లైఫ్ కథా చిత్రమ్ | Director Maruthi Dasari to speak with Sakshi City Plus on his Success Career | Sakshi
Sakshi News home page

లైఫ్ కథా చిత్రమ్

Published Wed, Sep 3 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

లైఫ్ కథా చిత్రమ్

లైఫ్ కథా చిత్రమ్

ఈ రోజుల్లో.. చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. బస్‌స్టాప్ మూవీతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డెరైక్టర్.. నిర్మాతగా ప్రేమ కథాచిత్రమ్‌తో హిట్ కొట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. దర్శకుడిగా కొత్తజంట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మారుతీ దాసరి.. తనకు పాఠాలు నేర్పింది ఈ హైదరాబాదే అంటున్నారు. రూ.15 వేలతో సిటీలో అడుగుపెట్టిన తనను ఇప్పుడు కార్లలో తిరిగే స్థాయికి చేర్చింది భాగ్యనగరమే అని చెబుతారు. భాగ్యనగరితో ముడిపడిన తన జీవనచిత్రాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
 
 మాది మచిలీపట్నం. పేదరికంలో పెరిగాను. నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడిని. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాను. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో సిటీ రైలు ఎక్కేశాను. నిజాంపేటలోని మా అక్క వాళ్లింటో దిగాను.
 
 లాంగ్ జర్నీ
 అప్పట్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఇక ఆటోలు రావడం కూడా గగనమే. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాణ్ని. జూబ్లీహిల్స్‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాను. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాణ్ని. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాణ్ని. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
 
 బొమ్మలేయడం సరదా
 నాకు బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడిని. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడిని. గోల్కొండ, చార్మినార్, జూపార్క్‌లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాను. టైం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను నా స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడిని.
 
 టర్నింగ్ పాయింట్
 2008లో నాకు పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించా. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం నా లైఫ్‌ను కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాను. యాడ్స్ తీశాను. ఇక నా డెరైక్షన్ గురించి మీకు తెలిసిందే.
 
 బెస్ట్ లొకేషన్
  నేను తొలినాళ్లలో చూసిన నగరానికి.. ఇప్పటి సిటీకి ఎంతో తేడా ఉంది. హైటెక్ సిటీకి వెళ్లి చూడండి.. మరో ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ షూట్ చేసిన సీన్లు విదేశాల్లో తీసినంత రిచ్‌గా వస్తున్నాయి.అందుకే నా సినిమాల్లో సిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాను.
 ..:: వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement