నేటినుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
హాజరు కానున్న 5.16 లక్షల మంది విద్యార్థులు
మేనేజ్‌మెంట్లు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు: ఇంటర్‌బోర్డు కార్యదర్శి హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల నాలుగో తేదీ వరకు కొనసాగుతాయి. వీటిని నాలుగు దశల్లో నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. 3,022 ప్రభుత్వ, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ మంగళవారం తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షలకు 5,16,579 మంది విద్యార్థులు(ఎంపీసీ విద్యార్థులు 3,80,333 మంది, బైపీసీ విద్యార్థులు 1,36,246 మంది) హాజరుకానున్నట్టు వివరించారు. వివిధ కాలేజీలకు చెందిన జూనియర్ లెక్చరర్లను ర్యాండమ్ పద్ధతిలో ఎంపిక చే సి ప్రాక్టికల్స్ ఎగ్జామినర్స్‌గా, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లుగా నియమించినట్లు వెల్లడించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల కమిటీల నేతృత్వంలో పర్యవేక్షణ చేపట్టామని, బోర్డు నుంచి కూడా రాష్ట్ర అబ్జర్వర్లను పంపిస్తున్నట్లు వివరించారు. ఏ కారణంతోనైనా మేనేజ్‌మెంట్లు విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వకపోయినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్ విద్యలో వీడియో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు
ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో భవిష్యత్తులో చేపట్టబోయే లెక్చరర్లు, సిబ్బంది బదిలీలను వీడియో కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టు సిబ్బంది నియామకాలను కూడా వీడియో కౌన్సెలింగ్ ద్వారానే చేపట్టనుంది. ఇటీవల 190 మంది బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో కౌన్సెలింగ్ రెండు గంటల్లో ముగిసింది. దీంతో భవిష్యత్తులో వీడియో కౌన్సెలింగ్ ద్వారానే లెక్చరర్లు, సిబ్బంది బదిలీలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.