
సవితాభట్టీ
న్యూఢిల్లీ: ఎవరైనా ఆ రాజకీయ పార్టీలో చేరాలంటే కనీసం 200 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఉండాలి లేదా వారిపై 20 క్రిమినల్ కేసులైనా ఉండాలి. ఈ పార్టీ గురించి తెలుసుకోవాలని ఉందా? ప్రముఖ హాస్య నటుడు జస్పాల్ భట్టీ అకాలమృతితో ఆయన సతీమణి నటి సవితాభట్టీ కొంత ఢీలాపడ్డారు. ఆ తరువాత ఆమె మళ్లీ రాజకీయాలలో బిజీ అయిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా ఆమె ఛత్తీస్‌ఘడ్ నుంచి లోక్‌సభకు పోటీ చేయవలసి ఉంది. చివరి నిమిషంలో ఎందుకో ఏమో ఆమె పోటీ చేయకూడదని నిర్ణయించుకుని విరమించుకున్నారు.
బహుశా ఆమె రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటారని అనుకున్నారు. ఊహించని విధంగా టపీమని ఆమె మళ్లీ సీన్‌లోకి వచ్చారు. భర్త స్థాపించిన నాన్‌సెన్స్ క్లబ్ నుంచి నోటా పార్టీని ప్రకటించారు. పార్టీ గుర్తుగా కరెన్సీని ఎంచుకున్నారు. దానికి ఓ పాటను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఈసారి ఎన్నికల సంఘం(ఇసి) ఓటర్లకు ఒక ప్రత్యేక అవకాశం కల్పించింది. బ్యాలెట్ పత్రంలో నన్ ఆఫ్ ది అబవ్-నోటా (పైవారెవరూ కాదు) అనే ఆప్షన్ ఇవ్వనుంది. పార్టీ పేరు పెట్టడానికి దానిని ప్రేరణగా తీసుకున్నట్లు నోటా పార్టీ అధ్యక్షురాలు సవితా భట్టీ తెలిపారు. అయితే తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని, తీసుకోనని స్పష్టం చేశారు.
తమ పార్టీలో చేరడానికి కొన్ని ప్రధాన అర్హతలు కావాలని ఆమె ప్రకటించారు. కనీసం 200 వందల కోట్ల రూపాయల కుంభకోణం చేసి ఉండాలి లేదా 20 క్రిమినల్ కేసులైనా ఉన్నవారు పార్టీలో చేరేందుకు అర్హులని ఆమె చెప్పారు. మరో విషయం కూడా ఆమె చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అడుగడుగునా దాడులు ఎదురవుతున్నాయి. ఈ దాడులను దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. తమ అభ్యర్థులకు వస్తాదులు, మల్లయోధులు వంటివారితో శిక్షణ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం డబ్ల్యూడబ్ల్యూఇ మల్లయోధులతో మాట్లాడినట్లు తెలిపారు. కొత్తకొత్త కిక్స్, జంప్స్ గురించి చర్చిస్తున్నట్లు ఆమె తనదైన శైలిలో వివరించారు.
ఎన్నికల ప్రక్రియలో జరిగే అవినీతిని తన టివి షోలలో జస్పాల్ భట్టీ ఎండగడుతూ ఉండేవారు. ఆయన సతీమణి సవితా బట్టీ కూడా దానిని కొనసాగిస్తున్నారు.