ఆ 8 మందీ అదృష్టవంతులే! | Lucky to the 8 Mps | Sakshi
Sakshi News home page

ఆ 8 మందీ అదృష్టవంతులే!

Published Sun, May 18 2014 8:48 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

వైవి సుబ్బారెడ్డి - వరప్రసాద్‌ - పొంగులేటి శ్రీనివాస రెడ్డి - సీతారాంనాయక్ - విశ్వేశ్వర రెడ్డి-మాల్యాద్రి శ్రీరామ్-శివప్రసాద్- తోట నరసింహం - Sakshi

వైవి సుబ్బారెడ్డి - వరప్రసాద్‌ - పొంగులేటి శ్రీనివాస రెడ్డి - సీతారాంనాయక్ - విశ్వేశ్వర రెడ్డి-మాల్యాద్రి శ్రీరామ్-శివప్రసాద్- తోట నరసింహం

మన రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో లోక్సభ సభ్యులుగా గెలిచిన వారిలో 8 మంది అదృష్టవంతులు ఉన్నారు.  సాదారణంగా ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో  ఏడు శాసనసభ స్థానాలు ఉంటాయి. వాటిలో కనీసం నాలుగు స్థానాలలో ఏ పార్టీ గెలుస్తుందో, ఆ పార్టీకి చెందిన అభ్యర్థే లోక్సభ సభ్యుడుగా ఎన్నికవుతారు. ఒక పార్టీ నాలుగు కంటే తక్కువ స్థానాలలో గెలిచినా, ఆ పార్టీ అభ్యర్థే లోక్సభకు ఎన్నికైతే అదృష్టవంతుడిగా భావించవచ్చు. ఈ సారి ఎన్నికలలో ఆ విధమైన అదృష్టవంతుల జాబితాలో 8 మంది చేరారు.

 కాకినాడ లోక్సభ స్థానంలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట శాసనసభ స్థానాలలో వైఎస్ఆర్ సిపి గెలిచింది. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం స్థానాల్లో టీడీపీ గెలిచింది. పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థి వర్మ గెలుపొందారు. టిడిపి మూడు స్థానాలే గెలిచినప్పటికీ  అదృష్టం వరించడంతో లోక్సభకు ఆ పార్టీ అభ్యర్థి తోట నరసింహం గెలుపొందారు.  బాపట్ల  లోక్సభ స్థానంలో కూడా ఇదే పరిస్థితి. వేమూరు, రేపల్లె, పర్చూరులలో టిడిపి గెలిచింది. బాపట్ల, అద్దంకి, సంతనూతలపాడులలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు విజయం సాధించారు. చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ గెలిచారు. కానీ ఇక్కడ టిడిపి అభ్యర్థి  మాల్యాద్రి శ్రీరామ్ లోక్సభ సభ్యుడుగా గెలిచారు. పిఠాపురంలో టిడిపి తిరుగుబాటు అభ్యర్థి గెలిస్తే, చీరాలలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు. అయినా ఇక్కడ కూడా అదృష్టం వరించడంతో టిడిపి అభ్యర్థే ఎంపిగా విజయం సాధించారు. స్వంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు చోట్ల టిడిపి అభ్యర్థులే ఎంపిలుగా గెలిచారు.

ఒంగోలు లోక్సభ స్థానంలో ఒంగోలు, దర్శి, కనిగిరి, కొండేపి శాసనసభ స్థానాలు నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థులే గెలుపొందారు. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరులలో మాత్రమే   వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసి రావడంతో   వైఎస్ఆర్ సిపి అభ్యర్థి  వైవి సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడుగా గెలిచారు. తిరుపతిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ  తిరుమల శ్రీవారి కరుణా కటాక్షం  వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వరప్రసాద రావుకి లభించింది. ఇక్కడ తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచారు. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. టిడిపి నాలుగు చోట్ల గెలిచినప్పటికీ  ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి వరప్రసాద్‌ విజయం సాధించారు.

చిత్తూరు ఫలితం మరీ విచిత్రంగా ఉంది.  టీడీపీ లోక్సభ అభ్యర్థి శివప్రసాద్ గొప్ప అదృష్టవంతుడు. ఇక్కడ చంద్రగిరి, నగరి, పూతలపట్టు, పలమనేరు, గంగాధర నెల్లూరు అయిదు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు.  చిత్తూరు, కుప్పం రెండు చోట్ల మాత్రమే టిడిపి అభ్యర్థులు గెలిచారు. అయినా టిడిపి అభ్యర్థి శివప్రసాద్ ఎంపిగా విజయం సాధించారు. దానికి ప్రధాన కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడుకి 47 వేల ఓట్లు మెజార్టీ రావడమే. దాంతో శివప్రసాద్ విజయం సాధించారు.

ఇక తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పినపాకలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి, భద్రాచలంలో  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థి గెలిచారు. డోర్నకల్, ఇల్లందులలో కాంగ్రెస్ అభ్యర్థులు,  మహబూబాబాద్, ములుగులలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కేవలం రెండు శాసనసభ నియోజకవర్గాలలోనే గెలిచిన  టీఆర్‌ఎస్కు చెందిన అభ్యర్థి సీతారాంనాయక్  లోక్సభకు ఎన్నికడం విశేషం! చేవెళ్లలో కూడా ఇదే పరిస్థితి. ఈ లోక్సభ నియోజకవర్గంలో టిఆర్ఎస్ రెండు శాసనసభ స్థానాలనే గెలుచుకున్నా టిఆర్ఎస్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి ఎంపిగా ఎన్నికయ్యారు. ఇక్కడ మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలలో టిడిపి, చేవెళ్ల, పరిగిలలో కాంగ్రెస్, వికారాబాద్, తాండూరులలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా అదృష్టం కలసిరావడంతో లోక్సభకు టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.

 ఖమ్మం లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని అదృష్టం వరించింది. ఇక్కడ వైరా, అశ్వరావుపేటలలో మాత్రమే వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలిచారు. ఖమ్మం, పాలేరు, మదిరలలో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తుపల్లిలో టిడిపి, కొత్తగూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయినా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి  శ్రీనివాస రెడ్డి విజయం సాధించడం విశేషం. ఈ విధంగా ఈ 8 మందిని అదృష్టవంతులుగా భావించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement