భవితవ్యం.. తేలేది నేడే
సాక్షిప్రతినిధి, నల్లగొండ: రెండు వారాల ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. గత నెల 30వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ పూర్తయిన తర్వాత ఓటింగ్ సరళిని బేరీజు వేసుకుంటూ అభ్యర్థుల గెలుపోటములపై విపరీతమైన చర్చ జరిగింది. ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు గట్టారు. సమీకరణలతో కుస్తీలు పట్టారు. తమ పార్టీ అభ్యర్థి ఎలా గట్టెక్కుతారో విశ్లేషించారు. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమాతోనే ఉన్నాయి.
కాగా, మరో వైపు ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వారు ఒకింత ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే అయిదారు ఎన్నికలను ఎదుర్కొన్న సీనియర్లు, మూడు నాలుగుసార్లు విజయం సాధించిన వారు తమ గెలుపు అవకాశాలపై గుంభనంగానే గడిపారు. ఎవరెన్ని సమీకరణలతో తలలు బద్దలు కొట్టుకున్నా, తమకున్న సీనియారిటీ, పోల్‌మేనేజ్‌మెంటు అండగా బయట పడతామన్నది వీరి వాదన. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 161మంది, 2 లోక్‌సభ నియోజకవర్గాలకు 22మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగడంతో ఓట్ల చీలిక అనివార్యం అయింది.
దీంతో ఎవరు గెలుస్తారో అంచనా వేయడం ఒకింత క్లిష్టంగానే మారింది. అయితే, మండలాలు, గ్రామాలు, బూత్‌ల వారీగా ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు పోలైన ఓట్లపై ఓ అంచనాతో ఉన్నాయి. వీటి ఆధారంగానే ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎవరికి గట్టి పోటీ ఇచ్చారు..? ఎవరు విజయం సాధించే అవకాశం ఉందన్న అంశంపై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నది ఆ పార్టీ నేతల బలమైన విశ్వాసం. పుర, స్థానిక ఎన్నికలకు ముగిశాక రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందని, గాలి తమకు అనుకూలంగా వీచిందన్నది టీఆర్‌ఎస్ వాదన. మరోవైపు సిట్టింగ్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని మరికొందరు అభ్యర్థుల అభిప్రాయం. ఇలా, ఎవరికి వారు తమకు అనుకూలమైన వాదనే వినిపిస్తున్నారు.
సెంటిమెంట్ ఓటే కీలకం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికలు కావడంతో తెలంగాణ సెంటిమెంటు ఓటు కీలకంగా మారింది. అయితే, టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఇలా.. ప్రతి పార్టీ తెలంగాణవాదం వినిపించి, తమకు ఆ ఓటు అన్న ధీమాతో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లు, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసిన స్థానాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ లో టీఆర్‌ఎస్ నుంచి చివరి నిమిషంలో బరిలోకి దిగిన నోముల నర్సింహయ్యపై అంచనాలు పెరిగిపోవడంతో జిల్లాలో, జిల్లా బయట ఈ నియోజకవర్గం గురించి ఎక్కువమంది ఆరా తీశారు. అదే మాదిరిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో ఒకైవె పు వైఎస్సార్ కాంగ్రెస్, మరోవైపు టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇవ్వడంతో ఇక్కడ గెలుపు ఎవరిదనే అంచనా కష్టంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమయింది.
సూర్యాపేట, నల్లగొండలలో సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌తో పాటు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి అనుకోని పోటీ ఎదురైంది. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాలపై ఎక్కడ చూసినా చర్చే కనిపించింది. రెండు మూడు మినహా, అన్ని నియోజకర్గాల్లో అభ్యర్థుల మధ్య పోటీ పోటాపోటీగా ఉండడంతో బెట్టింగ్‌లకు అవకాశం ఏర్పడింది. జిల్లాలో ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలపై బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం మొదలయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికే ఓ ముఖచిత్రాన్ని ఆవిష్కరించనుంది. దీంతో అభ్యర్థుల భవితవ్యమూ తేలనుంది.