ఎంపీలుగా గెలవడానికీ ఓ లెక్కుంది! | Calculations to win as MP | Sakshi
Sakshi News home page

ఎంపీలుగా గెలవడానికీ ఓ లెక్కుంది!

Published Sun, May 18 2014 7:11 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

వైవి సుబ్బారెడ్డి, శివ ప్రసాద్, సీతారామ్ నాయక్, కొత్తపల్లి గీత, కె.రామ్మోహన్ నాయుడు - Sakshi

వైవి సుబ్బారెడ్డి, శివ ప్రసాద్, సీతారామ్ నాయక్, కొత్తపల్లి గీత, కె.రామ్మోహన్ నాయుడు

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ 63 స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో 11 చోట్ల విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలలో  వైఎస్ఆర్ సిపి 67 స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో 8 చోట్ల  గెలిచింది. అసెంబ్లీ సీట్ల సంఖ్యాపరంగా పరిశీలిస్తే  తెలంగాణలో టీఆర్‌ఎస్ కన్నా ఏపిలో వైఎస్సార్‌సీపీ నాలుగు అసెంబ్లీ స్థానాలు అధికంగా కైవసం చేసుకున్నప్పటికీ  లోక్ సభ స్థానాలు వచ్చేసరికి మూడు తక్కువగా వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని పరిశీలిస్తే, దానికీ ఓ లెక్క ఉందని తేలింది.  దానికి తోడు లక్కు కూడా ఉందనిపిస్తోంది.

 సీమాంధ్రలో చోటుచేసుకున్న అంశాల్లోకి వెళితే..  కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కడప జిల్లా రాజంపేటలోనూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖపట్నంలోనూ పరాజయం పాలయ్యారు.  ఇలా ప్రముఖ వ్యక్తుల ఓటమి, పెద్దగా పేరు కూడా లేని వ్యక్తులు చక్కటి మెజార్టీలతో గెలవడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయనేది తెలిసిందే. సుమారు పది లక్షల పైగా ఓటర్లు ఉంటారు. ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఓట్లు అందరినీ  కలవడం అసాధ్యం. మరి ఈ పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులు విజయసోపానాలు ఎక్కాలంటే.. తప్పని సరిగా తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులపై ఆధారపడక తప్పదు. అంటే సమర్థులైన అభ్యర్థులు అసెంబ్లీ బరిలో ఉంటే ఎంపీల ఎన్నిక సునాయాసం  అవుతుందనడంలో సందేహం లేదు. కనీసం ఏడు అసెంబ్లీస్థానాల్లో నాలుగు సీట్లు ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ అభ్యర్థి ఎంపిగా ఎన్నికైనట్లే. ఒక్కోసారి తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఎంపి అభ్యర్థి గెలిచాడంటే అక్కడ లక్కు తోడైనట్లే భావించాలి.

సీమాంధ్రలోని 25 ఎంపీ స్థానాల్లో ఫలితాలను ఓసారి పరిశీలిస్తే  అరకు ఎంపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొత్తపల్లి ‘గీత’ మారిందంటే అక్కడి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.  శ్రీకాకుళంలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ  టీడీపీ అభ్యర్థులు ఆరుగురు గెలవడంతో కింజారపు రామ్మోహన్‌నాయుడు ఎన్నిక లాంఛనమే అయింది. విజయనగరంలో అయిదు స్థానాలలో టీడీపీ, రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలవడంతో ఎంపీ స్థానం సునాయాసంగా టీడీపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజుకు దక్కింది. విశాఖలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలవకపోవడంతో ఎంపీ స్థానంలో పోటీచేసిన ప్రముఖ వ్యక్తి విజయమ్మ కూడా ఓటమి చవిచూడవలసి వచ్చింది.  అనకాపల్లిలోనూ ఆరు టీడీపీ, ఒక స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో ఎంపీ స్థానం అవలీలగా టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. అయితే కాకినాడ ఎంపీ స్థానం ఫలితాన్ని విశ్లేషిస్తే.. ఇక్కడ టీడీపీ అభ్యర్థి తోట నర్సింహంకు లక్కు తోడైందనడంలో సందేహం లేదు. ఈ ఎంపీ స్థానం పరిధిలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో వైఎస్సార్‌సీపీ, కాకినాడ రూరల్, సిటీ, పెద్దాపురం స్థానాల్లో టీడీపీ, పిఠాపురంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అదృష్టం కూడా కలిసిరావడంతో ఇక్కడ ఎంపీ స్థానంలో స్వల్ప మెజారిటీతో టీడీపీ గెలించింది. అమలాపురంలో ఆరు చోట్ల టీడీపీ, రాజమండ్రిలో టీడీపీ, బీజేపీలు ఏడుస్థానాల్లో, నరసాపురంలోనూ  ఇదే పరిస్థితి  చోటుచేసుకోవడంతో ఈ మూడు స్థానాలు టీడీపీ, బీజేపీ వశమయ్యాయి. ఏలూరులో ఐదు టీడీపీ, ఒకచోట బీజేపీ, మరోచోట వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. ఈ లెక్కన ఈ ఎంపీ స్థానం కూడా టీడీపీ ఖాతాలోకి  వెళ్లిపోయింది. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో రెండేసి వంతున మాత్రమే వైఎస్సార్ సీపీ గెలవడంతో ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలవగలిగారు. బాపట్లలో అయితే చెరి మూడు చోట్ల టీడీపీ, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలవగా, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థికి అదృష్టం తోడవడంతో కొద్దిపాటి మెజారిటీతో గెలవగలిగారు. ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెండు చోట్ల టిడిపి అభ్యర్థులే ఎంపిలుగా గెలిచారు.

