సిటీ ఆఫ్ మ్యూజిక్
సిటీలో సంగీతం సాగరమై ఉప్పొంగుతోంది. వారంలో ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ సరిగమల ఝరి వినిపిస్తూనే ఉంది. హైటెక్ సిటీలో పాశ్చాత్య రాకింగ్‌లతో పాటు ‘క్లాసికల్’ టచ్ కూడా మిళితమై ‘లైవ్ కన్సర్ట్’లు కళాభిమానులను ఆహ్లాదకర ప్రపంచంలో ఓలలాడిస్తున్నాయి. అందుకే దీన్ని ‘కేపిటల్ ఆఫ్ మ్యూజిక్’ అంటున్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు సెల్వగణేష్, పండిట్ జస్‌రాజ్ కుమార్తె దుర్గా జస్‌రాజ్, అమెరికాకు చెందిన పెట్‌లాకెట్. శుక్రవారం మాదాపూర్ శిల్పకళావేదికలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ‘జల్సా- మ్యూజిక్ ఫర్ ది సోల్’లో పాల్గొనేందుకు వచ్చిన వీరిని ‘సిటీ ప్లస్’ పలుకరించింది...
లైవ్ కన్సర్ట్‌లో పాల్గొనేందుకు ఈ సిటీకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ భారీ ఆదరణ లభిస్తోంది. గ్రామీ అవార్డు విన్నరైన మా నాన్న విక్కు వినాయక్‌రామ్ అభిమానులు నన్నూ ఆదరించడం కొండంత బలాన్నిస్తుంది. ఈసారి కొత్తగా ‘పండేరా’ డ్రమ్ తీసుకొచ్చా. తోలుతో కాకుండా డిఫరెంట్‌గా చేసిన దీనిపై మంచి సౌండ్ వస్తుంది. మ్యూజిక్‌ను ఇంతగా ప్రేమిస్తున్న ఈ సిటీకి హ్యాట్సాఫ్... అన్నారు కంజర విద్వాంసుడు సెల్వగణేష్.
తొలి ప్రాధాన్యం...
సంగీత కచేరీకి అంటే నా తొలి ఓటు హైదరాబాద్‌కే. మా పూర్వీకులు ఇక్కడ ఉండటం ఓ కారణమైతే, పీపుల్ మ్యూజిక్‌ను ఆస్వాదించే తీరు మరో కారణం. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. వారి కోసమే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. అందుకే ఏటా దాదాపు ఆరుసార్లు ఈ సిటీకి వస్తుంటా. ‘ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్స్’ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా సంగీత ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే పనిలో నిమగ్నమయ్యా. భావితరానికి మ్యూజిక్ విశిష్టతను తెలియజేస్తున్నా... అన్నారు దుర్గా జస్‌రాజ్.
ఐ లవ్ ఇండియన్ మ్యూజిక్
భారత సంగీతమంటే నాకు ప్రాణం. వెస్ట్రన్ మ్యూజిక్ కంటే సరిగమపదనిసలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. హిందుస్థానీ సంగీతం సింప్లీ సూపర్బ్. గతంలో హైదరాబాద్‌కు వచ్చా. సంగీత కచేరీ కోసం మళ్లీ రావడం ఆనందంగా ఉంది. సంగీతానికి కేరాఫ్‌గా మారుతున్న సిటీని చూస్తే ముచ్చటేస్తుంది... అన్నారు అమెరికాకు చెందిన ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ పెట్‌లాకెట్.
- వాంకె శ్రీనివాస్