ఫెస్టివల్ దసరా..
హైదరాబాద్ .. గంగాజమునా తెహ్‌జీబ్‌కి హంబుల్ విట్‌నెస్! ఈ సంగమానికి పండుగలను మించిన సందర్భాల్లేవ్! దసరా కూడా అలాంటి ఓ అద్భుత సందర్భమే! భాగ్యనగరంలో ఉన్న దక్షిణ భారతీయులు సరే.. గుజరాతీ, మార్వాడీ, బెంగాలీ, సిక్కులాంటి ఉత్తర భారతీయులను భాగం చేసి సంస్కృతుల సమ్మేళన భాగ్యాన్ని కల్పించింది.
విజయదశమి దేశంలోని హిందువులకు ఆనందం పంచే ఉత్సవమే అయినా జరుపుకోవడంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. గుజరాతీలు.. మార్వాడీలు.. సిక్కులు వాళ్ల రివాజుల్లోని కొన్నిటిని ఇక్కడి తెలుగువాళ్లకు ఇచ్చి.. ఇక్కడి పద్ధతులను కొన్ని వాళ్లు స్వీకరించారు. దేవీ పూజ మొదలు నివేదన వరకు.. కట్టుబొట్టులోని వైవిధ్యాలు మనకిచ్చారు.. ప్రాంతాచారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారు. ఆ భిన్నత్వంలోని ఏకత్వాన్ని కొందరు ఇలా వివరించారు.
మీ.. మా.. మన
‘గుజరాతీలకు దసరా అంటే దాండియా.. దాండియా అంటే దసరా! ఈ దాండియా.. హైదరాబాద్ కల్చర్‌లో ఎంత మమేకమైందో వేరే చెప్పక్కర్లేదు. తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మకు.. గుజరాతీల సంప్రదాయ సోయగం దాండియాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. తెలంగాణీయులు పూలను పేర్చి గౌరమ్మగా కొలిస్తే.. మేం కుండలో దీపం పెట్టి దుర్గాదేవిగా భావిస్తాం. రెండు సందళ్లూ వృత్తాకార వరుసలో చేరి చేసుకునే పండుగలే. వృత్తాలకు ప్రారంభం ఉండదు.. చివరా ఉండదు.
అమ్మవారి శక్తి అంతే.. అది ఆద్యంత రహితం.. అనంతం. వంటకాల్లోనూ ఇక్కడి రుచులను మేం ఆస్వాదిస్తున్నాం. సాధారణంగా గుజరాతీలు అంతగా కారం తినరు. కానీ ఇక్కడున్న మా వాళ్లు మాత్రం కారం ఎక్కువే తింటారు. హైదరాబాదీల మమకారం వల్లే మా వంటల్లో కారం పాళ్లు పెరిగాయి. డ్రెసింగ్ సెన్స్‌లో తేడా కనిపిస్తుంది. మేం సీదా పల్లు అలవాటు చేసుకుంటుంటే.. పండుగలకు ఇక్కడి వాళ్లు గుజరాతీ పల్లును వేసుకుంటున్నారు. ఇక్కడి లంగాఓణీ మా గాగ్రా చోళీ. మీ అలవాట్లు, మా పద్ధతులు.. కలగలసి మన అనే ఫీలింగ్ వచ్చింద’ని అంటారు గుజరాతీ వనిత ప్రముఖ సైకాలజిస్ట్ వందన.
చండీపాఠ్..
‘ఇక్కడి దసరా మాకు చండీపాఠ్‌ను కొత్తగా నేర్పింది. నవరాత్రుల్లో మేం గురుద్వారాలో చండీపాఠ్ చేస్తాం. ఇక్కడి వాళ్ల దేవీ పారాయణంలా అన్నమాట. ఇది పంజాబ్‌లో ఉండే సిక్కులకు ఉండదు. ఆడవాళ్లమంతా బతుకమ్మ ఆడతాం. దసరా రోజు రావణ దహనంలో పాల్గొంటాం. మేమూ ఆయుధ పూజ చేస్తాం. వంటల విషయానికి వస్తే.. తెలుగింటి రుచులు.. గుజరాతీ ఘుమఘుమలు.. మార్వాడీ మెనూ.. అన్నీ మా వంటింట్లోకి వచ్చేశాయి. హైదరాబాద్ మాకు నేర్పిన కలివిడితనం ఇది’ అని వివరించింది సిక్కు స్త్రీ.. టీచర్‌గా పనిచేస్తున్న అమిత్ కౌర్.
త్రిపుర కుమారి...
‘నవరాత్రిలో తెలుగువాళ్లకు మాకు ఉన్న పోలిక.. ఉపవాసం. పూజావిధానంలో కూడా పోలికలున్నాయి. ఇక్కడుండే ఆంధ్రులు నవరాత్రుల్లో కన్నెపిల్లను బాలాత్రిపుర సుందరిగా కొలుస్తారు. ఆ పద్ధతి మాకూ ఉంది. దాన్ని మేము కన్యాకుమారి పూజ అంటాం. ఇక మెనూ విషయానికి వస్తే.. పేనీచెక్కి.. ఇది ఏ ప్రాంతానికి చెందినదో తెలియదు కానీ.., అటు మరాఠీ వాళ్లు.. మేము.. కొందరు తెలుగువాళ్లు కూడా ఈ స్వీట్ చేసుకుంటుంటారు. జమ్మిచెట్టుకు పూజచేసి ఆ ఆకులను ఇంట్లో పెద్దవాళ్లకు ఇచ్చి.. తర్వాత ఇరుగుపొరుగుకు, ఫ్రెండ్స్‌కి ఇవ్వడం ఇక్కడున్న అందరి ఆచారం’ అని చెప్పింది మార్వాడీ మహిళ వేణుదేవి ఠాకూర్.
వంటలతోనే మొదలు..
ఏ ప్రాంతంలోనైనా కల్చరల్ ఎక్స్‌చేంజ్ వంటలతోనే మొదలవుతుంది. వంటకాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి.. మెల్లిగా ఆచార వ్యవహారాల్లోకి మారింది. సహజంగా హైదరాబాద్‌కు ఆ లక్షణం ఉంది. ఇది మొదట్నించి హిందూముస్లిం సమైక్యతను చాటిన గడ్డ. ఇక్కడికి ఎవరు వచ్చినా అదే ఒరవడిని కొనసాగించారు. అందుకే అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ హాయిగా మనగలుగుతున్నారు. ఒక్క దసరానే కాదు.. సిటీలో జరిగే ప్రతి పండుగ అన్ని సంస్కృతులను ప్రతిబింబిస్తూ కన్నులపండువగా సాగుతుంది’ అని విశ్లేషించింది ప్రముఖ చిత్రకారిణి అంజనీరెడ్డి.
- సరస్వతి రమ