీక్షను పంచాయతీ ఎన్నికల కారణంగా 31 వాయిదా వేశారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 19,539 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ తదితర ప్రాక్టికల్స్ చేయనున్నారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్స్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఒక్కో విడతలో 18 కళాశాలల చొప్పున కొనసాగించనున్నారు. నాలుగు విడతల్లో అన్ని కళాశాలల్లో పరీక్షలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 27 నుంచి థియరీ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీనుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఒకేషనల్ కళాశాల విద్యార్థులకు కూడా థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం 9గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 13 వరకు జరగనున్నాయి. ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, సీనియర్ ప్రిన్సిపా ల్, జూనియర్ లెక్చరర్లతో కలిపి ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీనే పరీక్షల నిర్వహణ చేస్తుంది. కలెక్టర్, ఎస్పీలతో హైపవర్ కమిటీ హైపవర్ కమిటీలో కలెక్టర్, ఎస్పీ, బాలు ర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ఒక సబ్జెక్ట్ లెక్చరర్, మరో ఎక్స్పర్ట్ జూనియర్ లెక్చరర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరంతా ఎక్కడ సమస్య ఉన్నా, ఏమైనా ఆరోపణలు వచ్చినా వెంటనే పర్యవేక్షిస్తారు. థియరీకి 46 కేంద్రాలు థియరీ పరీక్షలకు 46 కేంద్రాలను ఏర్పా టు చేశారు. 12 ప్రభుత్వ, ఒకటి ఎయిడెడ్, రెండు మోడల్ స్కూల్, 2 రెసిడెన్షి యల్ కళాశాలలతోపాటు మరో 29 ప్రైవే ట్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు మొత్తం 46 చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 46 డీఓలు, 8మంది కస్టోడియన్స్, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 4 సిట్టింగ్ స్క్వాడ్ టీములను ఏర్పా టు చేయనున్నారు. 14 పోలీస్స్టేషన్లలో ప్రశ్నపత్రాల భద్రత పరీక్షలకు సంబంధించి 14 పోలీస్స్టేషన్లలో ప్రశ్న, సమాధానపత్రాలను భద్రపర్చనున్నారు. 7 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ గట్టి బందోబస్తు ఏ ర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నపత్రాల రవా ణాకు సంబంధించి ఆర్టీసీ అధికారులు 19 రూట్లను ఎంపిక చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పోస్టులో వచ్చే పత్రాలను తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోనుంది. ఇన్విజిలేటర్లను మాత్రం పరీక్ష సమయంలోనే అధికారులు ఆయా కళాశాలల్లో ఏర్పాటు చేసుకోనున్నారు. అన్ని కార్యక్రమాలు, స్ట్రాంగ్ రూంలు, డీఆర్డీసీ వెన్యూ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. -
జోరుగా మాస్ కాపీయింగ్
భువనగిరి : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉండగా కొందరూ ఎగ్జామినర్లు మందులు, విందులు స్వీకరిస్తూ మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న ఇ ద్దరు ఎగ్జామినర్లను అధికారులు తొలగించారు. దీనిని బట్టి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్ ఏవిధంగా జరుగుతుందో ఇట్టే చెప్పవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేది నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. 34 పరీక్ష కేంద్రాల్లో నాలుగు విడుతల్లో ఈ ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తున్నారు. మొదటి విడుత 1వ తేది నుంచి 5, రెండో విడుత 6 నుంచి 10, మూడో విడుత 11 నుంచి 16, నా లుగో విడుత 17నుంచి 21వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 3,010 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ఎంపీసీ 1,421, బైపీసీ 1,589మంది విద్యార్థులు ఉ న్నారు. ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు 1,313మంది విద్యార్థులు ఉన్నారు. పర్యవేక్షణ ఏదీ..? ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పర్యవేక్షణ లేక మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను నియమించారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి ఆయా కోర్సులను బట్టి నిర్ణిత ల్యాబ్ ఫీజు కంటే అదనంగా రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కళాశాల యాజమాన్యాలు వసూలు చేశారు. దీంతో ఆయా కళా శాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ కోసం వచ్చే ఎగ్జామినర్లకు మందు, విందు, తాయిలాల సౌకర్యాలు కల్పిస్తూ మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేరుకు మాత్రమే సీసీ కెమెరాల ఎదుట ప్రశ్నాపత్రం తీసినప్పటికీ పరీక్ష గదిలో మాత్రం మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాస్ కాపీయింగ్ మా దృష్టికి రాలేదు మాస్‌కాపీయింగ్ జరుగుతున్నట్లు ఎక్కడా మా దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేస్తున్నాం. ఆలేరులో విధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించాం. మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – రవీంద్రప్రసాద్, డీఐఈఓ -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
-
నేటినుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
హాజరు కానున్న 5.16 లక్షల మంది విద్యార్థులు మేనేజ్మెంట్లు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు: ఇంటర్‌బోర్డు కార్యదర్శి హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు కొనసాగుతాయి. వీటిని నాలుగు దశల్లో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. 3,022 ప్రభుత్వ, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ మంగళవారం తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు 5,16,579 మంది విద్యార్థులు(ఎంపీసీ విద్యార్థులు 3,80,333 మంది, బైపీసీ విద్యార్థులు 1,36,246 మంది) హాజరుకానున్నట్టు వివరించారు. వివిధ కాలేజీలకు చెందిన జూనియర్ లెక్చరర్లను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చే సి ప్రాక్టికల్స్ ఎగ్జామినర్స్‌గా, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లుగా నియమించినట్లు వెల్లడించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్లు, హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీల నేతృత్వంలో పర్యవేక్షణ చేపట్టామని, బోర్డు నుంచి కూడా రాష్ట్ర అబ్జర్వర్లను పంపిస్తున్నట్లు వివరించారు. ఏ కారణంతోనైనా మేనేజ్మెంట్లు విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వకపోయినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ విద్యలో వీడియో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో భవిష్యత్తులో చేపట్టబోయే లెక్చరర్లు, సిబ్బంది బదిలీలను వీడియో కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు సిబ్బంది నియామకాలను కూడా వీడియో కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టనుంది. ఇటీవల 190 మంది బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో కౌన్సెలింగ్ రెండు గంటల్లో ముగిసింది. దీంతో భవిష్యత్తులో వీడియో కౌన్సెలింగ్ ద్వారానే లెక్చరర్లు, సిబ్బంది బదిలీలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.