
బూర్గంపాడు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 1 నుంచి 20 వరకు నాలుగు విడతలుగా ఈ పరీక్షలు జరగ నున్నాయి. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగంతో ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల కళాశాలల్లో చదువుతున్న 8వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లాలో 60 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభకానున్న ప్రాక్టికల్ పరీక్షలు రోజుకు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే కేంద్రాల్లో (ప్రయోగశాలల్లో) ఉండాలి.
9 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1.30 గంటలకే పరీక్షా కేంద్రాల్లో ఉండాలని సూచించారు. ఉదయం జరిగే పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని రాష్ట్ర ఇంటర్ బోర్డు ఉదయం 8.30 గంటలకే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అందులో వచ్చిన ప్రాక్టికల్‌నే విద్యార్థులు చేయాల్సి ఉంటుంది. ఈ సారి ఎలాంటి ఆప్షన్స్ ఉండవని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నాపత్రంలో మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. ఏ రోజుకారోజు ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలను అన్‌లైన్‌లో ఇంటర్ బోర్డుకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాలో 60 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నాం. 8వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. ప్రశ్నపత్రం ఆన్‌లైన్‌లో అరగంట ముందుగానే వస్తుంది. ఆ ప్రశ్నపత్రాన్నే విద్యార్థులు చేయాల్సి ఉంటుంది. – సయ్యద్ జహీర్ అహ్మద్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment