నగరవాసులకు 52 వెరై'టీ'లు..
హైదరాబాదీలు టీ ప్రియులే కాదు, వెరై‘టీ’ ప్రియులు కూడా. ఇరానీ, బ్లాక్ టీ, లెమన్ టీ, జింజర్, మసాలా టీ వంటి టీ వెరైటీలు అందరికీ తెలిసినవే. వెరై‘టీ’లు కోరుకునే వారికోసం బంజారాహిల్స్ రోడ్ నం: 7లో ‘ఫిన్జాన్’ కొలువుదీరింది. ఫిన్జాన్ లాంజ్‌లోకి అడుగుపెడుతూనే హైదరాబాదీ నవాబీ సంప్రదాయ చాయ్ ఘుమఘుమలు స్వాగతం పలుకుతాయి. రకరకాల ఫ్లేవర్లతో ఈ లాంజ్ ఏకంగా 52 వైరై‘టీ’లను అందిస్తోంది.
మన దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన టీ రకాలతో పాటు పలు విదేశీ రకాల టీ కూడా ఇక్కడ దొరుకుతుంది. డార్జిలింగ్, నీలగిరి, అస్సాం, ఆఫ్రికా, చైనా తదితర ప్రాంతాలకు చెందిన నాణ్యమైన తేయాకుతో ఇక్కడ వివిధ రకాల టీలు నగరవాసులకు రుచి చూపిస్తున్నారు. ఒక్కో టీ ఒక్కో వెరై‘టీ’. రుచిలోను, ఘుమఘుమల్లోనూ దేని పరిమళం దానిదే.
వైట్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెల్త్ టీ, గోల్డ్‌టీ, పిన్ టీ, ఎల్లో టీ, రెడ్ టీ, బ్లూ టీ, ఐస్డ్ టీ వంటి పలు రకాల టీలను ఇక్కడ ఆస్వాదించవచ్చు. నగర వాసులకు వెరై‘టీ’లు రుచి చూపిస్తున్న ‘ఫిన్జాన్’ సంస్థ 1920లో ప్రారంభమైంది. అయితే, 1964లో టీ బిజినెస్‌లోకి అడుగు పెట్టింది. తాము అందించే టీలలో వాడే నాణ్యమైన తేయాకుల్లో గల అమినో యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.
- సిరి