Jawaharlal Nehru University (JNU)
-
మలేరియాపై అస్త్రం.. అలిస్పోరివిర్
న్యూఢిల్లీ: మలేరియా. దోమకాటు వల్ల వచ్చే అతి పెద్ద జబ్బు. దేశంలో ఏటా లక్షలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది మరణిస్తున్నారు. ఆడ ఆనాఫిలిస్ దోమకాటు వల్ల వచ్చే మలేరియా నివారణకు ఎన్నో ఔషధాలు అందుబాటులో ఉన్నా అది పూర్తిగా అంతం కావడం లేదు. ఔషధాలను తట్టుకొనేలా కొత్త శక్తి పొందుతూ వస్తోంది. దీనిపై ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ‘సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసిన్’ పరిశోధకులు దృష్టి సారించారు. డ్రగ్–రెసిస్టెంట్ మలేరియా రకాల భరతం పట్టడానికి యాంటీ–హెపటైటిస్ సి డ్రగ్ ‘అలిస్పోరివిర్’ను కనిపెట్టారు. అవయవాల మార్పిడి ప్రక్రియలో ఉపయోగించే సైక్లోస్పోరిన్–ఎ డ్రగ్‌లో మార్పులు చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. క్లోరోక్విన్–రెసిస్టెంట్, అర్టిమెసినిన్–రెసిస్టెంట్ మలేరియా రకాలపై ఇది చక్కగా పనిచేస్తుందని çడాక్టర్ ఆనంద్ రంగనాథన్ చెప్పారు. ‘‘దీన్ని అర్టిమెసినిన్ డ్రగ్‌తో కలిపి వాడొచ్చు. ప్రీ క్లినికల్ పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది పూర్తిగా సురక్షితం’’ అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ‘అలిస్పోరివిర్’ అందుబాటులోకి రానుంది. 2021లో మాస్కిరిక్స్ అనే యాంటీ–మలేరియా టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి మంజూరు చేసింది. మలేరియా నివారణకు టీకా రావడం మాత్రం ఇదే మొదటిసారి! -
ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ
న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. -
జేఎన్‌యూ విద్యార్థి ఇమామ్‌పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. -
కరోనా: హాస్టళ్లు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోండి!
న్యూఢిల్లీ: లాక్డౌన్ సడలింపులతో రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చినందున హాస్టళ్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని ఢిల్లీ జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. ప్రత్యేక రైళ్లు, రాష్ట్ర వ్యాప్త బస్ సర్వీసుల సేవల్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు జేఎన్‌యూ హాస్టల్స్ డీన్ ప్రొఫెసర్ సుధీర్ ప్రతాప్‌సింగ్ సర్క్యులర్ జారీ చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్ ప్రబలుతున్నందున హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని మార్చి నెలలోనే విద్యార్థులకు చెప్పినట్టు గుర్తు చేశారు. అయితే, పటిష్ట లాక్డౌన్ కారణంగా అప్పుడు విద్యార్థులు ఇళ్లకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పరిధిలో రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, జూన్ 1నుంచి ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తాయని ప్రతాప్‌సింగ్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జూన్ చివరి వారం వరకు యూనివర్సిటీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, అప్పటివరకు విద్యార్థులు సొంతూళ్లలోనే ఉండాలని జేఎన్‌యూ వెల్లడించింది. (చదవండి: పెళ్లితో ఒక్కటైన యాచకురాలు, డ్రైవర్) -
షార్జీల్ ఇమామ్‌పై కేసు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: రెచ్చగొట్టే ప్రసంగాలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలతో జేఎన్‌యూ పూర్వ విద్యార్థి షార్జీల్ ఇమామ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. డిసెంబరు 15న తన విద్వేషపూరిత వ్యాఖ్యలతో విద్యార్థులను రెచ్చగొట్టినందున ఆయనపై చార్జిషీట్ వేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబరులో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు గళమెత్తడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీకి సమీపంలో ఉన్న న్యూ ఫ్రెండ్స్ కాలనీ, జామియా నగర్ ప్రాంతాల్లో అలజడి సృష్టించిన అల్లరి మూకలు అనంతరం యూనివర్సిటీలో ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. (‘వీడియోతో.. వాళ్లకు వాళ్లుగా దొరికిపోయారు!’) ‘‘రాళ్లు రువ్వుతూ.. ఆయుధాలు చేపట్టి కొంత మంది అల్లర్లకు తెరతీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను భారీగా ధ్వంసం చేశారు. ఎంతో మంది పోలీసులు, సామాన్య పౌరులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో డిసెంబరు 13, 2019లో విద్వేషపూరిత ప్రసంగాలు ఇచ్చి అల్లర్లకు కారణమైన షార్జీల్‌ను అరెస్టు చేశాం. మా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాల ఆధారంగా 124 ఏ ఐపీసీ, 153 ఏ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఈ మేరకు సాకేత్ జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశాం’’ అని వెల్లడించారు. కాగా సీఏఏను వ్యతిరేకిస్తూ షాహిన్‌బాగ్‌లో చేపట్టిన నిరసనలో పాల్గొన్న షార్జీల్... అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో ఇచ్చిన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతంలోనూ అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరుచేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు గానూ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
బూట్లతో తొక్కారు.. ఎత్తి కిందపడేసి..
న్యూఢిల్లీ : ‘నూతన విద్యావిధానం పేరిట దేశంలోని వివిధ కాలేజీల్లో ఫీజుల పెంపుపై 22 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న శాంతియుతంగా పార్లమెంటును ముట్టడించేందుకు సిద్ధమయ్యాం. అయితే పోలీసులు మా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జోర్ భాగ్‌లో మాపై లాఠీలతో విరుచుకుపడ్డారు. మేమంతా పారిపోయేందుకు ప్రయత్నించాం. అయితే ఓ పోలీసు నన్ను పట్టుకుని కొడుతుంటే.. నా సహ విద్యార్థులు మానవహారంగా నిలబడి నన్ను రక్షించాలని భావించారు. నేను అంధుడినని వారికి చెప్పారు. అయినా అతడు వినకుండా వాళ్లందరినీ చెదరగొట్టి నన్ను కొట్టాడు. గుడ్డివాడు అయితే నిరసనల్లో పాల్గొనడం ఎందుకు హేళన చేస్తూ ఇష్టారీతిన లాఠీచార్జీ చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది పోలీసులు వచ్చి నన్ను కొట్టారు. నా గుండెలపై, పొట్టపై, గొంతు మీద బూట్లతో తొక్కుతూ హింసించారు. ఎత్తి కిందపడేశారు. పారిపో అని చెప్పారు. దీంతో ఎలాగోలా శక్తి కూడదీసుకుని పరిగెడుతుంటే వెనుక నుంచి కాళ్లపై కొడుతూ మళ్లీ కిందపడేశారు’ అంటూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అంధ విద్యార్థి శశి భూషణ్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్ నేత సంజయ్ సింగ్ ట్విటర్లో షేర్ చేయడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్‌లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో శశి భూషణ్ వంటి అంధ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ఇక శశి భూషణ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును జేఎన్‌యూ అంధ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. ’శశి అంధ విద్యార్థి అని తెలిసిన తర్వాత కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గుడ్డివాడివైతే నీకు ధర్నాలు ఎందుకు అంటూ అతడిని మానసిక వేదనకు గురిచేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. जब मैंने कहा “मैं ब्लाइंड स्टूडेंट हूँ मुझे क्यों मार रहे हो? तो पुलिस ने कहा ब्लाइंड है तो प्रोटेस्ट में क्यों आता है? फिर पुलिस वाले मुझे लाठी डंडे लात जूतों से मारने लगे-शशीभूषण पांडेय” ये है वकीलों से पीटने वाली दिल्ली पुलिस #JNUProtests pic.twitter.com/rdd1nxr8qL — Sanjay Singh AAP (@SanjayAzadSln) November 19, 2019 -
విద్యార్థులపై పోలీసుల ప్రతాపం
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిపై ప్రతాపాన్ని చూపారు. లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులని కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్‌లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి తలలకు పెద్ద గాయాలు తగిలాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడిలో గాయపడ్డ పలువురు విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా విద్యార్థులపై పోలీసుల దాడిని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఫీజు పెంపుపై కొద్దిగా వెనక్కి
న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయంపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వెనక్కి తగ్గింది. ఎలాంటి స్కాలర్షిప్ తీసుకోని పేద(బీపీఎల్) విద్యార్థులకు హాస్టల్ ఫీజు పెంపును తాత్కాలికంగా రద్దుచేసింది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) బుధవారం ఈ మేరకు నిర్ణయించింది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపస్ వెలుపల ఈసీ సమావేశమైంది. ఈ నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా పేర్కొన్న విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించాయి. వర్సిటీ సర్వీస్ చార్జి రూ.1,700 పెంచడంతోపాటు వన్‌టైమ్ మెస్ సెక్యూరిటీ ఫీజును రూ.5,500 నుంచి రూ.12,000 వేలకు పెంచింది. బీపీఎల్‌యేతర విద్యార్థులకు ఉపశమనం కలిగించలేదు. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
జేఎన్‌యూలో వామపక్షాల విజయభేరి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ విజయం సాధించింది. జేఎన్‌యూ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్ జాయింట్ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులను ఆ కూటమి సొంతం చేసుకుంది. లెఫ్ట్ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. యునిటైడ్ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్ఇండియా స్టూడెంట్ అసోషియేషన్ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఎఐఎస్ఎఫ్) ఉన్నాయి. -
జేఎన్‌యూ ఓట్ల లెక్కింపు వాయిదా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శనివారం ఉదయం వాయిదా పడి రాత్రి మళ్లీ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించారనీ, అందుకే లెక్కింపు ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల నిర్వహణ విభాగం తెలిపింది. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వనేలేదనీ, తమ ఏజెంట్ లేకుండానే బ్యాలెట్ పెట్టెల సీల్ తెరవడంతోపాటు ఆ తర్వాతా తమ ఏజెంట్లను లోపలికి అనుమతించలేదని ఆరోపించారు. శనివారం రాత్రికి ఓట్ల లెక్కింపు పునఃప్రారంభం కావడంతో ఆదివారానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. -
ఎంపీగా కన్నయ్య కుమార్..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ ఎంపీగా పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు బిహార్ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్ ప్రకటించారు. సీపీఐ నుంచి ఆయన పోటీ చేస్తారని, దీనికి వామపక్ష పార్టీల మద్దతు తెలిపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు. ఆర్జేడీ ఛీప్ లాలు ప్రసాద్ యాదవ్ గతంలోనే ఆయన పేరును ప్రతిపాధించారని, ఆయన సూచన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కన్నయ్య కుమార్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఢిల్లీ పోలీసులు గతంలో దేశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కన్నయ్య కుమార్ ఇదే నియోజవర్గానికి చెందిన భీహాట్ గ్రామ పంచాయతీ చెందినవాడు. కాగా 2014 ఎన్నికల్లో బెగుసరై నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలా సింగ్ 58 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. -
'కన్హయ్యకు ఆ గొడవతో సంబంధమే లేదు'
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకు జాతి వ్యతిరేక నినాదాలకు ప్రత్యక్ష సంబంధంలేదని ఢిల్లీ ప్రభుత్వం తమ నివేదికలో స్పష్టం చేసింది. ఫిబ్రవరి9న జరిగిన ఘటనపై బుధవారం రాత్రి నివేదిక అందచేశామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ తెలిపారు. ఊమర్ ఖలీద్, మరో విద్యార్థి ఆ రోజు నినాదాలు చేశారా లేదా అన్నదానిపై పూర్తిస్థాయి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. లభ్యమైన చాలా వీడియోలలో ఊమర్ ఖలీద్ కనపించాడనీ, కశ్మీర్ అంశంపై, అఫ్జల్ గురు విషయాలలో అతడు మద్ధతిస్తున్నట్లు కనిపించాడని సంజయ్ కుమార్ వెల్లడించారు. మరిన్ని వివరాలతో పాటు ఊమర్ ఖలీద్ జాతి వ్యతిరేఖ వివాదాల కార్యక్రమాలలో పాల్గొన్నాడా, లేదా అన్నది త్వరలో తెలుతుందన్నారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కొందరు విద్యార్థులను జేఎన్ యూ వర్సిటీ యాజమాన్యం గుర్తించిందని, పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు బుధవారం షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కన్హయ్యకు ఊరట కల్పిస్తూ జస్టిస్ ప్రతిభారాణితో కూడిన ధర్మాసనం ఆరు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది. అవసరమైనపుడు అధికారుల ఎదుట ఆయన హాజరుకావాలని, కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. విడుదల కోసం రూ. 10 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలంది. తాను భారత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి నినాదాలూ చేయలేదంటూ కన్హయ్య బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా హైకోర్టు మంజూరు చేసింది. మిగతా ఇద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.