ఈ రకమైన అంచనాలకు  భిన్నంగా ఒంగోలులో జరిగింది. ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు చోట్ల టీడీపీ, మూడు చోట్ల మాత్రమే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీ స్థానం మాత్రం వైఎస్సార్ సీపీకి దక్కడ విశేషం! ఇక్కడ వైవి సుబ్బారెడ్డికి అదృష్టం కలసి వచ్చినట్లుగా భావించాలి. నంద్యాలలో ఆరు అసెంబ్లీ స్థానాలలో, కర్నూలులో ఐదు సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో ఈ రెండు చోట్ల  ఆ పార్టీ అభ్యర్థులు అవలీలగా గెలవగలిగారు. అనంతపురం, హిందూపురంలలో ఆరేసి చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలవడంతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం సులువైంది. కడపలో అన్ని స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవడంతో అక్కడి ఎంపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకలా సాగింది. నెల్లూరులోనూ ఐదు చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపుతో ఎంపీ అభ్యర్థి విజయం సులువైంది.

తిరుపతిలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి వెంకన్న కరుణ లభించినట్లుంది. ఇక్కడ నాలుగు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలిచినా, ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.  ఇక రాజంపేటను పరిశీలిస్తే.. ఐదు చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఇక్కడ పోటీచేసిన  పురందేశ్వరి ఓటమి చవిచూడాల్సివచ్చింది. చిత్తూరు ఫలితం విచిత్రంగా ఉంది. ఇక్కడి ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందినా టీడీపీ ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అతనికి అదృష్టం జిడ్డులా పట్టుకుందనుకోవాలి.  
తెలంగాణలో
ఇక తెలంగాణలో ఎంపీ స్థానాల్లో సరళి కూడా ఇంచుమించు ఇదేరీతిలో ఉంది. ప్రధానంగా  ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో చిత్రాతిత్రాలు చోటుచేసుకున్నట్లు విశదమవుతోంది.  అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగు టీడీపీ, ఒక చోట బీజేపీ, రెండు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. దీంతో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి విజయం వరించింది. మహబూబాబాద్‌లోని ఏడు అసెంబ్లీ సీట్లలో డోర్నకల్, ఇల్లందుల్లో కాంగ్రెస్, మహబూబాబాద్, ములుగులలో టీఆర్‌ఎస్, నర్సంపేటలో స్వతంత్ర అభ్యర్థి, పినపాకలో వైఎస్సార్ సీపీ, భద్రాచలంలో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఎంపీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సీతారాంనాయక్ గెలుపొందడం విశేషం!

చేవెళ్ల ఎంపీ స్థానంలో టీఆర్ ఎస్ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి విశ్వాసం పొందగలిగారు. అయితే, ఈ ఎంపీ స్థానం పరిధిలో మూడు చోట్ల టీడీపీ, రెండు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే మూడు చోట్ల టీఆర్‌ఎస్ రెండోస్థానంలో ఉండడంతో ఎంపీ స్థానం ఆ పార్టీ దక్కించుకోగలిగింది. ఇక ఖమ్మం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ మూడు చోట్ల కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ రెండు చోట్ల, టీడీపీ, టీఆర్‌ఎస్ ఒక్కోచోట గెలుపొందాయి. టీడీపీ నాలుగుచోట్ల రెండోస్థానంలో నిలిచినా విజయం వైఎస్సార్‌సీపీనే వరించడం అదృష్టమే. ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తే.. ఎంపీ అభ్యర్థుల విజయావకాశాలు తమ వ్యక్తిగత నేపథ్యం కన్నా, తమ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల గెలుపును బట్టే ఉంటుందనేది స్పష్టమవుతోంది. ఇందుకు భిన్నంగా ఫలితం వస్తే అక్కడ అభ్యర్థిని అదృష్టం వరించినట్లే చెప్పుకోవాలి.

- అవ్వారు శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement