
డ్రీమ్స్ అండ్ డ్రామాస్
కళల కాణాచి హైదరాబాద్‌లో రంగస్థలానికి సంబంధించి ఘన చరిత్రే ఉంది. మోడర్న్ డేస్‌లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ప్రభావంతో నాటకం అవుటాఫ్ ఫోకస్‌గా మిగిలిపోయింది.
అభినయ నేషనల్.. థియేటర్ ఫెస్టివల్..2014
వేదిక.. రవీంద్రభారతి
పార్టిసిపెంట్స్: రూపాంత్ర (బెంగళూరు)
పూర్భరంగ (అసోం)
నమతుళువెర్ కళాసంఘటనె (మంగుళూరు)
బనియన్ రిపర్టరీ థియేటర్ (మణిపురి)
కళల కాణాచి హైదరాబాద్‌లో రంగస్థలానికి సంబంధించి ఘన చరిత్రే ఉంది. మోడర్న్ డేస్‌లో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ప్రభావంతో నాటకం అవుటాఫ్ ఫోకస్‌గా మిగిలిపోయింది. అలాంటి డ్రామాను బతికించడానికి ఇలాంటి ఫెస్టివల్స్ ఆక్సిజన్‌గా పనికొస్తున్నాయి. ఈ నాటక పండుగకు వచ్చిన కొందరు కళాకారులు చెబుతున్న విషయాలు...
పరిశీలన.. విశ్లేషణ
అభినయ థియేటర్ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌కి ఎవ్రీ ఇయర్ నా గ్రూప్‌తో వస్తున్నా. మాది బెంగుళూర్ బేస్డ్ గ్రూప్. అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ ట్రూప్‌లో పాతికేళ్ల అనుభవం ఉంది. హైదరాబాద్ ఆడియున్స్ మంచి సెన్స్ ఉన్నవారు. కన్నడను బాగా ఆదరిస్తారు. నాటకాన్ని పరిశీలన, విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. అరుుతే ఇక్కడ నాటకానికి ఆదరణ కాస్త తక్కువే. సినిమా ప్రభావం ఎక్కువ. కానీ ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా లాంటి సిటీస్‌తో పోల్చుకుంటే హైదరాబాద్ బెస్ట్ సిటీ. మంచి ఆతిథ్యం లభిస్తుందిక్కడ.
- కేఎస్‌డీఎల్ చంద్రు, ‘చక్రరత్న’ నాటకం డెరైక్టర్ (రూపాంత్ర గ్రూప్)
మెయిన్‌స్ట్రీమ్.. కమర్షియల్
ఈ ఫెస్టివల్ కోసం హైదరాబాద్ రావడం ఇది నాలుగోసారి. హైదరాబాద్‌తో అంతకుముందు నుంచే సంబంధం ఉంది. ఇక్కడి జనపదంతో కలిసి పనిచేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ మీద జరిగిన వర్క్‌షాప్స్‌కీ అటెండ్ అయ్యా. బ్యూటిఫుల్ సిటీ. నాటకం.. మనిషిలో సోషల్ రెస్పాన్స్‌బిలిటీని పెంచుతుంది. ఇదో పవర్‌ఫుల్ మీడియం. అలాంటి థియేటర్.. హైదరాబాద్‌లో అంత యాక్టివ్‌గా లేదు. అసోంలో థియేటర్ వెరీ రిచ్. మెయిన్‌స్ట్రీమ్ అండ్ కమర్షియల్‌గా.
- గుణకర్‌దేవ్ గోస్వామి,
‘మృగయా’ డెరైక్టర్ (పూర్భరంగ గ్రూప్)
సినిమాకు రెండొందలు.. నాటకానికి ముప్పై
నాకు హైదరాబాద్, తెలుగు థియేటర్‌తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. తెలుగులో పాపులర్ అయిన బ్రహ్మరథ, మినిస్టర్ లాంటి నాటకాలను మణిపురిలో పబ్లిష్ చేశాం. నిజానికి తెలుగులో మంచి నాటకాలున్నాయి. ఆదరణే లేదు. మరాఠీ, బెంగాలీ, కన్నడతో పోల్చుకుంటే ఇక్కడ థియేటర్ మూవ్‌మెంట్ చాలా వీక్. కమర్షియల్ థియేటర్ అసలు కనిపించదు. సినిమాకు రెండువందల రూపాయల టికెట్ పెట్టయినా వెళ్తారు కానీ... నాటకానికి ముప్పై రూపాయల కూడా వెచ్చించరు. అలాగని ఇక్కడి ప్రేక్షకులకు థియేటర్ సెన్స్ లేదని కాదు. చూసే ఆ కొద్దిమందైనా అన్ని భాషల నాటకాలనూ ఆదరిస్తారు. ఆ అభిరుచే ఇంకా ఇక్కడ థియేటర్ బతికేలా చేస్తోంది.
- ఎం.సి.తోయిబా, ‘అప్రెస్డ్ పీపుల్’ నాటకం డెరైక్టర్ (బనియన్ రిపర్టరీ థియేటర్)
పదకొండో తారీఖున మొదలైన ఈ నాటకోత్సం పధ్నాలుగో తారీఖున ముగియనున్నది. కన్నడ, అస్సామి, తుళు, మణిపురి భాషలకు చెందిన నాటకాల ప్రదర్శనజరుగుతోంది. అభినయ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉత్సవంలో తెలుగు నాటక ప్రదర్శన కూడా
ఉంటే బాగుండేదని పలువురు నాటకాభిమానుల అభిప్రాయం!
- శరాది