సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్‌ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment